Read more!

English | Telugu

అన్నాదురై అంతిమ సంస్కారంలో పాల్గొని, 'క‌థానాయ‌కుడు' షూటింగ్ పూర్తి చేసిన జ‌య‌ల‌లిత‌!

 

విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు టైటిల్ రోల్ చేసిన 'క‌థానాయ‌కుడు' (1969) బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. కె. హేమాంబ‌ర‌ధ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో జ‌య‌ల‌లిత నాయిక‌గా న‌టించారు. భ్ర‌ష్టుప‌ట్టిన రాజ‌కీయాల‌పై సెటైరిక‌ల్ మూవీగా ఈ సినిమా రూపొందింది. ప్యాచ్‌వ‌ర్క్ చిత్రీక‌ర‌ణ సంద‌ర్భంగా అనుకోని అవాంత‌రం ఏర్ప‌డింది. 1969 ఫిబ్ర‌వ‌రి 3 నుంచి 6 వ‌ర‌కూ ఎన్టీఆర్‌, జ‌య‌ల‌లిత కాల్షీట్లు ఇచ్చారు.

అంత‌లో పిడుగులాంటి వార్త. అప్ప‌టికే అనారోగ్యంతో మ‌ద్రాస్‌లోని స్టాన్లీ హాస్పిట‌ల్‌లో ఉన్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత అన్నాదురై క‌న్నుమూశారు. త‌మిళ ప్ర‌జానీకంలో అన్నాదురైకు ఉన్న ఆద‌ర‌ణ అసామాన్యం. ఆయ‌న మృతితో త‌మిళ‌నాడు మొత్తం స్తంభించిపోయింది. అప్పుడు డీఎంకేలో ఎంజీఆర్ కూడా కీల‌క వ్య‌క్తిగా ఉన్నారు. అన్నాదురై మృతి చెందిన విషాదంలో ఉన్న జ‌య‌ల‌లిత కూడా 'క‌థానాయ‌కుడు' ప్యాచ్‌వ‌ర్క్ షూటింగ్‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. అయితే ఎన్టీఆర్ కాల్షీట్లు 6వ తేదీ దాకే ఉన్నాయి. అది త‌ప్పితే ఆరు నెల‌ల దాకా ఆయ‌న కాల్షీట్లు లేవు. నిర్మాత కె. గోపాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు హేమాంబ‌ర‌ధ‌ర‌రావుకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్ప‌టికే ఫిబ్ర‌వ‌రి 27న సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేసేశారు.

అన్నాదురై పార్థివ దేహాన్ని రాజాజీ హాలులో ఉంచారు. ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు అంజ‌లి ఘ‌టించారు. మ‌ర్నాడు అంతిమ సంస్కారం. శ‌ర‌వేగంగా బీచ్‌లో స‌మాధిని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 6న మ‌ద్రాస్‌లోని సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు, త‌మిళ‌నాడు వ్యాప్తంగా వ‌చ్చిన జ‌నం కాలిన‌డ‌క‌న అన్నాదురై స‌మాధికి అంజ‌లి ఘ‌టించే కార్య‌క్ర‌మం జ‌రిగింది. జ‌య‌ల‌లిత కూడా టి. న‌గ‌ర్ నుంచి బీచ్ దాకా న‌డిచే వెళ్లారు.

ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఎన్టీఆర్ ప‌దే ప‌దే ఫోన్ చేస్తూ వ‌చ్చారు. వారికి టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఆ రోజు దాటితే ఆర్నెల్ల దాకా ఎన్టీఆర్ మ‌ళ్లీ దొర‌క‌రు. అయితే ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌సాద్ స్టూడియోకి వ‌చ్చారు జ‌య‌ల‌లిత‌. అన్నాదురై స‌మాధికి అంజ‌లి ఘ‌టించి, శ్ర‌మ తీసుకొని ఆమె అదే రోజు షూటింగ్‌కు వ‌చ్చారు. అదీ.. ఆమె క‌మిట్‌మెంట్‌! అయితే తీయాల్సిన బిట్లు 52 దాకా ఉన్నాయి. ఆ రాత్రిలోగా వాటిని తియ్యాలి. నిర్మాత‌కు ఎంత కంగారుగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాటోగ్రాఫ‌ర్ వి.ఎస్‌.ఆర్‌. స్వామికి ఎన్టీఆర్‌తో అదే ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఆయ‌న మీదే భార‌మంతా వేశారు నిర్మాత‌. రాత్రి 12 గంట‌ల‌లోగా షూటింగ్ పూర్తిచేయాల్సిందిగా బ‌తిమ‌లాడుతూ, అలా చేస్తే ఫియ‌ట్ కారు గిఫ్ట్‌గా ఇస్తాన‌ని ప్రామిస్ చేశారు.

నేచుర‌ల్‌గానే స్వామి య‌మ స్పీడు. క్రేన్ ఉప‌యోగించే టైమ్ లేక‌పోవ‌డంతో ఒక ప‌క్క‌ రోప్ మీద నుంచి జారుతూ, ఇంకోప‌క్క ట్రాలీలు వాడుతూ, క్లోజ్ షాట్స్ తీస్తూ, ఎన్టీఆర్‌-జ‌య‌ల‌లిత కాంబినేష‌న్ సీన్స్ అన్నింటినీ స‌రిగ్గా అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌క‌ల్లా తీసేశారు స్వామి. నిర్మాత గుమ్మ‌డికాయ కొట్టి స్థిమిత‌ప‌డ్డారు. ఆరోజు షూటింగ్‌కు జ‌య‌ల‌లిత రావ‌డం ఒక విశేష‌మైతే, సినిమాటోగ్రాఫ‌ర్ వి.ఎస్‌.ఆర్‌. స్వామి మ‌హా స్పీడుతో చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌డం ఇంకో విశేషం. ముందుగా అనౌన్స్ చేసిన‌ట్లు 1969 ఫిబ్ర‌వ‌రి 27న విడుద‌లైన 'క‌థానాయ‌కుడు'కు జ‌నం నీరాజ‌నాలు ప‌ట్టారు. 15 కేంద్రాల‌లో ఈ సినిమా వంద రోజులు ఆడింది.