English | Telugu

రాజమౌళి వల్లే డైరెక్షన్‌ ఛాన్స్‌.. మొదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన కొరటాల శివ!

కొరటాల శివ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న డైరెక్టర్స్‌లో తనకంటూ ఒక మార్క్‌ని క్రియేట్‌ చేసుకున్న డైరెక్టర్‌. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే తపన కనిపిస్తుంది. స్వతహాగా అభ్యుదయ భావాలు కలిగిన శివ తన సినిమాల్లో తన భావాలను, అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. డైరెక్టర్‌గా అతను చేసిన సినిమాలు ఐదే అయినా టాలీవుడ్‌లోని టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేరిపోయారు. 2002లో వచ్చిన ‘గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రానికి కథ అందించడం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివ ఆ తర్వాత ఎనిమిది సినిమాలకు మాటలు అందించారు. మరో రచయిత బి.వి.ఎస్‌.రవితో కలిసి ఆయా సినిమాలకు పనిచేశారు. 2010లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ చిత్రానికి సోలోగా కథ, మాటలు అందించారు. తను రాసిన కథలకు, మాటలకు డైరెక్టర్లు న్యాయం చెయ్యలేకపోతున్నారేమో అనే భావన అతనిలో ఉండేది. అందుకే తన కథలను తానే సినిమాలుగా రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ క్షణం నుంచి డైరెక్షన్‌ ఛాన్స్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే ప్రభాస్‌ సన్నిహితుడు, తన క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన వంశీకృష్ణతో ఆ విషయాన్ని చెప్పారు. తను కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రభాస్‌ తన స్నేహితుడే కాబట్టి తప్పకుండా డేట్స్‌ ఇస్తాడు అనే నమ్మకం వంశీకి ఉంది. ఆ ధైర్యంతోనే శివను ప్రభాస్‌ దగ్గరికి తీసుకెళ్లాడు. శివకు మాత్రం ప్రభాస్‌తో సినిమా సెట్‌ అవుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభాస్‌ తన ఫ్రెండ్‌ని నిర్మాతగా పరిచయం చెయ్యడానికి ఎవరైనా పెద్ద డైరెక్టర్‌ని సెలెక్ట్‌ చేసుకుంటాడుగానీ తనతో ఎందుకు చేస్తాడు అనే అభిప్రాయంలోనే ఉండిపోయాడు శివ. 

అప్పటికే ‘రెబల్‌’ వంటి డిజాస్టర్‌ చేసి ఉన్న ప్రభాస్‌ తన నెక్స్‌ట్‌ మూవీ రాజమౌళితో కమిట్‌ అయి ఉన్నాడు. ఆ సమయంలోనే వంశీ, శివ.. ప్రభాస్‌ని కలిశారు. శివ కథ చెప్పేముందు ప్రభాస్‌ ఒక మాట అన్నారు. ‘రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఈగ కంప్లీట్‌ అవుతోంది. మా కాంబినేషన్‌లో నెక్స్‌ట్‌ మూవీ ‘బాహుబలి’ స్టార్ట్‌ కాబోతోంది. ఈ గ్యాప్‌లో నేను సినిమా చెయ్యలేను. అయినా మీరు చెప్పే కథ వింటాను. నేను సినిమా చెయ్యలేకపోతే.. మీ కథ బాగాలేదని మాత్రం అనుకోవద్దు’ అని చెప్పారు. సరేనని కథ చెప్పడం మొదలుపెట్టారు శివ. వింటున్న ప్రభాస్‌ చాలా ఎక్సైట్‌ అయ్యారు. కథ మొత్తం విన్న తర్వాత గట్టిగా షౌట్‌ చేశాడు. అతనికి కథ బాగా నచ్చింది. ‘కథ బాగుంది. కానీ, చేసే పరిస్థితి లేదు. అందుకే ముందే చెప్పాను నేను కమిట్‌ అయి ఉన్నానని. ఇప్పుడెలా’ అంటూ టెన్షన్‌ పడ్డారు. కాసేపు దాని గురించే ఆలోచిస్తూ బాధపడ్డారు ప్రభాస్‌. పరిస్థితిని అర్థం చేసుకున్న శివ, వంశీ అక్కడి నుంచి వచ్చేశారు. 

మరుసటి రోజు రాజమౌళి దగ్గరకు వెళ్లారు ప్రభాస్‌. తను విన్న కథ గురించి డీటైల్డ్‌గా చెప్పారు. దానికి రాజమౌళి ‘కథ చాలా బాగుంది. మంచి కథలు దొరకడమే కష్టం. అలాంటిది అంత మంచి కథను ఎలా మిస్‌ చేసుకుంటావు. తప్పకుండా చెయ్‌. మన సినిమా స్టార్ట్‌ అవ్వడానికి మరో ఆరునెలలు పట్టొచ్చు. ఈలోగా అది కంప్లీట్‌ చేసెయ్‌’ అని ఎంకరేజ్‌ చేశారు. వెంటనే శివకు ఫోన్‌ చేసి తన గెస్ట్‌ హౌస్‌కి రమ్మని చెప్పారు ప్రభాస్‌. అలా ‘మిర్చి’ సినిమా ప్రారంభమైంది. అయితే అంతకుముందు శివకు డైరెక్షన్‌లో అనుభవం లేదు. కనీసం డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో కూడా పనిచేయలేదు. కానీ, తను స్టోరీ, మాటలు అందించిన అన్ని సినిమాల షూటింగ్స్‌కి అతను వెళ్ళేవాడు. స్క్రిప్ట్‌ ఇచ్చిన రోజు నుంచి ఫస్ట్‌ కాపీ వచ్చే వరకు ప్రతి క్రాఫ్ట్‌ని ఆయన దగ్గరగా పరిశీలించారు. అలా ప్రతి క్రాఫ్ట్‌పై అవగాహన ఏర్పరుచుకున్నారు. అందుకే ఎలాంటి అనుభవం లేకపోయినా ‘మిర్చి’లాంటి బ్లాక్‌బస్టర్‌ తియ్యగలిగారు. ఆరోజున ప్రభాస్‌కి రాజమౌళి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే.. కొరటాల శివ అనే రచయిత డైరెక్టర్‌ అయ్యేందుకు మరెన్ని సంవత్సరాలు పట్టేదో. అంతేకాదు, ప్రభాస్‌ ఇప్పుడున్న పరిస్థితిలో శివకు సినిమా చేసే ఛాన్స్‌ కూడా ఉండేది కాదు. అలా రాజమౌళి చలవ వల్ల కొరటాల శివ దర్శకుడయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న ‘దేవర’ చిత్రంతో దర్శకుడుగా మరో స్టెప్‌ ఎదిగేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కొరటాల శివ.