English | Telugu

తెలుగు సినిమా ‘లెక్కలు’ మార్చిన సుకుమార్‌!

తెలుగు సినిమా ‘లెక్కలు’ మార్చిన సుకుమార్‌!

(జనవరి 11 దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా..)

1970 జనవరి 11న తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మట్టమర్రు గ్రామంలో తిరుపతిరావు నాయుడు, వీరవేణి దంపతులకు జన్మించారు బండ్రెడ్డి సుకుమార్‌. సాహిత్యం మీద అభిరుచితో చిన్నతనం నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారు. తమ ఊరిలోని గ్రంథాలయంలోని పుస్తకాలు చాలా వరకు చదివేశారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే కవితలు రాసేవారు. సినిమా రంగంలో ప్రవేశించి రైటర్‌గానో, డైరెక్టర్‌గానో పేరు తెచ్చుకోవాలనే కోరిక చిన్నతనంలో ఉంది. కాలేజీలో డిగ్రీ చదివే సమయానికి అది మరింత బలపడింది. అలా డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో జాయిన్‌ అయ్యారు. కాలేజీలో మ్యాథ్స్‌ చెప్పే లెక్చరర్స్‌ లేకపోవడంతో పది మైళ్ళ దూరం వెళ్లి మరో లెక్చరర్‌ దగ్గర మ్యాథ్స్‌లోని మెళకువలు నేర్చుకున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయ్యే సరికి అందులో మంచి పట్టు సాధించారు. ఆ తర్వాత చదువుకుంటూనే తన జూనియర్స్‌కి ట్యూషన్‌ చెప్పేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత 1998లో కాకినాడలోని ఆదిత్య జూనియర్‌ కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా ఉద్యోగం లభించింది. నెలకు రూ.75 వేల జీతం. ఆరోజుల్లో అది చాలా ఎక్కువ జీతం అని చెప్పాలి. 

ఉద్యోగం చేస్తున్నప్పటికీ మనసు మాత్రం సినిమా రంగంపైనే ఉండేది. రెండు సంవత్సరాలు లెక్చరర్‌ ఉద్యోగంలో కొనసాగిన సుకుమార్‌ 2000 సంవత్సరంలో తండ్రి అనుమతితో సినీ రంగంలో ప్రవేశించారు. మొదట ఎడిటర్‌ మోహన్‌ తనయుడు రాజా డైరెక్ట్‌ చేస్తున్న హనుమాన్‌ జంక్షన్‌ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వి.వి.వినాయక్‌ డైరెక్ట్‌ చేసిన దిల్‌ చిత్రానికి వర్క్‌ చేశారు. ఆ సమయంలో సుకుమార్‌లోని టాలెంట్‌ని నిర్మాత దిల్‌రాజు గుర్తించారు. అతనికి దర్శకుడిగా అవకాశం ఇవ్వాలనుకొని ఏదైనా కథ ఉంటే చెప్పమన్నారు. ఆ టైమ్‌లోనే ఆర్య కథ చెప్పారు సుకుమార్‌. అది దిల్‌రాజుకి బాగా నచ్చింది. హీరో ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నావు అని అడిగితే.. నితిన్‌కి కథ సరిపోతుందని చెప్పారు సుకుమార్‌. ఆ కథని నితిన్‌కి చెప్పారు. కానీ, అతనికి నచ్చలేదు. ఆ తర్వాత ఈ కథతో రవితేజ, ప్రభాస్‌ దగ్గరకు కూడా వెళ్లారు. వారు కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. 

2003లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన గంగోత్రితో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్‌ అయితే ఆర్య కథకు పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతాడని అతనికి కథ చెప్పారు. అల్లు అర్జున్‌కి కథ నచ్చింది. దాంతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలుపెట్టారు. అదే సమయంలో ఏప్రిల్‌ 4న దిల్‌ విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ వెంటనే అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఆర్య చిత్రాన్ని ప్రారంభించారు దిల్‌రాజు. 2004 మే 7న ఈ సినిమా రిలీజ్‌ అయింది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. 86 సెంటర్స్‌లో 50 రోజులు, 56 సెంటర్స్‌లో 100 రోజులు, 8 సెంటర్స్‌లో 420 రోజులు ప్రదర్శించబడింది. రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని మలయాళంలోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించడంతో అల్లు అర్జున్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ఈ కథను తమిళ్‌, బెంగాలీ, ఒరియా, శ్రీలంకలోని సింహళ, ఉర్దూ భాషల్లో రీమేక్‌ చేశారు. తొలి సినిమాతోనే బెస్ట్‌ డైరెక్టర్‌గా ఫిలింఫేర్‌ అవార్డు, బెస్ట్‌ స్క్రీన్‌ప్లే రచయితగా నంది అవార్డుతోపాటు పలు అవార్డులు సాధించారు సుకుమార్‌. 

