English | Telugu

ఒకే కథతో గుణశేఖర్‌, కృష్ణవంశీ సినిమాలు.. ఏది హిట్‌? ఏది ఫట్‌?

ఒకే కథతో గుణశేఖర్‌, కృష్ణవంశీ సినిమాలు.. ఏది హిట్‌? ఏది ఫట్‌?

ఒక సినిమా రూపుదిద్దుకోవడానికి రచయిత మనసులో పుట్టిన ఆలోచన ప్రధాన కథావస్తువుగా ఉంటుంది. తను జీవితంలో చూసిన సంఘటనలు కావచ్చు లేదా ఎవరి జీవితంలోనైనా జరిగిన ఆసక్తికర సంఘటనను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. దాన్ని సినిమాకి అనుగుణంగా మార్చి పూర్తి స్థాయి కథను సిద్ధం చేయడంలోనే ఆ రచయిత ప్రతిభ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరికి కూడా రావచ్చు. ఆ ఇద్దరికీ స్ఫూర్తి ఒకే సంఘటన కావచ్చు. అలా ఒకరికి తెలియకుండా ఒకరు ఆ సంఘటన నేపథ్యాన్నే తీసుకొని సినిమాను రూపొందిస్తే ఏం జరుగుతుంది? అలాంటి ఆసక్తికరమైన అంశం రెండు సినిమాల విషయంలో చోటు చేసుకుంది. ఆ రెండు సినిమాలు గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చూడాలని వుంది’, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘అంత:పురం’. ఈ రెండు సినిమాల ప్రధాన కథాంశం ఒక్కటే. దూరమైన బిడ్డను తనతోపాటు తీసుకెళ్లాలని ‘చూడాలని వుంది’ చిత్రంలో ఓ తండ్రి తపిస్తాడు. అలాగే ‘అంత:పురం’ చిత్రంలో తన బిడ్డను తనతో తీసుకెళ్లాలని ఓ తల్లి సాహసం చేస్తుంది. 

‘చూడాలని వుంది’, ‘అంత:పురం’ చిత్రాల కథలు ఒకటే అనే విషయం ఇద్దరు దర్శకులకు తెలిసింది. అదెలాగంటే.. ‘చూడాలని వుంది’ సినిమా రిలీజ్‌కి వారం రోజుల ముందు నంది అవార్డుల ఫంక్షన్‌ జరిగింది. ఆ సమయంలో కలిసిన గుణశేఖర్‌, కృష్ణవంశీ మాటల సందర్భంలో వారు చేస్తున్న సినిమాల కథల గురించి ప్రస్తావన వచ్చింది. ఒకరి కథ ఒకరు విని షాక్‌ అయ్యారు. అయితే ఇద్దరూ ప్రతిభావంతులైన దర్శకులు కాబట్టి పాయింట్‌ ఒకటే అయినా దాన్ని రెండు విభిన్నమైన సినిమాలుగా రూపొందించి విజయం సాధించారు. ఈ రెండు సినిమాలకూ మూలం 1991లో వచ్చిన ‘నాట్‌ వితౌట్‌ మై డాటర్‌’ అనే హాలీవుడ్‌ మూవీ. ‘అంత:పురం’ చిత్రంలో మాదిరిగానే తన బిడ్డ కోసం ఓ తల్లి చేసిన సాహసమే ‘నాట్‌ వితౌట్‌ మై డాటర్‌’ అనే సినిమా. అయితే ‘చూడాలని వుంది’ చిత్రంలో మాత్రం బిడ్డ కోసం తండ్రి పోరాటం చేస్తాడు. అసలు ఈ కథ ఎలా పుట్టింది.. జరిగిన యదార్థ సంఘటన ఏమిటి అనేది తెలుసుకుందాం.

