English | Telugu
ఒకప్పటి ఈ నందమూరి హీరో హఠాత్తుగా నటించడం ఎందుకు మానేశారు?
Updated : Jul 1, 2021
'లంకేశ్వరుడు' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి బావగా, రేవతి భర్తగా నటించిన నందమూరి కల్యాణ్ చక్రవర్తి గుర్తున్నాడా? 'ఇంటి దొంగ', 'రౌడీ బాబాయ్', 'దొంగ కాపురం' సినిమాల చక్కని హీరో గుర్తున్నాడా? కెరీర్‌లో మరింత ముందుకు ఎదుగుతాడనే నమ్మకం కలిగించి, హఠాత్తుగా సినిమా రంగానికి ఆయన ఎందుకు దూరమైపోయాడు? ఇప్పుడేం చేస్తున్నాడు? అనే ప్రశ్నలు ఆయన సినిమాలు టీవీలో చూస్తున్నప్పుడు చాలా మందికి కలుగుతుంటాయి.
నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తమ్ముడు త్రివిక్రమరావు కుమారుడే కల్యాణ్ చక్రవర్తి. రామలక్ష్మణుల తరహాలో మెలిగేవారు ఎన్టీఆర్, త్రివిక్రమరావు. ఎప్పుడూ త్రివిక్రమరావు అన్నయ్య వెంటే ఉండేవారు. అన్నయ్యతో పలు సినిమాలను త్రివిక్రమరావు నిర్మించారు. అలా చిన్నతనం నుంచీ నాన్న, పెదనాన్నలను చూస్తూ సినిమా వాతావరణంలో పెరిగిన కల్యాణ్‌కు సహజంగానే నటుడు కావాలనే కోరిక కలిగింది.
చిన్నతనం నుంచీ వ్యక్తిగా, నటునిగా కల్యాణ్‌కు తండ్రే దైవం. ఆయన చెప్పిందే వేదం, ఆయన చూపిందే మార్గం. మనిషికి వ్యక్తిగత సమస్యలు ఎప్పుడు ఉండవో, అప్పుడు వృత్తిమీదా, తను నమ్ముకున్న కళమీదా పూర్తి ఏకాగ్రత చూపిస్తాడు. కల్యాణ్ విషయంలో ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. ఆయన పాత్రల ఎంపిక దగ్గర్నుంచీ, ఆ పాత్రలో తను చూపించాల్సిన నటన, తను అనుసరించాల్సిన టైమింగ్ అంతా తండ్రే చూసుకునేవారంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం.
కల్యాణ్ ఏ సినిమా అయినా ఒప్పుకొనే ముందు కథ త్రివిక్రమరావు వినాల్సిందే. ఆయనకు ఓకే అనిపించాకే కొడుకుకు ఆ కథ వినిపించి, ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకునేవారు. తండ్రి సరేనంటే కొడుకు సరే అనేవాడు. కల్యాణ్‌ను ఎవరైనా నేరుగా కలిసి కథ చెప్పబోతే, ముందు తండ్రిని కలిసి చెప్పమనేవాడు. మార్నింగ్ మేకప్ వేసుకొని వెళ్లడం, టైమ్ ప్రకారం నటించడం, టైమ్ కాగానే తిరిగి ఇంటికి రావడం.. ఇలా ఉండేది కల్యాణ్ డ్యూటీ. ఏ విషయంలోనైనా టైమంటే టైమ్ అన్నట్లుగా ఉండేవాడు. ఒకసారి కాల్షీట్లు ఇస్తే దానికి తిరుగుండేది కాదు. చిన్న నిర్మాతలైనా, పెద్ద నిర్మాతలైనా కొడుకు విషయంలో త్రివిక్రమరావు పద్ధతి ఒక్కటే.
కల్యాణ్ దృష్టిలో హీరోలు అంటే కేవలం డాన్స్, ఫైట్స్ చేయగలవారు కాదు. కొద్దో గొప్పో నటన వచ్చి ఉండాలి. ఎందుకంటే డాన్సులు హీరోల కంటే డాన్సర్స్ బాగా చేస్తారు. ఫైట్స్ హీరోల కంటే ఫైటర్స్ బాగా చేస్తారు. హీరోలకు ముందుగా కావాల్సింది నటన అని త్రివిక్రమరావు కొడుక్కు నేర్పారు. అందుకే ముందుగా అందరి దృష్టినీ ఆకర్షించగలిగే ఫ్యామిలీ స్టోరీస్‌లో నటించాడు. అక్షింతలు, తలంబ్రాలు, ఇంటిదొంగ, దొంగ కాపురం, మేనమామ లాంటి ఫ్యామిలీ మూవీస్ చేశాక, మాస్‌కు దగ్గరవ్వాలని 'రౌడీ బాబాయ్', 'రుద్రరూపం' లాంటి యాక్షన్ మూవీస్ చేశాడు. అంతే కాదు, 'భక్త కబీర్‌దాస్'లో శ్రీరాముడిగా కల్యాణ్ చక్రవర్తి నటించాడనే విషయం మనలో చాలా మందికి తెలీదు.
ఆ పాత్రలో నటించేటప్పుడు నిజంగా థ్రిల్ ఫీలయ్యాడు కల్యాణ్. ఉదయాన్నే లేచి పండగ జరుపుకున్నంత సంబరంతో, నిష్ఠగా, నియమాలతో, భక్తితో ఆ గెటప్ వేసుకొనేవాడు. ఆ విషయంలో తన పెదనాన్న ఎన్టీఆర్‌ను మార్గదర్శకంగా తీసుకున్నాడు. "వ్యక్తిగా మా నాన్నగారంత, నటునిగా మా పెదనాన్న గారంత కావాలి నేను. ఆ రోజే నేను అనుకున్నది సాధించినట్లు." అని చెప్పేవాడు కల్యాణ్.
అలాంటి కల్యాణ్ 'లంకేశ్వరుడు', 'అగ్నినక్షత్రం' సినిమాల తర్వాత సడన్‌గా సినిమాలకు దూరమైపోయాడు. కారణం.. ఆయన కొడుకు పృథ్వీ.. రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోవడం. ఆ యాక్సిడెంట్‌లోనే అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కల్యాణ్ తమ్ముడు హరీన్ చక్రవర్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. త్రివిక్రమరావు గాయాలతో బయటపడ్డారు. ఆ షాక్ నుంచి కల్యాణ్ తేరుకోలేకపోయాడు. తన పంచప్రాణాల వంటి కొడుకు మృతి చెందడం, తను దైవంగా భావించే తండ్రి గాయలపాలవడంతో నటనను పక్కన పెట్టేశాడు. గాయపడిన తండ్రికి సేవచేస్తూ వచ్చాడు. మళ్లీ సినిమాల జోలికి వెళ్లలేదు.
ఆ తర్వాత చిత్రపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా, తను మాత్రం తండ్రితో అక్కడే ఉండిపోయాడు కల్యాణ్. పెదనాన్న కుటుంబం, ఆయన కుమారులు అంతా హైదరాబాద్‌కు వచ్చేసినా, తండ్రి చనిపోయాక కూడా ఆయన చెన్నైని వదిలి పెట్టలేదు. అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోయాడు.