Read more!

English | Telugu

సిల్క్‌స్మిత చేసిన పనికి చిరంజీవి ఆ పాటను ముగ్గురితో చెయ్యాల్సి వచ్చింది!

ఒకప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారన్న విషయం తెలిసిందే. జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్‌ స్మిత, డిస్కో శాంతి, అనురాధ..లాంటి డాన్సర్స్‌ ఐటమ్‌ సాంగ్స్‌లో నటించి ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేవారు. అప్పట్లో టాప్‌ హీరోలందరి సినిమాల్లో ఇలాంటి ఐటమ్‌ సాంగ్స్‌ ఉండేవి. తర్వాతి కాలంలో ఐటమ్‌ సాంగ్స్‌ను హీరోయిన్స్‌తోనే చేయిస్తూ వాటిని స్పెషల్‌ సాంగ్స్‌గా ఛలామణిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఐటమ్‌ సాంగ్స్‌లో హీరోతోపాటు ఒకరు లేదా ఇద్దరు డాన్సర్స్‌ ఉండేవారు. కానీ, చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘కొండవీటి రాజా’ చిత్రంలోని ‘యాల యాలా.. ఉయ్యాలలోనా..’ అనే ఐటమ్‌ సాంగ్‌ను ఏకంగా ముగ్గురు డాన్సర్స్‌తో చేశారు. అయితే ఇది కావాలని చేసింది కాదు. ఈ ఐటమ్‌సాంగ్‌ను అలా చిత్రీకరించడం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే...

ఈ ఐటమ్‌ సాంగ్‌ను భారీగా తియ్యాలని కె.రాఘవేంద్రరావు ప్లాన్‌ చేశారు. ఈ సాంగ్‌లో నటించేందుకు సిల్క్‌ స్మితను సెలెక్ట్‌ చేసుకున్నారు. రూ.25 వేలు రెమ్యునరేషన్‌ కూడా ముందుగానే చెల్లించారు. అంతేకాదు, కాస్ట్యూమ్స్‌ కోసం రూ.20వేలు అదనంగా ఇచ్చారు. చెన్నయ్‌లోని వాహిని స్టూడియోలో రూ. 5 లక్షల ఖర్చుతో భారీ సెట్‌ వేశారు. ఆరోజుల్లో సిల్క్‌స్మిత హవా నడుస్తోంది. చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేది. ఆమెతో సినిమా చెయ్యాలంటే కొన్ని నెలల ముందుగానే కాల్షీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విధంగానే స్మిత కాల్షీట్లు నాలుగు నెలల ముందుగానే తీసుకుంది చిత్ర యూనిట్‌. షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ ప్రారంభించారు. 

కాల్షీట్స్‌ ప్రకారం ఆరోజు ఉదయమే సెట్‌కి వచ్చింది స్మిత. ఆమెను చూసి రాఘవేంద్రరావు షాక్‌ అయ్యారు. అప్పుడే నిద్ర లేచి వచ్చినట్టుగా ఉంది. హెయిర్‌ స్టైల్‌ చాలా చిందరవందరగా ఉంది. పాటల చిత్రీకరణ విషయంలో, హీరోయిన్లను అందంగా చూపించే విషయంలో రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని అందరికీ తెలుసిన విషయమే. అందుకే ఆమె గెటప్‌ ఆయనకు నచ్చలేదు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి హెయిర్‌ స్టైల్‌ మార్చమన్నారు. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్‌ చెబితే టాప్‌ హీరోయిన్‌ అయినా సరే దాన్ని పాటించాల్సిందే. కానీ, స్మిత మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. పైగా హెయిర్‌ స్టైల్‌ బాగానే ఉందంటూ వాదించింది. ఆమెతో డిస్కస్‌ చేయడం ఇష్టంలేని రాఘవేంద్రరావు పాటను తీసేందుకు సిద్ధమయ్యారు.

ఆ ఒక్క విషయంలోనే కాదు, ఆరోజంతా యూనిట్‌లోని వారిని చాలా ఇబ్బంది పెట్టింది స్మిత. పాటలోని కొంత భాగాన్ని పొగమంచులో తియ్యాల్సి ఉంది. షాట్‌కి ముందు పొగమంచును స్ప్రెడ్‌ చేశారు టెక్నీషియన్స్‌. ఆ సమయంలోనే ఫ్యాన్‌ వేసుకొని కూర్చుంది స్మిత. దాంతో పొగమంచు వీడిపోయింది. ఆ కారణంగా షూటింగ్‌ మరింత ఆలస్యమైంది. ఇదంతా నిర్మాత దేవివరప్రసాద్‌ గమనిస్తున్నారు. షూటింగ్‌కి ఇబ్బంది కలుగుతుందని ఏమీ మాట్లాడకుండా ఉన్నారాయన. మరుసటిరోజు కూడా ఆమె ప్రవర్తనలో మార్పు లేదు. పైగా డైరెక్టర్‌ని కూడా తన మాటలతో అవమానించిందట. దీంతో నిర్మాతకు కోపం ఆగలేదు. రాఘవేంద్రరావుతో మాట్లాడి ఆమెను సినిమా నుంచి తొలగించారు. అప్పటికి స్మితతో రెండు చరణాలు మాత్రమే చిత్రీకరించారు. పల్లవి, మరో చరణం బ్యాలెన్స్‌ ఉన్నాయి. పల్లవిని జయమాలినితో, మరో చరణాన్ని అనురాధతో తీశారు. అందుకే జయమాలిని పాట ప్రారంభంలో వచ్చే చరణంలోనే కనిపిస్తుంది. మిగిలిన చివరి చరణాన్ని కూడా జయమాలినితోనే తీస్తే మధ్యలో వచ్చే రెండు చరణాల్లో స్మిత కనిపిస్తుంది. అది ఎబ్బెట్టుగా ఉంటుందని భావించారు. ఆ చరణాన్ని మరో డాన్సర్‌తో తీస్తే కావాలనే ముగ్గురితో పాట చేశారనే ఫీలింగ్‌ ఉంటుందన్న ఉద్దేశంతో అనురాధతో చేయించారు. ఈ ఐటమ్‌ సాంగ్‌ వెనుక ఇంత తతంగం జరిగిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.