Read more!

English | Telugu

హీరోహీరోయిన్లు లేరు.. ఫైట్లు లేవు.. అయినా శతదినోత్సవం జరుపుకున్న సినిమా అది!

సినిమా అంటే హీరో ఉండాలి, హీరోయిన్‌ ఉండాలి. వాళ్ళిద్దరికీ డ్యూయెట్లు ఉండాలి. హీరో తన హీరోయిజమ్‌ చూపించేందుకు ఓ విలన్‌ వుండాలి. ప్రేక్షకులకు మధ్య మధ్యలో రిలీఫ్‌నిచ్చేందుకు చక్కని కామెడీ ఉండాలి. ఇదీ రెగ్యులర్‌ సినిమా ఫార్మాట్‌. అలా కాకుండా ఈ అంశాలన్నీ లేకుండా విభిన్నంగా ఆలోచించే దర్శకనిర్మాతలు కూడా ఉంటారు. అప్పుడప్పుడు రెగ్యులర్‌ ఫార్మాట్‌ను బ్రేక్‌ చేస్తూ సినిమాలు తీస్తుంటారు. అది కూడా కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే చూస్తున్నాం. అలా కాకుండా 52 సంవత్సరాల క్రితమే అలాంటి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు. 

సాహసాలకు మారుపేరుగా చెప్పుకునే సూపర్‌స్టార్‌ కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రంతో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఎడారి నేపథ్యంలో ఇంగ్లీష్‌ సినిమాలను మరపించేలా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాను చూసిన పూర్ణచంద్రరావు ఆ క్షణమే తను కూడా ఎడారి బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు. 1969లో సౌత్‌ ఆఫ్రికన్‌ మూవీగా రూపొందిన ‘లాస్ట్‌ ఇన్‌ ది డిజర్ట్‌’ చిత్రం ఇండియాలోనూ రిలీజ్‌ అయింది. ఈ సినిమా అట్లూరి పూర్ణచంద్రరావును బాగా ఆకర్షించింది. ఈ సినిమా గురించి రచయిత గొల్లపూడి మారుతీరావుకి చెప్పి కథ రెడీ చెయ్యమన్నారు. ఆ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో గొల్లపూడి ఒక అద్భుతమైన కథను రెడీ చేశారు. కథ విన్న పూర్ణచంద్రరావు కూడా ఎంతో శాటిస్‌ఫై అయ్యారు. 

ఇక సినిమాను ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు పూర్ణచంద్రరావు. సినిమాలోని ప్రధాన పాత్ర కోసం మొదట మాస్టర్‌ రాముని ఎంపిక చేశారు. అయితే వయసులో చాలా చిన్నవాడిగా ఉన్న రాముని వద్దనుకొని మరొకరి కోసం ప్రయత్నించారు. చివరికి మాస్టర్‌ రామునే ఈ పాత్రకు ఎంపిక చేశారు. అతనికి తండ్రిగా ఎస్‌.వి.రంగారావు, తల్లిగా దేవికను తీసుకున్నారు. రాము మేనమామ క్యారెక్టర్‌ కోసం నగేష్‌ను సెలెక్ట్‌ చేశారు. అతని క్యారెక్టర్‌కి సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్‌ చెప్పారు. ఇక దర్శకుడిగా వి.రామచంద్రరావును ఫైనల్‌ చేశారు. సెంటిమెంట్‌ను పండిరచడంలో సిద్ధహస్తుడైన రామచంద్రరావు నేతృత్వంలో నటీనటుల ఎంపిక పూర్తయింది. 

కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను మూడొంతులు ఎడారిలో, ఒక వంతు అడవిలో చేయాలి. ఎడారిలో షూటింగ్‌ చెయ్యాలంలే రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి ఒక్కటే ఆధారం. అక్కడే షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. అలాగే అడవికి సంబంధించిన సీన్స్‌ను ముదుమలై ఫారెస్ట్‌ చేశారు. అప్పట్లో యుద్ధ భయం కూడా ఉండడంతో ఎడారి ప్రాంతంలో షూటింగ్‌కి అనుమతి ఇచ్చే విషయంలో రక్షణశాఖ ఎంతో ఆలోచించింది. దానికి జైసల్మేర్‌ ఎమ్మెల్యే వారితో మాట్లాడి అనుమతులు ఇప్పించారు. ఎందుకైనా మంచిదని వీరి కోసం 12 మంది సభ్యులతో కూడిన సెక్యూరిటీని ఏర్పాటు చేసింది రక్షణశాఖ. 27 రోజులపాటు ఎడారికి సంబంధించిన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. యూనిట్‌ సభ్యులు 35 మంది. ఆర్టిస్ట్‌ ఒక్కడే మాస్టర్‌ రాము. అతనికి తోడుగా టామీ అనే కుక్కపిల్ల. అగ్నిగుండాన్ని తలపించే ఎండ వల్ల రాము, టామీతోపాటు యూనిట్‌ సభ్యులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటలలోపు షూటింగ్‌ పూర్తి చేసి, తమతమ గుడారాల్లోకి వెళ్లిపోయేవారు. మళ్ళీ 4 గంటల తర్వాత షూటింగ్‌ చేసేవారు. యూనిట్‌ సభ్యులు భోజనానికి ఇబ్బంది పడకూడదని ఇద్దరు వంటవాళ్ళను కూడా తీసుకెళ్ళారు పూర్ణచంద్రరావు. ఎండ నుంచి, ఎడారిలో తిరిగే ఇసుక పాముల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఎలాంటి అపశృతి జరగకుండా షూటింగ్‌ని పూర్తి చేశారు. మార్చిలో ప్రారంభమైన ఈ సినిమాను సెప్టెంబర్‌ 29, 1972లో విడుదల చేశారు. 

‘పాపం పసివాడు’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పిల్లలు ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. దాంతో పెద్దవారు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం రాష్ట్రంలోని ప్రధానమైన నగరాలకు మాస్టర్‌ రాముని తీసుకొని విజయయాత్ర నిర్వహించారు. అతన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా అతన్ని చూసి మురిసిపోయారు. అంతేకాదు, ఈ సినిమా పబ్లిసిటీ కోసం అప్పట్లోనే వినూత్న ప్రయోగం చేశారు. ఈ సినిమా వివరాలను తెలిపే కరపత్రాలను ముద్రించి హెలికాప్టర్ల ద్వారా పలు పట్టణాల్లో వాటిని వెదజల్లారు. ఆరోజుల్లో అలాంటి పబ్లిసిటీ గురించి ఎవరూ వినలేదు, చేయలేదు కూడా. ‘పాపం పసివాడు’ చిత్ర యూనిట్‌ అలాంటి పబ్లిసిటీకి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.  మద్రాస్‌లో జరిగిన ఈ చిత్రం శతదినోత్సవ కార్యక్రమానికి నాగయ్య అధ్యక్షత వ్యహించారు. తెలుగులో శతదినోత్సవం జరుపుకున్న తర్వాత తమిళ్‌ వెర్షన్‌ను విడుదల చేశారు. తమిళ్‌లో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది.