English | Telugu
ఎన్టీఆర్‌తో నేను అలా బిహేవ్ చెయ్యకుండా ఉండాల్సింది : డిస్కో శాంతి
Updated : Aug 19, 2025
నటరత్న ఎన్.టి.రామారావు క్రమశిక్షణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సెట్‌లో ఉన్నప్పుడు తోటి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంతో గౌరవిస్తారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా దానికి సరైన పరిష్కారాన్ని తక్షణమే ఆలోచిస్తారు. అలాంటి ఓ అనుభవం నటి డిస్కో శాంతికి జరిగింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1991లో ఆయన నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ రిలీజ్ అయింది. ఈ సినిమాలో డిస్కోశాంతి కూడా నటించారు. అప్పటికే ఆమె 100 సినిమాల్లో నటించినప్పటికీ ఎన్టీఆర్‌ను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. ఆరోజు ఉదయం 6 గంటలకు సెట్‌కి వచ్చారు డిస్కో శాంతి. అప్పటికే ఒక సీన్ చేసి కూర్చున్నారు ఎన్టీఆర్. సినిమాల్లో రాముడుగా, కృష్ణుడుగా ఎన్నో దైవిక పాత్రలు పోషించిన ఆయన్ని చూడగానే ఆమెకు ఒక దైవాన్ని చూస్తున్న భావన కలిగింది. వెంటనే కాళ్ళకు నమస్కారం చేశారు. వెళ్లి మేకప్ చేసుకొని రమ్మన్ని చెప్పారు ఎన్టీఆర్.
మేకప్ రూమ్‌కి వెళ్ళిన శాంతి కోసం ఒక పాత చీరని డ్రెస్‌గా మోడిఫై చేసి తెచ్చాడు కాస్ట్యూమర్. దాన్ని చూడగానే ఆమెకు విపరీతంగా కోపం వచ్చింది. తను ఒక మహానటుడి సినిమాలో నటిస్తున్నానని, పైగా ఆ సినిమాకి ఆయనే నిర్మాత అనే విషయం కూడా మర్చిపోయి ఆ డ్రెస్‌ను కాస్ట్యూమర్ మీదకు విసిరేశారు. ఆ తర్వాత అరగంటకు శాంతి టిఫిన్ చేస్తున్న సమయంలో కాస్ట్యూమర్ చాలా చీరలు తీసుకొని వచ్చాడు. ‘వీటిలో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోమని అయ్యగారు చెప్పారు’ అని చూపించాడు. వాటిని చూసిన శాంతి షాక్ అయ్యారు. ఇంత వేగంగా స్పందించేవారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సెట్‌లోకి భయం భయంగా వెళ్లారు. కానీ, జరిగిన దాని గురించి ఆయన తనను ఒక్క మాట కూడా అడగకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత గొప్ప మనిషిని బాధ పెట్టానని తనని తాను తిట్టుకున్నారు శాంతి. తాను అలా బిహేవ్ చెయ్యకుండా ఉండాల్సిందని, ఆ సమయంలో తను చేసిన పనికి చాలా సిగ్గుపడ్డానని చెబుతారు శాంతి.