English | Telugu
బయోగ్రఫీ: వెండితెర శంకరశాస్త్రి.. రంగస్థలం రామప్పంతులు.. జేవీ సోమయాజులు!
Updated : Jul 29, 2023
ఐదు పదుల ప్రాయంలో వెండితెరపై స్టార్ డమ్ చూసిన అరుదైన వైనం ఆయన సొంతం. ఒక ప్రాంతీయ చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుని.. 100కి పైగా సినిమాల్లో అలరించడం తనకే చెల్లింది. రంగస్థలంపై రామప్పంతులుగా.. వెండితెరపై శంకరశాస్త్రిగా విశేషంగా ఆకట్టుకున్న ఆ అభినయానికి మరో పేరే.. జేవీ సోమయాజులు. శతవసంతాల భారతీయ సినీ చరిత్రలో ఫోర్బ్స్ ప్రస్తావించిన 25 అత్యుత్తమ అభినయ ప్రదర్శనల్లో శంకరశాస్త్రిగా సోమయాజులుకి స్థానం దక్కిందంటే ఆ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జూలై 30.. సోమయాజులు జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు బయోగ్రఫీ రూపంలో మీ కోసం..
జేవీ సోమయాజులు పూర్తిపేరు.. జొన్నలగడ్డ వెంకట సోమయాజులు. 1928 జూలై 30న శ్రీకాకుళం జిల్లాలోని లుకాలం అగ్రహారంలో జన్మించిన సోమయాజులు.. విజయనగరంలో తన బాల్యాన్ని గడిపారు. చిన్నప్పటినుంచే నటన మీద ఆసక్తితో పలు నాటకాల్లో పాల్గొనేవారు. కాలక్రమంలో ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వాధికారి అయిన ఆయన.. అంచెలంచెలుగా డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. మరోవైపు.. తన సోదరుడు జేవీ రమణమూర్తితో కలిసి 'కన్యాశుల్కము' నాటకాన్ని ప్రదర్శించేవారు. వందల సార్లు ప్రదర్శించబడిన ఆ నాటకంలో జేవీ రమణమూర్తి గిరీశం పంతులు పాత్రలో అలరిస్తే.. రామప్పంతులు వేషంలో ఒదిగిపోయేవారు సోమయాజులు.
తన కంటే ముందే తమ్ముడు జేవీ రమణమూర్తి చిత్ర పరిశ్రమలో ప్రవేశించి నటుడిగా రాణిస్తుంటే.. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అప్పటి నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్న జేవీ సోమయాజులు 'రారా కృష్ణయ్య' సినిమాతో ఆలస్యంగా తెరంగేట్రం చేశారు. చంద్రమోహన్, మాధవి జంటగా దర్శకుడు యోగి రూపొందించిన సదరు చిత్రం ఆడకపోయినా.. సోమయాజులుకి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ 'శంకరాభరణం' రూపొందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోని ప్రధాన పాత్ర అయిన శంకరశాస్త్రి వేషం కోసం మహానటులు అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ తో పాటు రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖులను అనుకుని.. చివరికి వెండితెరపై ఏ ఇమేజ్ లేని నటుడైతే బావుంటుందని సోమయాజులుని ఎంచుకోవడం జరిగింది. విశ్వనాథ్ తీసుకున్న ఆ నిర్ణయమే.. సోమయాజులు దశని, దిశని మార్చివేసింది. నిర్మాణ దశలో ఎలాంటి అంచనాలు లేని ఈ సంగీతభరిత చిత్రం.. విడుదల తరువాత మాత్రం ఓ ప్రభంజనం సృష్టించింది. ఇందులోని పాటలతో పాటు సోమయాజులు అభినయం కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులకు సోమయాజులుగా కాకుండా శంకరశాస్త్రిగానే ఆయన గుర్తుండిపోయారంటే అతిశయోక్తి కాదు. పాత్రలో అలా పరకాయప్రవేశం చేసిన తీరే.. 'ఉత్తమ నటుడు'గా 'ఫిల్మ్ ఫేర్' అవార్డుని కూడా అందుకునేలా చేసింది. పేరుకి తెలుగు చిత్రమే అయినప్పటికీ.. భాషలతో సంబంధం లేకుండా అనేక చోట్ల 'శంకరాభరణం' విశేష ప్రజాదరణ పొందింది. దీంతో మాతృభాషతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సోమయాజులుకి అవకాశాలు క్యూ కట్టాయి. ఇంకోవైపు.. ప్రభుత్వోద్యోగిగా పదవీ విరమణ చేయడంతో సినీ రంగంవైపు పూర్తి స్థాయిలో దృష్టి సారించారాయన. అలా.. కథలోని ప్రధాన పాత్రలతో పాటు మలుపు తిప్పే వేషాల్లోనూ కనిపిస్తూ మెప్పించారాయన.