ఆర్య తర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లోనే మరో సినిమా చెయ్యాలనుకున్నారు దిల్‌రాజు. అయితే సుకుమార్‌ చెప్పిన కథలో కొన్ని కరెక్షన్స్‌ చెప్పారు దిల్‌రాజు. కానీ, కథను మార్చేందుకు సుకుమార్‌ ఇష్టపడలేదు. దీంతో తను సినిమా చెయ్యలేనని దిల్‌రాజు చెప్పారు. ఈ విషయంలో హర్ట్‌ అయిన సుకుమార్‌ రాత్రికి రాత్రే రామ్‌ పోతినేనిని హీరోగా ఓకే చేశారు. ఆదిత్యబాబు నిర్మాత. మరుసటి రోజే సినిమా ప్రారంభించారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఆ తర్వాత అదే బేనర్‌లో ఆర్య2 చిత్రం చేశారు. అది కూడా సక్సెస్‌ అవ్వలేదు. అయితే ఈ సినిమాను మలయాళంలో డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా అక్కడ బాగానే ఆడింది. ఆర్య2 సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేసేందుకు కమిట్‌ అయ్యారు సుకుమార్‌. వరుణ్‌ సందేశ్‌, తమన్నా జంటగా సినిమా చెయ్యాలనుకున్నారు. కానీ, ఆర్య2 కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోవడంతో వరుణ్‌ సందేశ్‌ బదులుగా.. ఏమాయ చేసావె చిత్రంతో ఫామ్‌లో ఉన్న నాగచైతన్యను తీసుకున్నారు. ఈ సినిమాకి మొదట బాలు వెడ్స్‌ మహాలక్ష్మి అనే టైటిల్‌ అనుకున్నారు. అది రొటీన్‌గా అనిపించడంతో ఆ తర్వాత ఓ అరడజను టైటిల్స్‌ని పరిశీలించి ఫైనల్‌గా 100 పర్సెంట్‌ అవ్‌ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. 2011లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకి కూడా బెస్ట్‌ డైరెక్టర్‌గా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు సుకుమార్‌. 

ఆ తర్వాత మహేష్‌బాబుకి సైకలాజికల్‌ థ్రిలర్‌ కథ 1 నేనొక్కడినే చెప్పారు సుకుమార్‌. అది మహేష్‌కి బాగా నచ్చింది. సుకుమార్‌ చెప్పినట్టుగా ఈ సినిమా కోసం మహేష్‌ ఫిజికల్‌గా మేకోవర్‌ అయ్యారు. 2014 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మార్నింగ్‌ షో చూసిన సుకుమార్‌ నాన్నగారు తన అభిప్రాయాన్ని చెబుతూ.. ‘సినిమా బాగా తీశావు. కానీ, ప్రేక్షకులకు అర్థం కాదు. నువ్వు ముందే దానికి ప్రిపేర్‌ అయి ఉండు’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే సినిమా ఎవరికీ అర్థం కాలేదు. ఫలితంగా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందించిన 1 నేనొక్కడినే హాలీవుడ్‌ సినిమాలా ఉందనే అప్రిషియేషన్‌ వచ్చింది. అయితే ఐదారు దేశాలలో ఈ సినిమాను విడుదల చేస్తే అక్కడ మాత్రం విజయం సాధించింది. 

ఆ తర్వాత సుకుమార్‌ రైటింగ్స్‌ బేనర్‌ను స్థాపించి తన దగ్గర పనిచేసిన సూర్యప్రతాప్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు. రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా కుమారి 21ఎఫ్‌ చిత్రాన్ని నిర్మించారు. 2015లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత ఇదే బేనర్‌లో మరికొన్ని సినిమాలు నిర్మించారు. తన దగ్గర పనిచేసిన వారికి డైరెక్టర్స్‌గా అవకాశాలు ఇచ్చారు. అలాగే నిర్మాణ పరంగా కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలతో భాగస్వామిగా కూడా ఉన్నారు. 1 నేనొక్కడినే తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. 2016లో విడుదలైన ఈ సినిమాకి మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా ఆ తర్వాత సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. ఆ మరుసటి సంవత్సరమే రామ్‌చరణ్‌ కోసం ఓ కథను రెడీ చేసి అతనికి వినిపించారు. అతనికి బాగా నచ్చింది. ఆ తర్వాత చిరంజీవి కూడా విని సుకుమార్‌ను అప్రిషియేట్‌ చేశారు. అదే రంగస్థలం. 2018లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. రామ్‌ చరణ్‌ కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా నిలిచింది. 

ఈ సినిమా తర్వాత దర్శకుడుగా సుకుమార్‌ ఓ కొత్త టర్న్‌ తీసుకున్నారు. అల్లు అర్జున్‌తో పుష్ప ది రైజ్‌ చిత్రాన్ని ప్రారంభించారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా 2021లో విడుదలై సంచలనం సృష్టించింది. అప్పటివరకు అల్లు అర్జున్‌కి ఉన్న ఇమేజ్‌ని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాలోని నటనకుగాను ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకున్నారు అల్లు అర్జున్‌. తెలుగు సినిమా చరిత్రలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. పుష్ప తర్వాత దానికి సీక్వెల్‌గా సుకుమార్‌ రూపొందించిన పుష్ప ది రూల్‌ మరో కొత్త చరిత్ర సృష్టించింది. 2024 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ సినిమా అన్ని భారతీయ చిత్రాల కలెక్షన్‌ రికార్డులను క్రాస్‌ చేస్తూ రూ.1850 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టించింది. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా పుష్ప ది రూల్‌ కొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తర్వాత మరోసారి రామ్‌చరణ్‌తో సినిమా చెయ్యబోతున్నారు సుకుమార్‌. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అలాగే పుష్ప సిరీస్‌లో భాగంగా పుష్ప ది ర్యాంపేజ్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా జరుగుతున్నాయి. 

వ్యక్తిగత విషయాలకు వస్తే.. సుకుమార్‌ వివాహం 2009లో తబితతో జరిగింది. వీరికి కుమార్తె సుకృతివేణి, కుమారుడు సుక్రాంత్‌ ఉన్నారు. గాంధీతాత చెట్టు అనే చిత్రంలోని నటనకుగాను ఉత్తమ బాలనటిగా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు సుకృతివేణి. అలాగే ఉత్తమ తొలి సినిమా బాలనటిగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌, ఇండియన్‌ ఇంటర్నేషనల్‌  ఫిలిం ఫెస్టివల్‌ పురస్కారాలు కూడా సుకృతి సొంతం చేసుకున్నారు.