English | Telugu
కేరళలో రూ. కోటి వసూలు చేసిన తొలి తెలుగు డబ్బింగ్ ఫిల్మ్ 'ఘరానా మొగుడు'!
Updated : Jul 15, 2021
మెగాస్టార్ చిరంజీవి నటించగా కలెక్షన్లలో ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించిన చిత్రం 'ఘరానా మొగుడు' (1992). కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా, కె. దేవీ వరప్రసాద్ నిర్మించిన ఈ మూవీతో అమితాబ్ బచ్చన్‌ను దాటి, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అవతరించారు చిరంజీవి. ఈ సినిమా మలయాళంలో 'హే హీరో' పేరుతో అనువాదమై రిలీజయ్యింది. అదివరకు కేరళలో కె. విశ్వనాథ్ క్లాసిక్ 'శంకరాభరణం' త్రివేండ్రంలో ఒకే థియేటర్‌లో ఏడాది పాటు ఆడి సంచలనం సృష్టించింది. ఆ సినిమాని సంభాషణల వరకు మలయాళంలో డబ్ చేసి, తెలుగు పాటలతో రిలీజ్ చేశారు.
'ఘరానా మొగుడు' సినిమాకొస్తే.. అది రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ 'మన్నన్'కు రీమేక్. అప్పటికే 'మన్నన్' మూవీ కేరళలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. దాంతో మొదట 'ఘరానా మొగుడు'ను మలయాళంలో డబ్ చేయాలని ఎవరూ అనుకోలేదు. అయితే 'ఘరానా మొగుడు'లో చిరంజీవి ప్రదర్శించిన అభినయం, చేసిన డాన్సులు కేరళలోని పేరుపొందిన నిర్మాణ-పంపిణీ సంస్థ సెవెన్ ఆర్ట్స్ అధినేతలైన విజయ్‌కుమార్, జయ్‌కుమార్ బ్రదర్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. వారికి ఈ సినిమాను మలయాళంలోకి డబ్ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది.
దాంతో 'ఘరానా మొగుడు' మలయాళ అనువాద హక్కులు తీసుకొని, ఆ భాషలోకి డబ్ చేశారు. 'హే హీరో' అనే టైటిల్ పెట్టారు. పబ్లిసిటీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని, పేరుపొందిన తెలుగు సినీ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుతో ట్రైలర్‌ను కట్ చేయించారు. 1994లో సినిమా రిలీజయ్యాక, అందులో చిరంజీవి చేసిన డాన్సులపై కాంపిటిషన్ నిర్వహించారు. మొదట 12 ప్రింట్లతో రిలీజ్ చేసిన 'హే హీరో' సూపర్‌హిట్ టాక్ తెచ్చుకోవడంతో, కొద్ది రోజుల తర్వాత మరో మూడు ప్రింట్లను విజయ్‌కుమార్ బ్రదర్స్ పెంచారు. 50 రోజులయ్యేసరికి మొత్తం ప్రింట్ల సంఖ్య 21కి చేరుకుంది. కలెక్షన్ల విషయానికి వస్తే కేరళలో ఫస్ట్ రన్‌లో రూ. కోటి వసూలు చేసిన తెలుగు డబ్బింగ్ ఫిల్మ్‌గా 'హే హీరో' (ఘరానా మొగుడు) సరికొత్త చరిత్రను సృష్టించింది.
చిరంజీవి సరసన నాయికగా నగ్మా నటించిన ఈ చిత్రంలో రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, వాణీ విశ్వనాథ్, బ్రహ్మానందం, శరత్ సక్సేనా, రమాప్రభ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం సమకూర్చిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.