Read more!

English | Telugu

పొగరుతో అవకాశాన్ని కాలదన్నాడు.. అదృష్టం అతన్నే వరించింది.. ఆ సినిమాకి 11 ఆస్కార్లు వచ్చాయి!

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కళాకారులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. కానీ, కొందరు నటీనటులు మాత్రం అతిగా ఆలోచించడం వల్ల, పొగరు వల్ల కొన్ని క్యారెక్టర్స్‌ని చేజేతులా జారవిడుచుకుంటారు. ఆ తర్వాత తాము వదులుకున్న క్యారెక్టర్‌ని వేరే ఆర్టిస్టులు చేసి సక్సెస్‌ అయితే బాధతో కుంగిపోతారు. ఇలాంటి ఘటనలు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలు. ఇప్పుడు స్టార్‌ హీరోలుగా ఛలామణి అవుతున్న చాలా మంది హీరోలు అలాంటి తప్పులు చేసినవారే. అయితే అదృష్టం వారి వెన్నంటే ఉంటుంది. వారు చేసే పొరపాట్లను అది సరిచేస్తూ ముందుకు నడిపిస్తుంది. అయితే అందరి విషయంలో అలా జరిగే అవకాశం లేదు. కొందరు వారి ప్రవర్తన వల్ల అధోగతి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదట చెప్పుకున్న అదృష్టవంతుల జాబితాలోకి ‘టైటానిక్‌’ హీరో లియోనార్డో డికాప్రియో  కూడా వస్తాడు. 

ప్రపంచ సినీ చరిత్రలో ఓ మరపురాని ప్రేమకావ్యంగా నిలిచిన చిత్రాల్లో ‘టైటానిక్‌’ ఒకటి. లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్‌స్లెట్‌ జంటగా నటించిన ఈ చిత్రం కలెక్షన్లపరంగా, అవార్డుల పరంగా చరిత్ర సృష్టించింది. రోజ్‌గా కేట్‌ విన్‌స్లెట్‌, జాక్‌గా డికాప్రియో నటన అందరి మనసుల్ని దోచుకుంది. ఈ సినిమాతో డికాప్రియో అమ్మాయిల పాలిట డ్రీమ్‌బాయ్‌గా మారిపోయాడు. ఇంతటి సంచలనం సృష్టించిన సినిమాలో వచ్చిన అవకాశాన్ని తన పొగరుతో చేజార్చుకునే పరిస్థితి నుంచి అదృష్టం అతన్ని వెనక్కి లాగింది. అది ఎలా జరిగిందో తెలుసుకుందాం. 

1980లో కమర్షియల్‌ యాడ్స్‌లో నటించడం ద్వారా కెరీర్‌ ప్రారంభించిన డికాప్రియో ఆ తర్వాత కొన్ని టెలివిజన్‌ కార్యక్రమాల్లో కనిపించాడు. 1991లో అతను నటించిన మొదటి సినిమా విడుదలైంది. ఆ సినిమా తర్వాత ఐదేళ్ళలో 9 సినిమాల్లో నటించాడు. ఆ సమయంలోనే డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ తను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్వీయ దర్శకత్వంలో నిర్మించ తలపెట్టిన ‘టైటానిక్‌’ చిత్రంలోని జాక్‌ పాత్ర కోసం స్క్రీన్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు కామెరూన్‌. అందులో భాగంగానే ఎంతో మంది నటులతోపాటు డికాప్రియోను కూడా పిలిపించారు. అప్పటికే టెర్మినేటర్‌, అబిస్‌, అలియెన్స్‌, ట్రూ లైస్‌, టెర్మినేటర్‌ 2 వంటి సంచలన చిత్రాలు రూపొందించిన దర్శకుడు కావడంతో ఆ స్క్రీన్‌ టెస్ట్‌కి వచ్చేందుకు డికాప్రియో ఉత్సాహం చూపించాడు. తను ఆల్రెడీ సినిమాలు చేసి ఉన్నాడు కాబట్టి అవకాశం తనకే వస్తుందన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అతనిలో ఉంది. అయితే కామెరూన్‌ చెప్పిన డేట్‌కి కాకుండా రెండు రోజులు ఆలస్యంగా వచ్చాడు. అది కామెరూన్‌కి కోపం తెప్పించినా ఓపిక పట్టాడు. డికాప్రియో రాగానే స్క్రిప్ట్‌ అతని చేతికి ఇచ్చి చదవమన్నాడు కామెరూన్‌. తను ఆర్టిస్టుగా ప్రూవ్‌ చేసుకున్నాడు. అయినా తనని స్క్రిప్ట్‌ చదవమని ఇవ్వడం అతనికి నచ్చలేదు. తను చదవను అని దురుసుగా చెప్పాడు. దాంతో కామెరూన్‌కి కోపం వచ్చింది. ‘స్క్రీన్‌ టెస్ట్‌కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక బయల్దేరవచ్చు’ అని చెప్పాడు. డికాప్రియో కూడా కోపంగా వెనుదిరిగాడు. ఆ రూమ్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత కాస్త ఆలోచించి.. మళ్ళీ వెనక్కి వచ్చి  ‘స్క్రిప్ట్‌ చదవకపోతే.. నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వరా?’ అని ప్రశ్నించాడు. దానికి కామెరూన్‌ ‘ఎస్‌’ అని సమాధానమిచ్చాడు. దాంతో ఏమనుకున్నాడో ఏమో సైలెంట్‌గా కామెరూన్‌ చెప్పినట్టే చేశాడు. అంతే.. ‘టైటానిక్‌’లో హీరోగా సెలెక్ట్‌ అయిపోయాడు. ఆ తర్వాత సినిమా ఎలా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించింది అనే విషయం అందరికీ తెలిసిందే. అలా పొగరుతో అక్కడి నుంచి వెళ్లిపోవాలకున్న డికాప్రియోను అదృష్టమే వెనక్కిలాగి బంగారు భవిష్యత్తును అందించింది.