English | Telugu
‘గ్యాంగ్ లీడర్’ కథకి ‘నో’ చెప్పిన చిరంజీవి.. మెగాస్టార్‌తో ‘ఎస్’ అనిపించడానికి ఏం చేశారు?
Updated : Feb 6, 2024
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు 150కి పైగా సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ వాటిలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్స్‌లో ‘గ్యాంగ్ లీడర్’ ఒకటి. చిరంజీవిని మెగాస్టార్‌ని చేసిన సినిమా కూడా అదే. విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టించింది. చిరంజీవి ఫ్యాన్స్ సంఖ్యని రెట్టింపు చేసిన సినిమా కూడా ఇదే.
అప్పటివరకు వచ్చిన చిరంజీవి సినిమాలకు భిన్నమైన కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి మేనరిజం కూడా కొత్తగా ఉండడంతో అభిమానులు ఫిదా అయిపోయారు. ఆడియోపరంగా కూడా ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరంజీవి, విజయశాంతి మధ్య కెమీస్ట్రీ ఈ సినిమాలో బాగా వర్కవుట్ అయింది. ఈ సినిమాలోని పాటల కోసమే రిపీట్ ఆడియన్స్ థియేటర్స్‌కి వెళ్ళే వారంటే అందులో అతిశయోక్తి లేదు. ఇంతటి సంచలనం సృష్టించిన సినిమా వెనుక కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ‘గ్యాంగ్‌లీడర్’ కథ విన్న చిరంజీవి మొదట ‘నో’ చెప్పాడంటే అందరూ ఆశ్చర్యపోకతప్పదు. ఒక మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉన్న విజయ బాపినీడు సినిమా మీద ఉన్న ఆసక్తితో ‘డబ్బు డబ్బు డబ్బు’ చిత్రంతో దర్శకుడిగా మారారు. అనంతరం చిరంజీవి హీరోగా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘హీరో’, ‘మగధీరుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. మెగాస్టార్‌తో ఓ విభిన్నమైన చిత్రాన్ని తీయాలని భావించిన బాపినీడు ‘గ్యాంగ్‌లీడర్’ కథ రాసి చిరుకి వినిపించారు. అయితే బాపినీడు చెప్పిన కథ నచ్చకపోవడంతో చిరంజీవి ఎలాంటి మొహమాటం లేకుండా చేయనని చెప్పేశారు.
చిరంజీవి నో చెప్పడంతో ఎంతో నిరుత్సాహపడిన బాపినీడు ఆ కథను అనుకోకుండా పరుచూరి బ్రదర్స్‌కి వినిపించారు. కథ విన్న తర్వాత అందులోని లోపాన్ని కనిపెట్టిన పరుచూరి బ్రదర్స్.. కథను మార్చి తీసుకు రావడానికి మూడు రోజులు టైమ్ అడిగారు. ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పారు బాపినీడు. పరుచూరి బ్రదర్స్‌పై ఉన్న అపార నమ్మకంతో ఆయన కూడా సరే అన్నారు. మూడు రోజుల తర్వాత కథకు కొన్ని ఆసక్తికర విషయాలను జోడిరచి చిరంజీవికి వినిపించారు గోపాలకృష్ణ. కథ విన్న వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పారు చిరంజీవి. డేట్స్ విషయం చూసుకోమని అల్లు అరవింద్‌కి పురమాయించారు. అయితే కథపై అంత నమ్మకం లేని అరవింద్.. గోపాలకృష్ణను మద్రాస్ పిలిపించుకున్నారు. గోపాలకృష్ణ కథ చెబుతున్నప్పుడు అరవింద్ రికార్డ్ చేసుకున్నారని ఒకానొక సందర్భంలో పరుచూరి బ్రదర్స్ తెలిపారు. ‘ఎందుకు రికార్డ్ చేసుకుంటున్నారు’ అని గోపాలకృష్ణ అడగగానే.. ‘మీరు మాటలతో మాయాజాలం చేసేస్తారు. కాబట్టి ఇంటికి వెళ్లాక ఒక్కసారి ఈ కథను విని ఎలా ఉందో చెబుతాను’ అని అరవింద్ అన్నారని గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
బాపినీడు రాసిన ‘గ్యాంగ్‌లీడర్’ కథలో మురళీమోహన్‌తోపాటు హీరో స్నేహితులు కూడా ఒకేసారి మృతి చెందుతారు. ఈ కథను బాపినీడు చెప్పగానే.. ‘అందరూ ఒకేసారి చనిపోతే ఆసక్తి ఏం ఉంటుంది. గ్యాంగ్ లేకుండా అసలు గ్యాంగ్‌లీడర్‌కు అర్థం ఏం ఉంటుంది’ అనే పాయింట్ ఆ కథలో నెగెటివ్‌గా అనిపించి పరుచూరి బ్రదర్స్ కొన్ని మార్పులు చేశారు. అలాగే విజయశాంతి, రావుగోపాలరావు పాత్రల రూపు రేఖల విషయంలో కూడా కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులు చేసిన తర్వాత కథకు ఒక కొత్త షేప్ వచ్చింది. ‘గ్యాంగ్ లీడర్’ వంటి బ్లాక్‌బస్టర్ రావడం వెనుక ఇంత ఆసక్తికరమైన కథ ఉంది.