English | Telugu
చలపతిరావు భార్య ఇంట్లోనే అగ్నిప్రమాదంలో చనిపోయారని మీకు తెలుసా?
Updated : Jul 19, 2021
సీనియర్ నటుడు చలపతిరావు విభిన్న తరహా పాత్రలను ఐదున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, అలరిస్తూ వస్తున్నారు. మొదట్లో విలన్ పాత్రలతో భయపెట్టిన ఆయన, తర్వాత సాత్త్విక పాత్రల్లోనూ మెప్పించారు. 'నిన్నే పెళ్లాడుతా'లో హీరో నాగార్జున తండ్రిగా చేసిన పాత్ర ఆయన కెరీర్‌ను మరో మలుపు తిప్పిందని చెప్పాలి. నిజ జీవితం విషయానికి వస్తే, ఆయన కుమారుడు రవిబాబు కూడా నటుడిగా రాణిస్తూనే, దర్శకుడిగా మారి 'అల్లరి', 'అనసూయ', 'అవును' లాంటి హిట్ సినిమాలను రూపొందించారు.
చాలామందికి తెలీని విషయం చలపతిరావు భార్య అగ్నిప్రమాదంలో మరణించారని. అదీ కూడా వాళ్ల ఇంట్లోనే. పెళ్లయి, ముగ్గురు పిల్లలు పుట్టిన కొద్ది కాలానికే ఆమె మృతి చెందడం చలపతిరావు జీవితంలో అతిపెద్ద విషాదం.
ఆరోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు. మద్రాసులో అప్పుడు రెండు రోజులకోసారి నీళ్లు వచ్చేవి. రాత్రి 2 గంటలకు లేచి పట్టుకోవాలి. ఆమె లేచి పడతానంటే, తాను పడతానని చెప్పారు చలపతిరావు. "లేదు.. నేను పడతాలే" అని ఆమె వెళ్లారు. అంతలోనే కేకలు వినిపించాయి. "నిన్నే.. నిన్నే" అని ఆమె పిలుస్తూ ఉంది. ఏంటా అని అటు వెళ్లారు చలపతిరావు. ఏదో మంట కనిపించింది. వంటగదిలో స్టవ్, మరికొన్ని వస్తువులు కిందపడి ఉన్నాయి. మంటల్లో భార్య! ఆమె ముందువైపు ఏమీ అంటుకోలేదు. ఆమె కట్టుకున్న నైలెక్స్ చీర వెనుకవైపు అంటుకొని తగలబడిపోతోంది.
మంటలు ఆర్పి, ఆమెను ఎత్తుకొని ఆటోలో హాస్పిటల్‌కు తీసుకుపోయారు చలపతిరావు. అప్పటికే వెనుకవైపు చర్మం అంతా ఊడివచ్చేసింది. మూడు రోజులు ఆమె మృత్యువుతో పోరాడారు. అప్పుడు ఎన్టీఆర్ భార్య బసవతారకం కూడా ఆమెను చూడ్డానికి హాస్పిటల్‌కు వెళ్లారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందో బాధితురాలైన చలపతిరావు భార్యకూడా చెప్పలేకపోయారు. మూడో రోజు భర్తతో, "ఈ పిల్లలతో నువ్వు వేగలేవు. నువ్వు పెంచలేవు. పెళ్లి చేసుకో" అని చెప్పారు. ఆమె తృప్తి కోసం సరేనన్నారు చలపతిరావు. అంతే! ఆ రోజే ఆమెను మృత్యువు కబళించేసింది. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చలపతిరావు.
కొడుకు రవిబాబుతో పాటు ఇద్దరు కూతుళ్లను ఒంటరి తండ్రిగా పెంచి పెద్దచేశారు చలపతిరావు. ముగ్గురు పిల్లలూ చదువులో గొప్పగా రాణించారు, ఎవరి జీవితాల్లో వారు బాగా స్థిరపడ్డారు. అదే తండ్రిగా ఆయనకు తృప్తి.