English | Telugu

ఎక్స్‌పైర్ అయిన 'పాస్‌'తో బ‌స్సెక్కిన జీవిత ఎలాంటి చిక్కుల్లో ప‌డ్డారు?

 

జీవిత చెన్నైలోని ఆద‌ర్శ విద్యాల‌య‌లో చ‌దువుకున్నారు. 1983లో ప్ల‌స్ వ‌న్ చ‌దువుతున్న రోజులు. ప్ల‌స్ వ‌న్ యాన్యువ‌ల్‌ ఎగ్జామ్స్ చివ‌రి రోజున ఓ ఘ‌ట‌న జ‌రిగింది. అప్ప‌ట్లో జీవిత వాళ్ల ఇల్లు టి. న‌గ‌ర్‌లోని జి.ఎన్‌. చెట్టి రోడ్డులో ఉండేది. రోజూ బ‌స్సులో వెళ్లిరావ‌డానికి సీజ‌న్ టికెట్ తీసుకొనేవారు జీవిత‌. అయితే లాస్ట్ ఎగ్జామ్ ముందు రోజే పాస్ డేట్ అయిపోయింది. ఒకే ఒక్క రోజు కోసం కొత్త పాస్ తీసుకోవ‌డం ఎందుకు.. దండ‌గ అనుకున్నారు.

అదీగాక స్కూల్ టైమింగ్స్‌లో బ‌స్సులు ర‌ద్దీగా ఉంటాయి. అంచేత జ‌న‌ర‌ల్‌గా బ‌స్ కండ‌క్ట‌ర్లు ఆ టైమ్‌లో బ‌స్ పాసులు చెక్ చేసి పంచ్ చేస్తూ, మిగిలిన‌వాళ్ల‌కు టికెట్లు ఇవ్వ‌డం కొంచెం క‌ష్టం క‌దా అని, పాసులున్న వాళ్ల‌ను మీ పాసులు మీరే పెన్సిల్‌తోనో, పెన్‌తోనో పంచ్ చేసుకొమ్మ‌ని చెబుతుంటారు. ఆ కార‌ణంగా ఎవ‌రు చూడొచ్చార్లే అని ఆమె ధైర్యంచేసి ఎక్స్‌పైర్ అయిన పాస్ ప‌ట్టుకొని బ‌స్సెక్కేశారు.

బ‌స్ కొంత‌దూరం వెళ్లాక కండ‌క్ట‌ర్ టికెట్లు ఇచ్చుకుంటూ జీవిత ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. టికెట్ అడిగాడు. పాస్ అని చెప్పి, ఎక్స్‌పైర్ అయిన పాస్‌ను అతినికి అందించారామె. అత‌ను పాస్ చూసి "ఇదేంట‌మ్మా నిన్న‌టితోటో ఎక్స్‌పైర్ అయిన పాసును చూపిస్తావ్‌. కొత్త పాస్ చూపించు." అని అడిగాడు. బిక్కుబిక్కుమంటూ "కొత్త పాస్ ఇంకా తియ్య‌లేదు." అని చెప్పారు జీవిత‌.

రోజూ అమ్మాయిల‌ను ఏడిపించ‌డానికి బ‌స్సుల్లో వెంబ‌డించే కొంత‌మంది స్టూడెంట్ కుర్రాళ్లు గొల్లున న‌వ్వారు. కండ‌క్ట‌ర్ టికెట్ తీసుకొన‌మ‌ని తొంద‌ర‌చేయ‌డం ప్రారంభించాడు. ఆమె చేతిలో న‌యాపైసా లేదు. సాధార‌ణంగా స్కూలుకు వెళ్లేట‌ప్పుడు ఇంట్లో డ‌బ్బు అడిగి తీసుకెళ్లే అల‌వాటు ఆమెకు లేదు. టికెట్ తీసుకుంటేనే కానీ కండ‌క్ట‌ర్ ఒప్పుకోడు. టికెట్‌కు ఆమె ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. వెన‌క నుంచి స్టూడెంట్ కుర్రాళ్లు ఎగ‌తాళి చేయ‌డం ఎక్కువైంది. అంతా ఆమెవైపే చూస్తున్నారు వింత‌గా. జీవిత‌కు త‌ల కొట్టేసిన‌ట్ల‌యింది. సిగ్గుతో కుంచించుకుపోయారు. ఏం చెయ్య‌డానికీ పాలుపోలేదు.

ఈ చిక్కులోంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌ట‌మా? అని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. చివ‌ర‌కు మ‌ధ్య‌లో దిగిపోయి స్కూలుకు న‌డిచి వెళ్లిపోవ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌టికే స్కూల్ టైమ్ అయిపోవ‌చ్చింది. స‌రిగ్గా ఆ స‌మయంలో జీవిత వాళ్ల నాన్న‌గారి ఫ్రెండ్ ఒకాయ‌న‌, త‌ర్వాత స్టాపులో అదే బ‌స్సెక్కారు. ఆయ‌న‌ను చూడ‌గానే జీవిత‌కు ప్రాణం లేచొచ్చింది. వెంట‌నే ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి జ‌రిగింది వివ‌రించి, డ‌బ్బులు అడిగి తీసుకొని టికెట్ కొన్నారు.

స్కూలుకెళ్లి చివ‌రి ఎగ్జామ్ రాసి, రాయ‌పేట నుంచి జి.ఎన్‌. చెట్టి రోడ్డులో ఉన్న త‌మ ఇంటిదాకా న‌డిచి వ‌చ్చారు. ఆ ఘ‌ట‌న త‌ర్వాత ఎప్పుడు, ఎక్క‌డికి వెళ్లినా చేతిలో డ‌బ్బులు ప‌ట్టుకొని బ‌య‌ల్దేర‌డం అల‌వాటు చేసుకున్నారు జీవిత‌.