English | Telugu
రజినీకాంత్ + కమల్‌హాసన్ = చిరంజీవి అని కన్‌ఫర్మ్ చేసిన టాప్ డైరెక్టర్!
Updated : Aug 21, 2025
(ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా..)
మెగాస్టార్ చిరంజీవి జీవితం గురించి, ఆయన సినిమాల్లో ఎదిగిన తీరు గురించి అందరికీ తెలుసు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజిఆర్, శివాజీ గణేశన్ తర్వాత ఆ స్థానాలను భర్తీ చేసిన హీరోలు రజినీకాంత్, కమల్‌హాసన్. వీరిద్దరికీ గురువు ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్. హీరోలుగా వారి ఎదుగుదలలో బాలచందర్ పాత్ర ఎంతో ఉంది. ఒక దశలో తన శిష్యులను కూడా పక్కన పెట్టి రజినీకాంత్ + కమల్‌హాసన్ = చిరంజీవి అని ఒక వేదికపై ప్రకటించారు. తన సినిమాల ద్వారా హీరోలుగా ఎదిగి టాప్ పొజిషన్‌కి వచ్చిన తన శిష్యులను కాదని, చిరంజీవిని అంతగా మెచ్చుకోవడానికి రీజన్ ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకుందాం.
రజినీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి... ఈ ముగ్గురిలో కమల్‌హాసన్ నటుడిగా చాలా సీనియర్. 1960లో జెమినీ గణేశన్, సావిత్రి జంటగా నటించిన ‘కలతూర్ కన్నమ్మ’ అనే తమిళ సినిమాలో నాలుగేళ్ళ వయసులోనే నటుడిగా పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో బాలనటుడిగా చేసిన తర్వాత తంగప్ప వంటి డాన్స్‌మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. 1973లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అరంగేట్రం’ చిత్రంతో హీరోగా మారారు కమల్. ఆ తర్వాత హీరోగా అతను ఏ స్థాయికి వెళ్లారో అందరికీ తెలిసిందే.
రజినీకాంత్‌లోని టాలెంట్‌ని గుర్తించిన స్నేహితులు ఆర్థిక సాయం చేయడం వల్ల మద్రాస్‌లోని ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు రజినీ. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులో బాలచందర్ చేసిన ‘అంతులేని కథ’ చిత్రంలో హీరోయిన్‌కి అన్నయ్యగా ఒక విభిన్నమైన పాత్ర పోషించారు. ఈ సినిమా రజినీకి చాలా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో అతని స్టైల్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా వరసగా సినిమాలు చేస్తూ వస్తున్న రజినీ కెరీర్ బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘తప్పు తాళంగళ్’ చిత్రంతో టర్న్ తీసుకుంది. రజినీతో యాక్షన్ సినిమాలు చెయ్యొచ్చు అని డైరెక్టర్ ఎస్.పి.ముత్తురామన్ భావించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వరసగా యాక్షన్ సినిమాలు వచ్చాయి. తమిళ్‌తోపాటు తెలుగులోనూ రజినీకి అభిమానులు ఉన్నప్పటికీ ‘బాషా’ తర్వాత అభిమానగణం మరింత పెరిగింది.
ఇక చిరంజీవి కెరీర్ గురించి చెప్పాలంటే.. మొదట నటించిన సినిమా పునాదిరాళ్లు చిత్రం అయినప్పటికీ మొదట రిలీజ్ అయిన సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా తర్వాత రజినీ మాదిరిగానే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా.. చాలా సినిమాలు చేశారు. 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిరంజీవి సినీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు తర్వాత తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఖైదీ సినిమా ఎంతో బాగా ఉపయోగపడింది. అయితే అంతకుముందు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో చిరంజీవి శాడిస్ట్ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. ఈ సినిమా తమిళ్ వెర్షన్‌లో రజినీ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేశారు. అయితే దర్శకుడు కె.బాలచందర్‌కు చిరంజీవి పెర్‌ఫార్మెన్స్ బాగా నచ్చింది. అ తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘47 రోజులు’ సినిమాలోనూ అదే తరహా పాత్ర పోషించి బాలచందర్ ప్రశంసలు అందుకున్నారు చిరంజీవి.
బాలచందర్ కాంపౌండ్ నుంచి వచ్చిన రజినీకాంత్, కమల్‌హాసన్.. ఒకరు యాక్షన్ సినిమాల ద్వారా, మరొకరు వైవిధ్యమైన సినిమాలు, క్లాస్ మూవీస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ ఇద్దరిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ చిరంజీవిలో ఉన్నాయని బాలచందర్ అభిప్రాయం. అందుకే రజినీకాంత్, కమల్‌హాసన్ కలిస్తే చిరంజీవి అని ప్రకటించారు బాలచందర్.