ఇరాన్‌కు చెందిన డాక్టర్‌ మహ్మదీ.. అమెరికాకు చెందిన బెట్టీని వివాహం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. వారికి ఒక పాప. ఒకరోజు ఇరాన్‌ వెళ్లాలని, తన ఫ్యామిలీ నీ కోసం, పాప కోసం ఎదురుచూస్తోందని, మళ్ళీ రెండు వారాల్లో వచ్చేద్దామని బెట్టీతో చెప్పాడు మహ్మదీ. దాంతో ముగ్గురూ ఇరాన్‌ బయల్దేరారు. కానీ, అక్కడి వాతావరణం, ఇస్లామిక్‌ పద్ధతులు బెట్టీకి నచ్చలేదు. అయినా రెండు వారాలే కదా అని ఓపిక పట్టింది. అయితే మనం తిరిగి అమెరికా వెళ్లడం లేదని, ఇరాన్‌లోనే ఉంటున్నామని చెప్పాడు భర్త. దాన్ని బెట్టీ వ్యతిరేకించింది. దాంతో ఆమెను శారీరకంగా హింసించాడు భర్త. అలాగే మహ్మదీ కుటుంబం నుంచి కూడా బెట్టీపై వ్యతిరేకత వచ్చింది. అమెరికా వెళ్లాలంటే పాపను వదిలి వెళ్లాలని ఆర్డర్‌ వేసాడు భర్త. అప్పటి నుంచి పాపను తీసుకొని అమెరికా వెళ్లడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్నీ చేసింది. ఆ ప్రయత్నంలో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో పాస్‌పోర్ట్స్‌ రెడీ చేసే ఓ వ్యక్తి సాయంతో పాపతోపాటు అమెరికా చేరుకుంది బెట్టీ. ఇదీ ఆ యదార్థగాధ. అమెరికా వెళ్లిన తర్వాత ఇరాన్‌ నుంచి అమెరికా వచ్చే క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలను ఓ పుస్తకరూపంలో తీసుకొచ్చింది బెట్టీ. ఆ పుస్తకం ఆధారంగానే ‘నాట్‌ వితౌట్‌ మై డాటర్‌’ అనే సినిమా రూపొందింది. 

అదే కథతో తెలుగులో రూపొందిన ‘చూడాలని వుంది’, ‘అంత:పురం’ చిత్రాల విషయానికి వస్తే.. దాదాపుగా యదార్థంగా జరిగిన ఘటనే ‘అంత:పురం’ చిత్రంలో మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ని తీసుకొని ఆ కథను తెరకెక్కించారు కృష్ణవంశీ. తల్లి పాత్రలో సౌందర్య అద్భుతమైన నటనను ప్రదర్శించింది. రాయలసీమ నుంచి ఆమెను తప్పించే పాత్రలో జగపతిబాబు విలక్షణమైన నటనను ప్రదర్శించారు. ఇక ‘చూడాలని వుంది’ సినిమా విషయానికి వస్తే.. అదే పాయింట్‌ని తీసుకొని కొడుకును వెతుక్కుంటూ తండ్రి కలకత్తా వెళ్ళడాన్ని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు గుణశేఖర్‌. ఈ రెండు సినిమాల్లోనూ ఒకే తరహా పాత్రను ప్రకాష్‌రాజ్‌ ధరించడం విశేషం. ‘చూడాలని వుంది’ చిత్రంలో కూడా సౌందర్య హీరోయిన్‌గా నటించడం మరో విశేషం. ఈ పాయింట్‌కి ‘అంత:పురం’లో ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ తీసుకుంటే.. ‘చూడాలని వుంది’ చిత్రంలో అండర్‌వరల్డ్‌ బ్యాక్‌డ్రాప్‌ని తీసుకున్నారు. 

1998 ఆగస్ట్‌ 27న ‘చూడాలని వుంది’ చిత్రం రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించి ఎన్నో సెంటర్స్‌లో శతదినోత్సవాలు జరుపుకుంది. ముఖ్యంగా మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ‘యమహా నగరి కలకత్తాపురి..’ అనే పాట చిరంజీవి కెరీర్‌లోని టాప్‌ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా 2 ఫిలింఫేర్‌ అవార్డులు, 3 నంది అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రాన్ని ‘కలకత్తా మెయిల్‌’ పేరుతో తెలుగులో నిర్మించిన అశ్వినీదత్తే హిందీలో అల్లు అరవింద్‌తో కలిసి రీమేక్‌ చేశారు. ఇక ‘అంత:పురం’ విషయానికి వస్తే.. 1998 నవంబర్‌ 30న ఈ సినిమా విడుదలైంది. 
కృష్ణవంశీ రూపొందించిన మోస్ట్‌ ఎమోషనల్‌ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమాను చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు హై ఎమోషన్స్‌తో యదార్థ ఘటనను తలపించే విధంగా ఉంటుంది. ఇళయరాజా సంగీత సారధ్యంలో ఈ సినిమా కూడా మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా సినిమా కూడా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రానికి 3 ఫిలింఫేర్‌ అవార్డులు, 9 నంది  అవార్డులు లభించాయి. ప్రకాష్‌రాజ్‌ నటనకు జాతీయ ప్రత్యేక ప్రశంస అవార్డు దక్కింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘శక్తి’ పేరుతో బోనీకపూర్‌ రీమేక్‌ చేశారు. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవి నటించాల్సి ఉంది. కానీ, అప్పటికి ఆమె ప్రెగ్నెంట్‌ కావడంతో కరిష్మా కపూర్‌ను తీసుకున్నారు. ప్రకాష్‌ రాజ్‌ పాత్రలో నానా పాటేకర్‌ నటించారు. తమిళ్‌లో ‘అంత:పురం’ పేరుతోనే పార్తీబన్‌ రీమేక్‌ చేశారు.