English | Telugu
నవరసాలనూ తన నటనలో ప్రదర్శించి ఆంధ్రా దిలీప్ అనిపించుకున్న చలం!
Updated : Nov 23, 2024
సినిమా రంగంలో కొందరు నటులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. వారు కొన్ని పాత్రల్లో అద్భుతమైన నటనను ప్రదర్శిస్తారు. దీంతో వారు అలాంటి క్యారెక్టర్స్‌తోనే ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంటారు. అలాగే ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించగల నటులు కూడా ఉండేవారు. అలాంటి వారిలో చలం కూడా ఒకరు. నటనలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకొని ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవారు. రంగస్థలం నుంచి వచ్చిన ఎంతో మంది నటులు సినిమాల్లో కూడా రంగస్థలం మీద నటించిన విధంగానే నటించేవారు. కానీ, చలం అలా కాకుండా ఎంతో సహజ సిద్ధమైన నటనను ప్రదర్శించేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు చలం వంటి నటుడు మరొకరు రాలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి అద్భుతమైన నటుడి సినీ జీవితం, వ్యక్తిగత జీవితం ఎలా కొనసాగింది అనేది చలం బయోగ్రఫీలో తెలుసుకుందాం.
చలం పూర్తి కోరాడ సింహాచలం. 1929 మే 18న కళలకు నిలయమైన పాలకొల్లులో జన్మించారు. నాటకరంగంలో ప్రముఖుడుగా పేరు తెచ్చుకున్న పినిశెట్టి శ్రీరామ్మూర్తి శిష్యుడు చలం. పినిశెట్టి ఆంధ్ర నాటక కళాపరిషత్ సంస్థను స్థాపించి అందులో నాటకాలు ప్రదర్శించేవారు. అన్నాచెల్లెలు, పల్లెపడుచు నాటకాల్లో చలం చేసిన పాత్రలు నటుడుగా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. పల్లెపడుచు నాటకంలో చలం నటన చూసిన బాలీవుడ్ నటుడు పృథ్విరాజ్ కపూర్ పరవశించిపోయారు. ‘నువ్వు గొప్ప నటుడివి అవుతావు’ అంటూ అభినందించడమే కాకుండా చలంను ఆంధ్రా దిలీప్‌గా అభివర్ణించారు. అప్పటినుంచి ఆంధ్రా దిలీప్‌గా పిలవబడ్డారు చలం. 1950 దశకంలో పౌరాణిక నాటకాలకే ఎక్కువ ఆదరణ ఉండేది. అయితే సాంఘిక నాటకాల్లోని చలం నటనకు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించేవారు.
1952లో నటి లక్ష్మీరాజ్యం నిర్మించిన దాసి చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు చలం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ తర్వాత అమర్‌నాథ్ హీరోగా వచ్చిన నా చెల్లెలు చిత్రంలో రెండో కథానాయకుడిగా చలం నటించారు. అప్పటివరకు ఉన్న హీరోలకు భిన్నమైన ఇమేజ్ చలంకి ఉండేది. అతన్ని ఎన్టీఆర్, ఎఎన్నార్‌లు ఎంతో అభిమానించేవారు. వీరిద్దరూ నటించిన ఎన్నో సినిమాల్లో చలంకి అవకాశాలు ఇప్పించారు. చెరగని చిరునవ్వుతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ గౌరవించేవారు చలం. దాంతో అతనంటే అందరూ ఇష్టపడేవారు. ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా రచయిత సముద్రాల దర్శకత్వంలో రూపొందిన బబ్రువాహన చిత్రంలో చలం టైటిల్ రోల్ పోషించడం విశేషం. 1959లో విజయవాడకు చెందిన వెంకటరమణను వివాహం చేసుకున్నారు చలం. అప్పటి వరకు ఓ మోస్తరుగా సాగుతున్న అతని కెరీర్ పెళ్లి తర్వాత పుంజుకుంది. పలు చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం దక్కింది. దాన్ని సెంటిమెంట్‌గా తీసుకున్న చలం తన పేరులో భార్య పేరును కూడా చేర్చి రమణాచలంగా మారారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
1964లో జరిగిన అగ్ని ప్రమాదంలో వెంకటరమణ మృతి చెందారు. ఆమె జ్ఞాపకార్థం శ్రీరమణ చిత్ర బేనర్‌ను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. చలం నిర్మించిన మొదటి సినిమా సంబరాల రాంబాబు. అతని మీద ఉన్న అభిమానంతో ఎస్.వి.రంగారావు, గుమ్మడి, చంద్రమోహన్, రేలంగి, సూర్యకాంతం వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అవ్వడమే కాకుండా నటుడిగా చలంను ఒక మెట్టు ఎక్కించింది. ఆ తర్వాత మట్టిలో మాణిక్యం, తోట రాముడు, సన్నాయి అప్పన్న, డూడూ బసవన్న వంటి ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు. వీటిలో మట్టిలో మాణిక్యం చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు లభించింది. 30 ఏళ్ళ తన తన సినీ కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో హీరోగా, సెకండ్ హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకుల మనసుల్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు చలం.
