English | Telugu

మెగాస్టార్ బాలీవుడ్ మూవీస్.. కామన్ పాయింట్ అదే!

తెలుగునాట తిరుగులేని కథానాయకుడిగా రాణించిన మెగాస్టార్ చిరంజీవి.. హిందీలోనూ తనదైన ముద్ర వేశారు. బాలీవుడ్ లో ముచ్చటగా మూడు సినిమాల్లో హీరోగా నటించి... అక్కడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారాయన. 1990, 1992, 1994 సంవత్సరాల్లో విడుదలైన ఈ చిత్రాలు.. చిరుకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ మూడు సినిమాలు కూడా దక్షిణాదిన ఘనవిజయం సాధించిన చిత్రాలకు రీమేక్ వెర్షన్స్ నే. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రతిబంధ్ (1990): హిందీలో చిరంజీవి నేరుగా నటించిన మొదటి సినిమా 'ప్రతి బంధ్'. తెలుగులో అఖండ విజయం సాధించిన 'అంకుశం' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మాతృకలో రాజశేఖర్ పోషించిన పాత్రని హిందీలో చిరంజీవి చేశారు.

ఆజ్ కా గూండారాజ్ (1992): చిరంజీవి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'గ్యాంగ్ లీడర్'.. హిందీలో 'ఆజ్ కా గూండారాజ్' పేరుతో రీమేక్ అయింది. తెలుగులో తను పోషించిన పాత్రనే హిందీ వెర్షన్ లోనూ ధరించారు మెగాస్టార్.

ది జెంటిల్ మేన్ (1994): కోలీవుడ్ సెన్సేషన్ 'జెంటిల్ మేన్' సినిమాని హిందీలో 'ది జెంటిల్ మేన్' పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో అర్జున్ పోషించిన పాత్రని.. బాలీవుడ్ లో చిరంజీవి చేశారు. హిందీనాట చిరు హీరోగా నటించిన ఆఖరి చిత్రమిదే కావడం విశేషం.