English | Telugu

మెగా ప్రొడ్యూసర్‌గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అల్లు అరవింద్‌!

మెగా ప్రొడ్యూసర్‌గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అల్లు అరవింద్‌!

(జనవరి 10 నిర్మాత అల్లు అరవింద్‌ పుట్టినరోజు సందర్భంగా..)

హాస్య నటచక్రవర్తి అల్లు రామలింగయ్య తన కామెడీతో ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్‌టైన్‌ చేసేవారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన కుమారుడిగా నట వారసత్వాన్ని తీసుకోకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో ప్రవేశించి అద్భుతమైన విజయాలు అందుకున్న నిర్మాత అల్లు అరవింద్‌. మెగాస్టార్‌ చిరంజీవి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. 50 సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న అల్లు అరవింద్‌ వ్యక్తిగత జీవితం, సినీరంగ ప్రవేశం, ఆయన సాధించిన విజయాలు.. వంటి విషయాల గురించి ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. 

1949 జనవరి 10న అల్లు రామలింగయ్య, కనకరత్నమ్మ దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు అల్లు అరవింద్‌. ఆయనకు ఒక అక్క, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అరవింద్‌ పుట్టిన రెండేళ్ళ తర్వాతే అల్లు రామలింగయ్య ‘పుట్టిల్లు’ చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రిలాగే తను కూడా నటుడు అవ్వాలనుకున్నారు. కానీ, ఓ సంఘటన తన నిర్ణయం మార్చుకునేలా చేసింది. ఓరోజు షూటింగ్‌లో అల్లు రామలింగయ్య ఎక్కువ టేకులు తీసుకోవడంతో డైరెక్టర్‌ ఆయన్ని తిట్టారట. ఆ విషయాన్ని తన భార్యతో చెప్పి అల్లు రామలింగయ్య బాధపడడం అరవింద్‌ చూశారు. ఆ క్షణమే నటుడు అవ్వకూడదని డిసైడ్‌ అయ్యారు. ఒకరి దగ్గర మనం పని చెయ్యకూడదని, మనమే పది మందికి పని ఇచ్చే స్థితిలో ఉండాలని అనుకున్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత అరవింద్‌కి తెలియకుండా ఓ బ్యాంక్‌లో ఉద్యోగం ఏర్పాటు చేశారు అల్లు రామలింగయ్య. ఆ విషయం తెలుసుకున్న అరవింద్‌.. తను ఉద్యోగం చెయ్యనని వ్యాపారం చేస్తానని చెప్పారు. కొడుకు మాట కాదనలేక సరేనన్నారు. 

ఎక్కడికో వెళ్లి వ్యాపారం చెయ్యడం ఎందుకు.. సినిమా రంగంలోనే నిర్మాతగా కొనసాగితే బాగుంటుంది కదా అనిపించింది అరవింద్‌కి. ఆ సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో బంట్రోతు భార్య చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత దాసరి సత్యనారాయణమూర్తి. ఆ సినిమాకి పార్టనర్‌గా అల్లు అరవింద్‌ జాయిన్‌ అయ్యారు. 1974లో బంట్రోతు భార్య విడుదలై సక్సెస్‌ అయింది. ఆ సంవత్సరమే ఏప్రిల్‌ 7న నిర్మలను వివాహం చేసుకున్నారు అరవింద్‌. 1975లో వారికి మొదటి సంతానంగా వెంకటేష్‌ జన్మించాడు. ఆ తర్వాత మరో కుమారుడు రాజేష్‌ జన్మించాడు. బంట్రోతు భార్య చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించిన అరవింద్‌ ఆ తర్వాత సోలో నిర్మాతగా దేవుడే దిగివస్తే, మావూళ్ళో మహాశివుడు చిత్రాలు నిర్మించారు. 

ఇదిలా ఉండగా.. ఒకరోజు అల్లు రామలింగయ్యను కలిసేందుకు వారి బంధువు సత్యనారాయణ వచ్చారు. ఆయన కోసం చిరంజీవి వచ్చారు. అప్పుడు కనకరత్నమ్మ.. చిరంజీవితో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత సత్యనారాయణను పిలిపించి చిరంజీవి గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న కూతురు సురేఖను అతనికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఇదే విషయాన్ని అల్లు రామలింగయ్యకు చెప్పారు. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదు. పెద్ద కూతుర్ని డాక్టర్‌కి ఇచ్చి చేశాం. చిన్నమ్మాయిని కూడా బయటి వారికే ఇద్దామన్నారు. కానీ, కనకరత్నమ్మ మాత్రం పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావనకు తీసుకు రావడంతో చిరంజీవికి సురేఖను ఇచ్చి చెయ్యాలనుకున్నారు. అయితే నెలరోజులు చిరంజీవిని పరిశీలించిన తర్వాత 1980 ఫిబ్రవరి 20న ఇద్దరికీ వివాహం జరిపించారు. 1982 ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ జన్మించారు. ఆయన పుట్టిన కొన్నాళ్లకు అరవింద్‌ రెండో కుమారుడు రాజేష్‌ ఓ యాక్సిడెంట్‌లో మరణించాడు. ఈ విషాద ఘటన నుంచి అల్లు అరవింద్‌ కుటుంబం చాలా కాలం కోలుకోలేదు. ఆ తర్వాత 1987 మే 30న అల్లు శిరీష్‌ జన్మించాడు. ఇప్పుడు అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా హీరోగా ఏ రేంజ్‌లో ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే శిరీష్‌ మాత్రం హీరోగా రాణించలేకపోయాడు. అయినా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 

1972లో గీతా ఆర్ట్స్‌ సంస్థను ప్రారంభించిన అల్లు అరవింద్‌ మూడో సినిమాగా చిరంజీవితో నిర్మించిన శుభలేఖ చిత్రానికి మాత్రం సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో చాలా కాలం చిరంజీవితోనే సినిమాలు చేశారు. ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు రావడంతో వారితో కూడా సినిమాలు నిర్మించి మెగా ప్రొడ్యూసర్‌ అని పేరు తెచ్చుకున్నారు. రౌడీ అల్లుడు, ఎస్‌.పి.పరశురామ్‌, పరదేశి, పెళ్లిసందడి, పెళ్లాం ఊరెళితే, అన్నయ్య, బన్ని, భలే భలే మగాడివోయ్‌ వంటి సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించారు అరవింద్‌. గీతా ఆర్ట్స్‌2 అనే బేనర్‌ను స్థాపించి గీతగోవిందం, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, పక్కా కమర్షియల్‌, చావు కబురు చల్లగా, 18 పేజెస్‌ సినిమాలు నిర్మించారు. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 55 సినిమాలు నిర్మించారు. తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో నిర్మించిన సినిమాలన్నీ తెలుగులో సూపర్‌హిట్‌ అయిన సినిమాలే కావడం విశేషం. 50 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్‌ బడ్జెట్‌ విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉంటారు. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తయ్యేలా చూస్తారు. రామ్‌చరణ్‌తో నిర్మించిన మగధీర చిత్రానికి మాత్రం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బడ్జెట్‌ అయింది. అయితే ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు లాభం వచ్చింది. 

సినిమా రంగంలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టి బిజినెస్‌ చేస్తారు అరవింద్‌. అయితే ఆయన ఏ బిజినెస్‌ చేసినా సక్సెస్‌ అవుతారు. ఎందుకంటే ఆయనకు ఉన్న వ్యాపార దక్షత అలాంటిది. చిరంజీవి, నాగార్జున, మురళీమోహన్‌రాజు వంటి వారితో కలిసి మా టీవీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత దాన్ని స్టార్‌ నెట్‌వర్క్‌కి రూ.2400 కోట్లకు అమ్మేశారు. ఇటీవలికాలంలో ఓటీటీలకు ఎంతో ఆదరణ లభిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహా అనే పూర్తి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఇది కూడా చాలా పెద్ద సక్సెస్‌ అయింది. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది. ఈ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. 

అల్లు అరవింద్‌లో మంచి నటుడు కూడా ఉన్నారు. తండ్రిలాగే ఆయన కూడా కామెడీ క్యారెక్టర్లు బాగా చెయ్యగలరు. నటనపై ఆయనకు ఆసక్తి లేనప్పటికీ కొన్ని సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు పోషించారు. మావూళ్ళో మహాశివుడు, హీరో, మహానగరంలో మాయగాడు, చంటబ్బాయ్‌ వంటి సినిమాల్లో అరవింద్‌ చేసిన క్యారెక్టర్లకు మంచి స్పందన లభించింది. అయితే నటుడుగా కంటే నిర్మాతగానే కొనసాగాలన్న ఉద్దేశంతో నటన వైపు వెళ్లలేదు. ఇక ఆయన అందుకున్న అవార్డుల గురించి చెప్పాల్సి వస్తే.. పెళ్లిసందడి, మగధీర సినిమాలకు నంది అవార్డులు, మగధీరకు ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్‌ అవార్డు లభించాయి. అలాగే ఫిలింఫేర్‌ నుంచి లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డును కూడా అందుకున్నారు అల్లు అరవింద్‌.