ప్రముఖ హిందీ నటుడు అనిల్ కపూర్ నటించిన తొలి తెలుగు చిత్రం 'వంశ వృక్షం'లోనూ.. ప్రముఖ తెలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి హిందీ చిత్రం 'ప్రతిబంధ్'లోనూ సోమయాజులు నటించడం ఓ విశేషమనే చెప్పాలి. అదేవిధంగా విక్టరీ వెంకటేశ్ మొదటి సినిమా 'కలియుగ పాండవులు'తో పాటు అభినేత్రి భానుప్రియ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ 'సితార'లోనూ సోమయాజులు అలరించారు. అలాగే 'స్వాతి ముత్యం', 'విజేత', 'శ్రీ షిరిడి సాయిబాబా మహాత్మ్యం', 'మజ్ను', 'స్వయంకృషి', 'అభినందన', 'అప్పుల అప్పారావు', 'ఆదిత్య 369', 'రౌడీ అల్లుడు', 'అల్లరి మొగుడు', 'సరిగమలు' వంటి విజయవంతమైన సినిమాల్లో భాగమయ్యారు. అంతేకాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ 100వ చిత్రమైన 'శ్రీరాఘవేంద్రర్'లో గురువు పాత్రలో మెప్పించారు. మరోవైపు.. టెలివిజన్ రంగంలోనూ నటుడిగా తనదైన బాణీ పలికించారు. రంగస్థలం, చిత్ర పరిశ్రమ, టెలివిజన్ రంగం.. ఇలా వేదిక ఏదైనా దాదాపు 50 ఏళ్ళ పాటు అభినయపర్వాన్ని కొనసాగించారు జేవీ సోమయాజులు. ఇక తన సోదరుడితో కలిసి 'కన్యాశుల్కము' నాటకాన్ని 45 ఏళ్ళలో 500 సార్లు ప్రదర్శించడం సోమయాజులుకి సంబంధించి ఒక రికార్డు అనే చెప్పాలి. తన విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉన్నారని.. ఆమె తన తల్లి అయిన శారదమ్మ అని పలు సందర్భాల్లో సోమయాజులు ప్రస్తావించేవారు. సోమయాజులుకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా.. ఎందుకనో వారు చిత్ర రంగంవైపు దృష్టి సారించలేదు.
కళా సేవలో భాగంగా.. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో తెలుగు థియేటర్ ని అభివృద్ధి చేసే దిశగా తన సమకాలీనులైన చాట్ల శ్రీరాములు, గరిమెళ్ళ రామమూర్తి, రాళ్ళపల్లితో కలిసి 'రసరంజిని'ని స్థాపించారు సోమయాజులు. ప్రభుత్వ సేవల నుండి పదవీ విరమణ పొందకముందు.. సాంస్కృతిక శాఖల్లో కూడా పనిచేశారు. కళాకారుడిగా విశిష్ఠ సేవలందించిన జేవీ సోమయాజులు.. 2004లో అంటే తన 76వ ఏట గుండెపోటుతో మరణించారు. భౌతికంగా దూరమైనప్పటికీ.. తన పాత్రలతో ఎప్పటికీ జనుల మదిలో నిలిచే ఉంటారు జేవీ సోమయాజులు.
(జూలై 30.. జేవీ సోమయాజులు జయంతి సందర్భంగా)