English | Telugu
సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వని ఆఫీసర్‌కి వయొలెంట్ కథ చెప్పి భయపెట్టిన డైరెక్టర్!
Updated : Sep 19, 2024
ఏ డైరెక్టర్ అయినా తను చేసే ప్రతి సినిమా డిఫరెంట్ పాయింట్‌తో ఉండాలని కోరుకుంటాడు. అన్ని జోనర్స్‌లో సినిమాలు చెయ్యాలని ఆశపడతాడు. అలా కాకుండా తన ప్రతి సినిమానూ ఒకే పాయింట్‌తో తీసే డైరెక్టర్ ఒకరున్నారు. కథ, బ్యాక్‌డ్రాప్ వేరైనా ఒక పాయింట్ మాత్రం అతని సినిమాలో కామన్‌గా ఉంటుంది. ఆ డైరెక్టరే ఎస్.ఎ.చంద్రశేఖర్. తమిళ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న దళపతి విజయ్ ఈయన కుమారుడే. 1978లో డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చంద్రశేఖర్.. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 50 సినిమాలను డైరెక్ట్ చేశారు. అతని సినిమాల్లోని కామన్ పాయింట్ ఏమిటంటే.. చట్టానికి దొరక్కుండా నేరాలు చేయడం. తన కుటుంబానికి లేదా తన వారికి అన్యాయం జరిగితే దానికి కారకులైన వారిని ఎంతో తెలివిగా, చట్టానికి దొరక్కుండా హతమార్చడం అనేది పాయింట్. తను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ కాస్త అటుఇటుగా అదే పాయింట్ ఉంటుంది. తెలుగులో చట్టానికి కళ్లులేవు, దేవాంతకుడు, బలిదానం, ఇంటికో రుద్రమ్మ, దోపిడీ దొంగలు చిత్రాలు చేశారు. ఈ ఐదు సినిమాల్లోనూ అదే పాయింట్ ఉంటుంది. అలాగే తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో చేసిన సినిమాల్లోనూ ఇలాంటి పాయింటే ఉంటుంది.
1981లో మెల్ గిబ్సన్ హీరోగా వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ అప్పట్లో గొప్ప సంచలనం సృష్టించింది. యాక్షన్ సినిమా అంటే ఇలా ఉండాలి, వయొలెంట్ సీన్స్‌ని ఇలా తియ్యాలి అని తెలియజెప్పిన సినిమా అది. ఆ సినిమా చంద్రశేఖర్‌కి బాగా నచ్చింది. అందులో నుంచి కొన్ని పాయింట్స్‌ని తీసుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథను సిద్ధం చేశారు చంద్రశేఖర్. శోభన్‌బాబు, మాధవి జంటగా బలిదానం పేరుతో ఆ సినిమాను రూపొందించారు. మరోపక్క చిరంజీవి, రాధిక జంటగా రాజ్ భరత్ దర్శకత్వంలో మ్యాడ్ మ్యాక్స్ ఇన్‌స్పిరేషన్‌తోనే యమకింకరుడు చిత్రాన్ని నిర్మించారు అల్లు అరవింద్. 1982 జనవరిలో బలిదానం చిత్రం విడుదల కాగా, యమకింకరుడు అక్టోబర్‌లో రిలీజ్ అయింది. అయితే రెండు సినిమాలూ సూపర్‌హిట్ కావడం విశేషం. 1985లో విడుదలైన ఇంటికో రుద్రమ్మ తర్వాత మళ్ళీ తెలుగులో చంద్రశేఖర్ సినిమా చెయ్యలేదు.
దర్శకుడు చంద్రశేఖర్‌కి ఎప్పుడూ సెన్సార్ వారితో పేచీ ఉండేది. ఎందుకంటే ఆరోజుల్లోనే అతని సినిమాల్లో హింసను ఎక్కువగా చూపించేవారు. దీంతో ప్రతి సినిమాలోనూ కట్స్ ఉండేవి. చంద్రశేఖర్ చేసిన ఒక్క సినిమా కూడా సెన్సార్ కట్స్ లేకుండా రాలేదు. ప్రతి సినిమాకీ సెన్సార్ టార్చర్ ఉండేది. దాంతో విసుగెత్తిపోయారు చంద్రశేఖర్. ఆ క్రమంలోనే ఒక సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు సెన్సార్ ఆఫీసర్. అప్పుడు చంద్రశేఖర్.. ఆ ఆఫీసర్‌కి ఒక కథ చెప్పారు. ఆ కథ ఏమిటంటే.. ‘ఒక కుర్రవాడు సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వచ్చాడు. మొదట కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత డైరెక్షన్ చెయ్యాలనుకున్నాడు. అయితే తనకు అవకాశం ఇచ్చే నిర్మాతలు దొరక్కపోవడంతో ఊరు వెళ్లిపోయి తనకున్న ఆస్తులన్నీ అమ్మేసి మళ్లీ మద్రాస్ వచ్చి ఓ రెవల్యూషనరీ పాయింట్‌తో మంచి సినిమా తీశాడు. దాన్ని సెన్సార్‌కి పంపిస్తే విపరీతమైన కట్స్ చెప్పడమే కాకుండా సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు అన్నారు. ఆ సినిమాలో ఆ కుర్రాడే హీరో. అప్పుడు అతను ఒక్కో సెన్సార్ మెంబర్‌ని చట్టానికి దొరక్కుండా చంపుతూ ఉంటాడు. చివరికి సెన్సార్ ఆఫీసర్‌ని చంపుతాడు. అది క్లైమాక్స్. అతన్ని ఎలా చంపుతాడు అనేది నేను తర్వాత చెబుతాను’ అన్నారు చంద్రశేఖర్. దాంతో భయపడిపోయిన సెన్సార్ ఆఫీసర్ చంద్రశేఖర్‌కి సర్టిఫికెట్ ఇచ్చి పంపించారు. అలా ఓ వయొలెంట్ కథని అప్పటికప్పుడు చెప్పి ఆ సెన్సార్ ఆఫీసర్‌ని భయపెట్టి తన సినిమాకి సర్టిఫికెట్ తెచ్చుకున్నారు ఎస్.ఎ.చంద్రశేఖర్.