English | Telugu

తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న తర్వాతే అనసూయ, భరద్వాజ్‌ పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలుసా?

(మే 15 అనసూయ భరద్వాజ్‌ పుట్టినరోజు సందర్భంగా..)

అందం, అభినయం ఉంటే చాలు సినిమా తారలుగా గుర్తింపు సంపాదించుకోవచ్చు, అదృష్టం బాగుంటే స్టార్‌ హీరోయిన్లుగా ఛలామణి అవ్వొచ్చు. హీరోయిన్లను ఆరాధించేవారు చాలా మంది ఉంటారు. ఒక అడుగు ముందుకు వేసి హీరోయిన్లకు గుడి కట్టించినవారు కూడా ఉన్నారు. అయితే స్టార్‌ ఇమేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకోవాలంటే సినిమాల్లోనే నటించక్కర్లేదు, బుల్లితెరపై కూడా అద్భుతాలు చెయ్యొచ్చు అని ఎంతో మంది నటీమణులు నిరూపించారు. అయితే అందరిలా కాకుండా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకొని టీవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ద్వారా అభిమాన గణాన్ని పెంచుకున్న నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. నటిగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్న అనసూయ.. టీవీ, సినీ కెరీర్‌ ఎలా సాగింది? ఆమె నేపథ్యం ఏమిటి? ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

1985 మే 15న సుదర్శనరావు, అనూరాధ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు అనసూయ. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు వైష్ణవి, అంబిక. వీరిది బ్రాహ్మణ కుటుంబం. 10వ తరగతి పూర్తి చేసేసరికి మూడు స్కూల్స్‌ మారింది అనసూయ. ఆ తర్వాత భద్రుకా కాలేజీలో ఇంటర్‌ చదివింది. ఒకరోజు ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లింది. అప్పుడు అనుకోకుండా ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘నాగ’ చిత్రంలో ఒకే ఒక్క సీన్‌లో నటించింది. ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత అనసూయను ఎన్‌సిసిలో చేర్పించారు వాళ్ళ నాన్న. అయితే ఆమెకు ఎన్‌సిసిలో చేరడం ఇష్టం లేదు. ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలన్నది ఆమె కల. కానీ, ఆ విషయం తండ్రితో చెప్పలేక అయిష్టంగానే ఎన్‌సిసిలో చేరింది. ఆ సమయంలోనే బీహార్‌కు చెందిన శశాంక్‌ భరద్వాజ్‌ పరిచయమయ్యాడు. అనసూయను ప్రపోజ్‌ చేశాడు. ఏడాదిన్నర ఏ విషయమూ చెప్పకుండా అతన్ని తనచుట్టూ తిప్పుకొని ఆ తర్వాత ఒప్పుకుంది. ఈ విషయం తండ్రితో చెబితే ఆయన ఒప్పుకోలేదు. శశాంక్‌తో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంది అనసూయ. కానీ, అది కరెక్ట్‌ కాదని, పెద్దవారు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందామని ఆమెకు సర్ది చెప్పాడు శశాంక్‌.

ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఎంబిఎ పూర్తి చేసింది అనసూయ. కొన్నాళ్లు ఐడిబిఐ బ్యాంక్‌లో పనిచేసింది. ఆ తర్వాత పిక్స్‌లాయిడ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా వర్క్‌ చేసింది. అదే సమయంలో సాక్షి టీవీలో కొత్త న్యూస్‌ రీడర్లు కావాలంటూ వచ్చిన ప్రకటన చూసి దానికి అప్లయ్‌ చేసింది. అందులో సెలెక్ట్‌ అయింది. అయితే ఆమె చదివే న్యూస్‌ తెలుగు, ఇంగ్లీష్‌ మిక్స్‌ అయి ఉండడం అందరికీ ఫన్నీగా అనిపించేది. కొందరు విమర్శించేవారు కూడా. సాక్షి టీవీలోనే రామ్‌గోపాల్‌వర్మతో ఒక షో చేసింది. ఆ తర్వాత మా మ్యూజిక్‌లో వర్క్‌ చేసింది. అలాగే ఆరోజుల్లో సినిమా ఫంక్షన్లు ఎక్కువగా జరిగేవి. ఆ ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహించేవారు. అనసూయ, శశాంక్‌ తొమ్మిదేళ్ళపాటు ప్రేమలోనే ఉన్నారు. పెద్దల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు 2010లో అనసూయ, శశాంక్‌ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

కొన్ని టీవీ షోలు, సినిమా కార్యక్రమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్న అనసూయ జీవితాన్ని 2013 సంవత్సరం మార్చేసింది. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈటీవీలో ప్రారంభించిన కామెడీ షో ‘జబర్దస్త్‌’కి అనసూయను ప్రజెంటర్‌గా ఎంపిక చేశారు. ఈ షోతో ఎంతో పాపులర్‌ అయింది అనసూయ. కొన్ని సంవత్సరాల పాటు ఈ షోలో కొనసాగారు. అదే సమయంలో ఎన్నో ఈవెంట్లు, అవార్డు ఫంక్షన్లు, మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌లకు ప్రజెంటర్‌గా చేశారు. 2003లో మొదటి సారి తెరపై కనిపించిన అనసూయ దాదాపు 13 సంవత్సరాల తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జునతో కలిసి నటించింది. ఈ సినిమా అందాల నటిగా ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. అదే సంవత్సరం అనసూయ చేసిన ‘క్షణం’ చిత్రంలోని నటన అందర్నీ ఆకట్టుకుంది. నటిగా ఆమెను తారాస్థాయిలో నిలిపిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల్లోని అనసూయ నటనకు ఫిలింఫేర్‌, సైమా, జీ సినీ అవార్డులు లభించాయి. ప్రస్తుతం టీవీ షోలతోపాటు కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అనసూయ భరద్వాజ్‌.