English | Telugu

700 సినిమాల్లో.. 200 తాగుబోతు క్యారెక్టర్లు పోషించి తనకు తానే సాటి అనిపించుకున్న ఎం.ఎస్‌.!

సినిమాల్లోని తాగుబోతు క్యారెక్టర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. సాధారణంగా తాగుబోతు క్యారెక్టర్లు చేసేవాళ్ళ నటనలో కొంత ఓవరాక్షన్‌ ఉంటుంది. నిజజీవితంలో తాగుబోతులు ఇలా చేయరు కదా అనిపిస్తుంది. కానీ, అలాంటి అపవాదులు రాకుండా తను చేసే తాగుబోతు క్యారెక్టర్‌లో ఎంతో వైవిధ్యాన్ని, విభిన్నత్వాన్ని చూపించిన నటుడు ఎం.ఎస్‌.నారాయణ. ఆయన కెరీర్‌లో చేసిన 700 సినిమాల్లో 200కి పైగా తాగుబోతు క్యారెక్టర్లే చేశారంటే ఆ పాత్రలను ఎంత అద్భుతంగా పోషించారో అర్థం చేసుకోవచ్చు. నటనలో, డైలాగ్‌ డెలివరీలో, బాడీ లాంగ్వేజ్‌లో ఎవరినీ ఇమిటేట్‌ చెయ్యకుండా తన సొంతంగా ఏర్పరచుకున్న శైలిలో ఆయా పాత్రలకు న్యాయం చేసి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన నటుడు ఎం.ఎస్‌.నారాయణ. ఏప్రిల్‌ 16 కమెడియన్‌ ఎం.ఎస్‌.నారాయణ జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

‘రుక్మిణి’ చిత్రంలో తొలిసారి తాగుబోతు క్యారెక్టర్‌ పోషించారు ఎం.ఎస్‌. ఆ సినిమాలో చేసిన ఆ క్యారెక్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో ఆ తరహా క్యారెక్టర్లే ఆయనకు ఎక్కువగా వచ్చేవి. 200 సినిమాల్లో ఆ తరహా క్యారెక్టర్లే చేసిన ఎమ్మెస్‌కి వాటి మీద మోజు పోలేదు. ఒకే క్యారెక్టర్‌ను మళ్ళీ మళ్ళీ చూసినా ప్రేక్షకులకు కూడా బోర్‌ కొట్టలేదు. తాగుబోతుగా ఎమ్మెస్‌ చెప్పే డైలాగ్స్‌ను బాగా ఎంజాయ్‌ చేశారు. ఆడియన్స్‌ దాన్ని ఎప్పుడూ మొనాటనీగా ఫీల్‌ అవ్వలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ ఘనత ఒక్క ఎం.ఎస్‌.నారాయణకే దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు ఎమ్మెస్‌. తల్లి ప్రోత్సాహంతో ఉన్నతమైన చదువును అభ్యసించాడు. ఆరోజుల్లో ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ దగ్గర శిష్యరికం చేశాడు. అది తను రచయితగా స్థిరపడేందుకు ఎంతో దోహదం చేసిందంటారు ఎమ్మెస్‌. తన క్లాస్‌మేట్‌ కళాప్రపూర్ణను ప్రేమించారు. పరుచూరి గోపాలకృష్ణ దగ్గరుండి వారికి పెళ్లి చేయడం విశేషం. ఆ తర్వాత రవిరాజా పినిశెట్టి దగ్గర ఎం.ఎస్‌.నారాయణ రచయితగా చేరారు. ఆయనలోని నటుడిని మొదట గుర్తించింది రవిరాజే.ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ.’ చిత్రంలో మొదటిసారి నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసారు ఎమ్మెస్‌. స్టోరీ డిస్కషన్స్‌లో అతని బాడీ లాంగ్వేజ్‌, ఏదైనా పార్టీలో డ్రిరక్‌ చేస్తున్నప్పుడు అతను మాట్లాడే విధానం రవిరాజాకు బాగా నచ్చాయి. అందుకే ‘రుక్మిణి’ చిత్రంలో నాగబాబు పక్కనే ఓ తాగుబోతు క్యారెక్టర్‌ను ఎమ్మెస్‌తో చేయించారు. తను ఆ క్యారెక్టర్‌ చెయ్యగలనా అనే సందేహం వచ్చింది ఎమ్మెస్‌కి. నువ్వు తప్పకుండా చెయ్యగలవు అని అతనిలో కాన్ఫిడెన్స్‌ను నింపారు రవిరాజా. మొదటిసారి ఎమ్మెస్‌ చేసిన తాగుబోతు క్యారెక్టర్‌కి చాలా మంచి పేరు వచ్చింది.

ఇక్క అప్పటి నుంచి తాగుబోతు క్యారెక్టర్‌ చెయ్యాలంటే ఎమ్మెస్‌నే పెట్టుకోవాలి అని దర్శకనిర్మాతలు భావించేవారు. ఆ తర్వాత ఎం.ఎస్‌.కి బాగా పేరు తెచ్చిన సినిమా ‘మా నాన్నకు పెళ్లి’. ఈ చిత్రంలో తాగుబోతుగా ఆయన చేసిన కామెడీని ఆడియన్స్‌ విపరీతంగా ఎంజాయ్‌ చేశారు. ఈ సినిమాలోని 400 అడుగుల సీన్‌ని సింగిల్‌ షాట్‌లో చేసి సెట్‌లో అందరిచేత శభాష్‌ అనిపించుకున్నారు. రచయిత అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి తర్వాత నటుడిగా స్థిరపడిన ఎమ్మెస్‌ కొన్ని వందల సినిమాల్లో తన అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాగుబోతు క్యారెక్టర్‌ చేయడం, దానితోనే కామెడీని పండిరచడంలో తనకెవరూ సాటిలేరని అప్పట్లోనే నిరూపించారు ఎమ్మెస్‌.