English | Telugu
బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. సురేశ్ మొదటి భార్య!
Updated : Jul 22, 2021
కెరీర్ తొలినాళ్లలో సురేశ్ పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అనేకమంది పేరుపొందిన తారలు ఆయన సరసన నటించారు. అలా తన పక్కన నటించిన ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారు సురేశ్. ఆమెను 1990లో పెళ్లాడారు. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. "నేనొక అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నా. ఆమె నాతో సినిమాల్లో నటించింది. తను మంచి సింగర్ కూడా. ఒక టైమ్‌లో మేం బాగా స్ట్రగుల్ అయ్యాం. ఆమెకు ఫిల్మ్ ఇండస్ట్రీ నచ్చలేదు. ఉన్నత చదువులు చదువుకొని అబ్రాడ్‌లో సెటిల్ అవుదామని తను చెప్పింది. నా పరిస్థితి కూడా అప్పుడు బాగా లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేసే కండిషన్ మీదే మేం పెళ్లి చేసుకున్నాం." అని ఒక ఇంటర్వ్యూలో సురేశ్ చెప్పారు.
ఇంతకీ ఆయన మొదటి భార్య ఎవరో తెలుసా? జంధ్యాల డైరెక్ట్ చేసిన 'బాబాయ్ అబ్బాయ్' సినిమాలో బాలకృష్ణ సరసన నాయికగా నటించిన అనితా రెడ్డి. ఆమెకు అదే ఫస్ట్ ఫిల్మ్. అయితే అంతకంటే ముందు ఆమె సింగర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. లెజెండరీ సింగర్ కె.జె. యేసుదాస్ కలిసి సంగీత కచేరీల్లో పాల్గొని, ఆ తర్వాత పాప్ సింగర్‌గానూ పేరు తెచ్చుకుంది. చిరంజీవి 'ఖైదీ' మూవీలో "తప్పించుకోలేవు నా చేతిలో" పాటను పాడింది ఆమే. నిజానికి 'శ్రీవారి శోభనం' సినిమా కోసం హీరోయిన్‌గా అనితను తీసుకున్నారు జంధ్యాల. కానీ ముందుగా 'బాబాయ్ అబ్బాయ్' విడుదలవడంతో, ప్రేక్షకులకు ఆ సినిమాతోటే పరిచయమైంది.
భానుచందర్ 'టెర్రర్' మూవీలో సురేశ్, అనితరెడ్డి జంటగా నటించారు. అప్పుడే మనసులు కలిసి, పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా పెళ్లి తర్వాత సురేశ్‌కు సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. "ఒక ఏడాది నేను ఏకంగా 18 సినిమాల్లో నటించాను. స్టోరీ డిస్కషన్స్, షూటింగ్స్, ట్రావెలింగ్‌తోటి బాగా బిజీ అయిపోయాను. ఆమె నిర్ణయం గురించి ఇంకోసారి ఆలోచించమని నా భార్యను రిక్వెస్ట్ చేశాను. కానీ ఆమె ఒప్పుకోలేదు. పిల్లలు పుడితే అయినా పరిస్థితులు కుదుటపడతాయని మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తే ఒకబ్బాయిని కన్నాం. అయినా ఫలితం లేకపోయింది. మేం డైవోర్స్ తీసుకున్నాం." అని సురేశ్ వెల్లడించారు. ఇప్పుడు అనిత ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో విషయాలు మనకు తెలీదు. ఆమెతో విడిపోయాక రాజశ్రీ బిష్త్ అనే రచయిత్రిని వివాహం చేసుకున్నారు సురేశ్.