English | Telugu

3 ఇండస్ట్రీ హిట్స్‌ ఇచ్చిన బి.గోపాల్‌.. సినిమాలకు ఎందుకు దూరమయ్యారో తెలుసా?

(జూలై 24 దర్శకుడు బి.గోపాల్‌ పుట్టినరోజు సందర్భంగా..)

1980వ దశకం తెలుగు సినిమాకి ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చిన సంవత్సరం. ఎందుకంటే 1982లో నటరత్న ఎన్‌.టి.రామారావు రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో.. అప్పటివరకు ఎన్టీఆర్‌కి పోటీగా ఉన్న సూపర్‌స్టార్‌ కృష్ణ.. నెంబర్‌ వన్‌ హీరో అనిపించుకున్నారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండానే చిరంజీవి రంగంలోకి దిగి స్టార్‌ హీరో అయిపోయారు. ఇదిలా ఉంటే.. అదే దశకంలో కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడుతూ ఎ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, జంధ్యాల, రేలంగి నరసింహారావు వంటి దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు. వీరంతా ఎవరి పద్ధతిలో వారు సినిమాలు చేస్తూ డైరెక్టర్లుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో బి.గోపాల్‌ అనే కొత్త దర్శకుడు పరిశ్రమకు వచ్చారు. 1986లో ప్రతిధ్వని చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమానే ఇన్‌సాఫ్‌ కి ఆవాజ్‌ పేరుతో బి.గోపాల్‌ దర్శకత్వంలోనే హిందీలో రీమేక్‌ చేశారు. థియేటర్లలో సినిమాలు చూడడం తప్ప సినిమా డైరెక్టర్‌ అవ్వాలన్న ఆలోచనే లేని గోపాల్‌ 20 సంవత్సరాలపాటు టాప్‌ డైరెక్టర్‌గా కొనసాగడం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి.

జూలై 24న ప్రకాశం జిల్లా ఎం.నిడమనూరు గ్రామంలో వెంకటేశ్వర్లు, మహాలక్ష్మీ దంపతులకు జన్మించారు బెజవాడ గోపాల్‌. కారుమంచిలో పాఠశాల విద్య, ఒంగోలులో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి సినిమాలు చూడడం, ఆటలు ఆడడం తప్ప చదువు మీద శ్రద్ధ పెట్టేవారు కాదు. చాలా కష్టం మీద డిగ్రీ పూర్తి చేయగలిగారు. కాలేజీలో చేరే వరకు గోపాల్‌కు సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన లేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి కాబట్టి మద్రాస్‌ వెళ్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాలనుకున్నారు. ప్రతి నెలా జీతం తెచ్చిపెట్టే ఉద్యోగంగానే దాన్ని చూశారు తప్ప డైరెక్టర్‌ అవ్వాలి, సినిమాలు తియ్యాలి అనే ఆలోచన ఆయనకు లేదు. అప్పటివరకు సినిమాలు చూడడం తప్ప సినిమాలపై అవగాహన అనేది లేదు. సినిమాల్లోకి వెళ్ళాలన్న తన నిర్ణయాన్ని తండ్రితో చెప్పారు. ఆయన కూడా కాదనకుండా తనకు తెలిసిన వారి ద్వారా దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ చేశారు.

పి.సి.రెడ్డి దగ్గర కొంతకాలం పనిచేసిన తర్వాత కె.రాఘవేంద్రరావు దగ్గర అడవి రాముడు చిత్రానికి అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత ఆయన దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ సమయంలోనే బి.గోపాల్‌ పనితీరును గమనించిన డి.రామానాయుడు.. తను నిర్మిస్తున్న ప్రతిధ్వని ద్వారా దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్‌ అవ్వడమే కాదు, దాన్ని హిందీలో ఇన్‌సాఫ్‌ కి ఆవాజ్‌ పేరుతో గోపాల్‌ దర్శకత్వంలోనే రీమేక్‌ చేశారు. అలా తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు గోపాల్‌. తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించిన గోపాల్‌.. భారీ యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌బాబు, రాజశేఖర్‌ వంటి హీరోలతో సూపర్‌హిట్‌ చిత్రాలు రూపొందించారు.

బి.గోపాల్‌ అంటే యాక్షన్‌ సినిమాలు, ఫ్యాక్షన్‌ సినిమాలు గుర్తొస్తాయి. ఒకవిధంగా ఆయనకి డైరెక్టర్‌గా గొప్ప పేరు తెచ్చినవి ఆ తరహా సినిమాలే. నందమూరి బాలకృష్ణతో చేసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిపోయాయి. అంతకుముందు బాలకృష్ణతో చేసిన లారీ డ్రైవర్‌, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ భారీ విజయాల్ని అందుకున్నాయి. అలాగే చిరంజీవితో చేసిన ఇంద్ర ఇండస్ట్రీ హిట్‌గా చరిత్ర సృష్టించింది. అంతకుముందు స్టేట్‌రౌడీ చిరంజీవి కెరీర్‌లో మరో విజయవంతమైన సినిమాగా నిలిచింది. వెంకటేష్‌తో చేసిన బొబ్బిలిరాజా 1990వ దశకంలో ఓ కొత్త తరహా చిత్రంగా ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించింది. మోహన్‌బాబు కాంబినేషన్‌లో బి.గోపాల్‌ చేసిన అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ చిత్రాలు ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించాయి.

12 సంవత్సరాలు దర్శకత్వశాఖలో పనిచేసిన తర్వాత ప్రతిధ్వని చిత్రంతో దర్శకుడుగా మారారు బి.గోపాల్‌. దాదాపు రెండు దశాబ్దాలు దర్శకుడిగా తన జైత్రయాత్ర కొనసాగించారు. 30 సంవత్సరాల తన కెరీర్‌లో కేవలం 31 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు గోపాల్‌. అందులో రెండు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. తను చేసిన ప్రతి సినిమాకీ కేవలం డైరెక్టర్‌గానే వ్యవహరించిన గోపాల్‌ ఏ చిత్రానికీ సొంతంగా కథ అందించే ప్రయత్నం చెయ్యలేదు. టాలీవుడ్‌లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర చిత్రాలతో మూడు ఇండస్ట్రీ హిట్స్‌ అందించిన ఘనత బి.గోపాల్‌కి దక్కింది. బాహుబలి వచ్చే వరకు కలెక్షన్ల పరంగా ఆ మూడు సినిమాల దరిదాపుల్లోకి మరో సినిమా వెళ్ళలేదు. 2005 వరకు వరసగా సినిమాలు చేస్తూ వచ్చిన గోపాల్‌.. నాలుగు సంవత్సరాల గ్యాప్‌ తర్వాత రామ్‌ పోతినేనితో మస్కా చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ అయింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో హరహర మహాదేవ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రారంభోత్సవంతోనే ఆగిపోయింది. 2012లో గోపీచంద్‌తో ఆరడుగుల బుల్లెట్‌ చిత్రం చేశారు. అయితే ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల చాలా ఆలస్యంగా 2021లో ఈ సినిమా విడుదలై పరాజయాన్ని చవిచూసింది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్‌ ఇచ్చిన బి.గోపాల్‌ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.