సంబరాల రాంబాబు సినిమాలో హీరోయిన్‌గా నటించిన శారదను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చలం. 1969 మే 1న తిరుపతిలో వీరి వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత మలయాళంలో రూపొందిన తులాబారం చిత్రంలో శారద నటనకుగాను కేంద్ర ప్రభుత్వం ఊర్వశి అవార్డును ప్రకటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో వి.మధుసూదనరావు మనుషులు మారాలి పేరుతో రీమేక్ చేశారు. చలం, శారద కలిసి ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే వీరి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. చలం తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ మద్రాస్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయారు శారద. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
చలం సొంతంగా నిర్మించిన సినిమాలన్నీ విభిన్నంగా ఉండేవి. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ హీరోకీ లేని విధంగా చలం సినిమాలు అంటే మ్యూజికల్ హిట్స్ అనే పేరు వచ్చింది. తన సినిమాల్లోని పాటల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు చలం. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో తను కూడా పాల్గొని తను అనుకున్న విధంగా పాటలు వచ్చే వరకు రాజీ పడేవారు కాదు. ‘కురిసింది వాన.. నా గుండెలోన..’, ‘ఎక్కడో దూరాన కూర్చున్నావు.. ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు’, ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్’, ‘ఓ బంగరు రంగుల చిలకా..’, ‘రాధకు నీవేర ప్రాణం..’, ‘మామా చందమామ.. వినరావా మా కథ..’ వంటి పాటలు ఆల్‌టైమ్ హిట్స్‌గా నిలిచాయి. శ్రీరమణ చిత్ర బేనర్‌లో నిర్మించే అన్ని సినిమాలకు రచయితగా రాజశ్రీ, సంగీత దర్శకుడుగా సత్యం ఉండేవారు. అప్పట్లో సూపర్‌హిట్ అయిన హిందీ పాటల్ని రిఫరెన్స్‌గా ఇచ్చి సత్యంతో పాటలు చేయించుకునేవారు చలం.
చలం నిర్మించే ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి ఎన్.టి.రామారావు హాజరై ఆశీస్సులు అందించేవారు. చలం తొలి సినిమా దాసిలో ఎన్టీఆర్‌ను చలం ఫాదర్ అని పిలుస్తారు. పెళ్లిసందడి చిత్రంలో అక్కినేనిని గురూజీ అని పిలుస్తారు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌ను ఫాదర్ అనీ, ఎఎన్నార్‌ను గురూజీ అని పిలుస్తుండేవారు చలం. శ్రీరమణ చిత్ర బేనర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న చలం ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు అతనికి నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చలంకు ఒక సినిమా చేసేందుకు ఎన్టీఆర్, దాసరి నారాయణరావు మంచి మనసుతో ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ డేట్స్ కూడా ఇచ్చారు. ఆ ఆనందంలో చలం పగలు, రాత్రి అనే తేడా లేకుండా విపరీతంగా తాగడం మొదలు పెట్టారు. మద్యానికి అంతగా బానిస అయిన చలం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ తను ఆ సినిమా చెయ్యడం లేదని కబురు పంపించారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడే మంచి అవకాశాన్ని చలం చేజార్చుకున్నారు.
చివరి దశలో సినిమా అవకాశాలు బాగా తగ్గి ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డారు చలం. ఆ సమయంలో దాసరి నారాయణరావు అతనికి గోరింటాకు, బుచ్చిబాబు వంటి సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చి ఆదుకున్నారు. తన బేనర్‌లో ఎన్నో మంచి సినిమాలు నిర్మించిన చలం ఎవరికీ సిగ్గులేదు అనే ప్రయోగాత్మక చిత్రాన్ని చెయ్యాలనుకున్నారు. కానీ, ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. మద్యానికి బానిసైన చలం అనారోగ్య కారణాల వల్ల 1989 మే 4న తుదిశ్వాస విడిచారు.