Read more!

English | Telugu

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ రూపొందించిన కళాఖండాలలో టాప్‌ 10 మూవీస్‌ ఇవే!

తెలుగు సినిమాకు కొత్త అందాలను అద్దిన దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పిన మహానుభావుడు. తెలుగుదనం ఉట్టి పడే కథలతో సినిమాలు చేస్తూనే ఆచారాల పేరుతో అజ్ఞానంలోకి జారిపోతున్న వారిని మేల్కొలుపుతూ వారిలో చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు. ఆయనే కళాతపస్వి కె.విశ్వనాథ్‌. సంగీత ప్రధాన చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. అలాగే నృత్య ప్రధాన చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి సంగీతం, నృత్యంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఎంతో మంది కళాకారులు తయారు కావడానికి దోహదపడ్డారు. కాశీనాథుని విశ్వనాథ్‌ 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. విశ్వనాథ్‌ 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1965లో అక్కినేని కథానాయకుడిగా రూపొందిన ఆత్మగౌరవం చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన రూపొందించిన ప్రతి సినిమా కళాఖండమే. ఫిబ్రవరి 19 కళాతపస్వి కె.విశ్వనాథ్‌ జయంతి సందర్భంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 51 కళాఖండాలలో టాప్‌టెన్‌గా పేర్కొనదగిన సినిమాలు ఇవే.
1. శంకరభరణం
సంగీత ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. 1980లో విడుదలైన ఈ సినిమాను చూసి ఎంతోమంది సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. సంగీతాన్ని అభ్యసించడానికి ఉత్సాహం చూపించారు. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించే ఈ సినిమాలో శంకరాభరణం శంకరశాస్త్రిగా జె.వి.సోమయాజులు ప్రధాన పాత్ర పోషించగా, మంజుభార్గవి కీలక పాత్రలో నటించారు. చంద్రమోహన్‌, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. కె. వి. మహదేవన్‌ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్‌ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. గోవాలో 2022 నవంబరు 20 నుండి 28 వరకు జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు శంకరాభరణం ఎంపిక అయి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 
 2. సిరివెన్నెల
శాస్త్రీయ సంగీత ప్రాధాన్యం గురించి చాటి చెప్పే సినిమా ఇది. సర్వదమన్‌ బెనర్జీ, సుహాసిని, మూన్‌ మూన్‌ సేన్‌, మీనా, రోహిణి,  జె.వి.రమణమూర్తి, శుభ, సాక్షి రంగారావు, సుభలేఖ సుధాకర్‌, వరలక్ష్మి, నిత్య రవింద్రన్‌ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్‌, మూగదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలోని పాటలన్నీ ఆదరణ పొందాయి.  అన్ని పాటల్ని  సీతారామశాస్త్రి రచించారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రిగా కీర్తినార్జించారు. 
3. సాగర సంగమం
నృత్య ప్రధానంగా రూపొందిన సినిమా సాగర సంగమం. కమల్‌ హాసన్‌, జయప్రద, శరత్‌బాబు, ఎస్‌.పి.శైలజ, చక్రి తోలేటి, గీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం విశేష ఆదరణ పొందింది. ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన 10వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్‌ పనోరమకు ఎంపికైంది. ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్‌ జూబ్లీ చిత్రంగా ప్రదర్శితమైంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఈ చిత్రాన్ని ఏడాదిన్నరపాటు ప్రదర్శించారు. ఈ సినిమా తర్వాత నృత్యంపై మక్కువ పెంచుకున్న ఎందరో నృత్యాన్ని అభ్యసించి కళాకారులుగా పేరు తెచ్చుకున్నారు. 
4. స్వాతిముత్యం 
దైవ సమానుడైన ఒక అమాయకుడి కథతో రూపొందిన సినిమా ఇది. భర్త చనిపోయిన ఒక యువతిని అమాయకంగా పెళ్లి చేసుకొని ఆమె జీవితానికి ఎలా అండగా నిలిచాడు అనే కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆలోచింపజేసింది. కమల్‌హాసన్‌, రాధిక, జె.వి.సోమయాజులు గొల్లపూడి మారుతీరావు సుత్తి వీరభద్రరావు, నిర్మలమ్మ, శరత్‌ కుమార్‌, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఇళయరాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఘనవిజయం సాధించాయి. 
5. శ్రుతిలయలు
సంగీత ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. డా.రాజశేఖర్‌, సుమలత, అంజలీదేవి, కైకాల సత్యనారాయణ, జయలలిత, ముచర్ల అరుణ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. సంగీతంలోని విశిష్టతను తెలియజేసే చిత్రంగా ఇద రూపొందింది. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్‌ అందించిన సంగీతం విశేష ఆదరణ పొందింది. 
6. సిరిసిరిమువ్వ
సంగీత నృత్య ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. హైమ మూగ పిల్లకు నృత్యం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆమె సవతి తల్లి ఆమెను చిన్న చూపు చూస్తుంది. అదే ఊరిలోని సాంబయ్య అనే పేద యువకుడికి హైమ అంటే ఎంతో అభిమానం. హైమ బంధువుల దురాగతాల నుంచి ఎన్నోసార్లు ఆమెను రక్షిస్తాడు సాంబయ్య. ఆ తర్వాత పట్టణం వెళ్లిపోయిన హైమ అక్కడ నృత్యకారిణిగా మంచి పేరు తెచ్చుకుంటుంది. హైమను ఆ స్థాయికి తీసుకొచ్చిన రాంబాబును పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సాంబయ్య అనుకుంటాడు. కానీ, ఆమె సాంబయ్యను ఇష్టపడుతుంది. చివరికి అతన్నే పెళ్లి చేసుకుంటుంది. చక్కని సెంటిమెంట్‌తో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. 
7. స్వయంకృషి
చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సాంబయ్య కథే స్వయంకృషి. చిరంజీవి, విజయశాంతి, సుమలత, చరణ్‌రాజ్‌, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. రమేష్‌ నాయుడు సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. 
8. స్వర్ణకమలం
నృత్య ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. వెంకటేష్‌, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. వెంకటేష్‌ నటన, భానుప్రియ నటన, నృత్యం ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఇళయరాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఎంతో ఆదరణ పొందాయి. 
9. స్వాతికిరణం
సంగీత ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. గురువు అహంకారానికి శిష్యుడు ఎలా బలయ్యాడన్నదే ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రంలో మమ్ముట్టి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రంలో  రాధిక, మాస్టర్‌ మంజునాథ్‌, సాక్షి రంగారావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు  ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్‌ అందించిన శాస్త్రీయ సంగీతం అందరికీ మధురానుభూతిని అందించింది. 
10. ఆపద్బాంధవుడు
ప్రేమ, సెంటిమెంట్‌, త్యాగం.. వంటి అంశాలతో రూపొందిన సినిమా ఇది. చక్కని ఫ్యామిలి డ్రామాగా రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, శరత్‌బాబు, అల్లు రామలింగయ్య, గీత, బ్రహ్మానందం, కైకాల సత్యనారాయణ, సుత్తి వేలు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. యం.యం.కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలు ఘనవిజయం సాధించాయి.