English | Telugu
ఒక కల శివశంకర వరప్రసాద్‌ను 'చిరంజీవి'గా మార్చింది!
Updated : Aug 15, 2021
చిరంజీవి కెమెరా ముందుకు వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ 'పునాదిరాళ్లు'. అయితే విడుదలైంది మాత్రం ఏడో సినిమాగా. దాన్ని ఆయన ఇష్టంతో చేయలేదు. ఆ సినిమావాళ్లు బలవంతపెట్టడంతో చేశారు. ఆయన అప్పుడు ఇంకా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఉన్నారు. అక్కడి నిబంధనల ప్రకారం కోర్సు పూర్తయ్యేదాకా సినిమాల్లో నటించకూడదు. ఒకసారి ఎవరి కోసమో చిరంజీవి వెళ్తూ, అనుకోకుండా ఒక ప్రొడ్యూసర్‌ను కలిశారు. ఆయన చిరంజీవిని తమ సినిమాలో నటించమని అడిగారు.
"కోర్సు పూర్తయ్యేదాకా నేను నటించకూడదండీ" అని చెప్పారు చిరంజీవి.
"మాకు అర్జంట్‌గా మీలాంటి యాక్టర్ కావాలి. షూటింగ్‌కు వెళ్తున్నాం." అని ఆ నిర్మాత, ఆ సినిమా డైరెక్టర్ అడిగారు.
దాంతో ఓకే అని చెప్పి, ఇన్‌స్టిట్యూట్ పర్మిషన్ తీసుకొని ఆ సినిమాలో యాక్ట్ చేశారు చిరంజీవి. ఆ సినిమా 'పునాదిరాళ్లు'.
చిరంజీవి అసలుపేరు శివశంకర వరప్రసాద్ అని మనకు తెలిసిందే. పేరు మరీ పొడవుగా ఉందనీ, ఏదైనా మంచిపేరు పెట్టుకుందామనుకున్నారు. అప్పట్లో శంకర్ అని ఓ ఆర్టిస్ట్ ఉండేవారు. అలాగే అప్పటికే యాక్టర్ ప్రసాద్‌బాబు ఉన్నారు. అదే టైమ్‌లో చిరంజీవికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన ఓ గుడిలో పూజ చేసుకుంటున్నారు. ఆయన స్నేహితుల్లో ఒకరు "చిరంజీవీ" అని పిలిచారు. 'నాపేరు శివశంకర వరప్రసాద్ అయితే వీడు చిరంజీవి అని పిలుస్తున్నాడేంటి' అనుకున్నారు. మెలకువ వచ్చాక తన ఫ్రెండ్స్‌తో ఈ విషయం చెప్పారు. "నువ్వు కూడా మంచిపేరు ఏదైనా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నావు కదా.. బహుశా ఆంజనేయస్వామి తన పేరునే సూచించివుంటారు" అని వారన్నారు.
అప్పటిదాకా 'చిరంజీవి' అనే పేరు ఉంటుందని ఆయనకు తెలీదు. పెళ్లి శుభలేఖల్లో వరుడిని 'చిరంజీవి' అని సంబోధిస్తారనీ, వధువును 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి' అని సంబోధిస్తారని తెలుసు కానీ ఆ పేరును పెట్టుకున్నారని తెలీదు. ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుందా అనడిగితే, బాగుంటుందన్నారు. అప్పుడు 'పునాదిరాళ్లు' షూటింగ్‌కు రాజమండ్రిలో జరుగుతోంది. అక్కడ ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో "నీ పేరు ఏం చెప్పమంటావు?" అని డైరెక్టర్ రాజ్‌కుమార్ అడిగారు. "చిరంజీవి అని చెప్పండి" అన్నారు శివశంకర వరప్రసాద్. అలా 'చిరంజీవి' ప్రప్రథమంగా మీడియాకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెరపై ఆ పేరుతో ప్రత్యక్షమయ్యారు.