English | Telugu
సినీ రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేరు తెచ్చుకున్న ఏకైక మహిళ భానుమతి!
Updated : Dec 24, 2024
(డిసెంబర్ 24 భానుమతీ రామకష్ణ వర్థంతి సందర్భంగా..)
ఎవరైనా ఒక రంగంలో తమ ప్రజ్ఞ చూపించి అందులోనే విజయాలు సాధిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం వివిధ రంగాల్లో తమ ప్రతిభను చూపిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. అలాంటి వారిలో భానుమతి ఒకరు. నటిగా, నేపథ్యగాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, ఎడిటర్‌గా, నిర్మాతగా, రచయిత్రిగా, స్టూడియో అధినేతగా అద్భుతమైన విజయాలు సాధించారు. ఒక విధంగా సినీ రంగంలోని ఇన్ని శాఖల్లో ప్రతిభ కనబరిచిన ఏకైక మహిళగా భానుమతి పేరును చెప్పుకోవచ్చు. అంతేకాదు, తెలుగు చిత్ర సీమలో తొలి లేడీ సూపర్‌స్టార్‌గా కూడా ఆమె పేరును ఉదహరించవచ్చు. అంతటి ప్రజ్ఞాపాటవాలు కలిగిన భానుమతి గురించి తెలుసుకోవడం భావి తరాలవారికి ఎంతో ఉపయోగకరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బయోగ్రఫీలో భానుమతి సినిమా రంగంలోకి ప్రవేశించిన విధానం గురించి, వారి వ్యక్తిగత, సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.
1926 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు భానుమతి. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. తండ్రి వద్దే సంగీత అభ్యాసం చేశారు భానుమతి. అనేక కట్టుబాట్లు ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమెకు చిన్నతనం నుంచే ధైర్య సాహసాలు ఎక్కువ. స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఓ సందర్భంలో తప్పనిసరి కావడంతో రెండు నాటకాల్లో నటించారు. అలా నటిగా తన తొలి అడుగు వేశారు. 14 ఏళ్ళ వయసులో తొలిసారి వరవిక్రయం అనే సినిమాలో నటించారు. 18 ఏళ్ళ వయసులో రామకృష్ణారావును వివాహం చేసుకున్నారు. 19 ఏళ్ళకు రచయిత్రిగా మారారు. 21 ఏళ్ళకు నిర్మాతగా తొలి సినిమా నిర్మించారు. 25 ఏళ్ళకు తమ కుమారుడు భరణి పేరు మీద సొంత స్టూడియోను నిర్మించారు. 28 ఏళ్ళకు చండీరాణి చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదలైంది. ఒకవిధంగా పాన్ ఇండియా మూవీని తొలిసారి నిర్మించి, దర్శకత్వం వహించిన ఘనత భానుమతికి దక్కుతుంది. కేవలం 15 సంవత్సరాల వ్యవధిలో భానుమతి జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. 65 సంవత్సరాల సినిమా కెరీర్‌లో దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించారు. వాస్తవానికి ఇవన్నీ ఆమె కోరుకున్నవి కావు. మొదటి నుంచీ ఆమెకు నాటకాల్లో, సినిమాల్లో నటించాలనే ఆలోచన ఉండేది కాదు. సాధారణ గృహిణి భర్త, పిల్లలతో జీవితాన్ని సాగించాలని ఆశపడ్డారు. అయితే మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలని అనుకునేవారు. ఆరోజుల్లో నాటకాల్లో, సినిమాల్లో నటించే మహిళలకు గౌరవం ఉండేది కాదు. అలాంటి సమయంలో టంగుటూరి సూర్యకుమారి సినిమా రంగంలో హీరోయిన్‌గా ప్రవేశించారు. ఆమె స్ఫూర్తితోనే హీరోయిన్‌గా అవకాశం వస్తే అంగీకరించారు. ఆ సినిమా పేరు మాలతీ మాధవం. కానీ, హీరోయిన్‌గా నటించడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. దర్శకుడు సి.పుల్లయ్య.. వారికి ధైర్యం చెప్పి ఒప్పించారు. అయితే భానుమతిని తాకరాదని, కౌగలింతల వంటి సీన్స్ ఉండకూడదని, కాస్ట్యూమ్స్ కూడా పద్ధతిగా ఉండాలనే కండిషన్ పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు వెంకటసుబ్బయ్య. ఇలాంటి కండిషన్స్‌తోనే భానుమతి చాలా సంవత్సరాలు సినిమాల్లో నటించారు. ఆమె కెరీర్‌లో కృష్ణప్రేమ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పి.ఎస్.రామకృష్ణారావును ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు.
1939లో భానుమతి నటించిన మొదటి సినిమా విడుదలైంది. దాదాపు ఆరు సంవత్సరాలపాటు పది సినిమాల్లో నటించిన తర్వాత 1945లో స్వర్గసీమ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కేవలం నటిగానే కాదు, గాయనిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. భానుమతి నటించిన తొలి తమిళ చిత్రం రాజముక్తి. ఆ తర్వాత తెలుగులో లైలా మజ్ను, రక్షరేఖ, మల్లీశ్వరి, విప్రనారాయణ, సారంగధర, బాటసారి, బొబ్బిలియుద్ధం, పల్నాటి యుద్ధం, అంతస్తులు, తోడు నీడ... ఇలా ఆమె నటించిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. భరణి పిక్చర్స్ అనే బేనర్‌ను స్థాపించి కొన్ని సినిమాలను నిర్మించారు. వాటిలో కొన్ని సినిమాలకు భానుమతి, కొన్ని సినిమాలకు ఆమె భర్త రామకృష్ణారావు దర్శకత్వం వహించారు. 1967లో ఆమె హీరోయిన్‌గా నటించిన చివరి సినిమాలు గృహలక్ష్మీ, పుణ్యవతి. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మట్టిలో మాణిక్యం చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆమె చివరి సినిమా 1998లో వచ్చిన పెళ్లికానుక.
నటిగానే కాకుండా దర్శకురాలిగా భానుమతి విభిన్నమైన సినిమాలను రూపొందించారు. చండీరాణి, గృహలక్ష్మీ, అంతా మనమంచికే, విచిత్ర వివాహం, భక్త ధృవ మార్కండేయ వంటి 15 సినిమాలకు దర్శకత్వం వహించారు. గాయనిగా విశేషమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆమె పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. అంతేకాదు, రచయిత్రిగా అత్తగారి కథలు, అత్తగారు.. నక్సలైట్లు, నాలో నేను వంటి రచనలతోపాటు ఎన్నో కథానికలు రచించారు. నిర్మాతగా బాటసారి, వరుడు కావాలి, చింతామణి, విప్రనారాయణ, చక్రపాణి, చండీరాణి1, చండీరాణి2, ప్రేమ, లైలామజ్ఞు, రత్నమాల వంటి వైవిధ్యభరిత చిత్రాలు నిర్మించారు. నటిగా, గాయనిగా అద్భుతమైన విజయాలు అందుకున్న భానుమతి తెలుగులో తొలి లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.
వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. భానుమతికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆరోజుల్లో భానుమతిని ధైర్యానికి పర్యాయపదంగా చెప్పుకునేవారు. ఆ పేరులోనే ఓ గాంభీర్యం ఉండేది. ఆమె దగ్గరకు వెళ్లాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా పెద్ద స్టార్స్ కూడా భయపడేవారు. ‘ఎన్టీఆర్, ఎఎన్నార్‌లతో మీరు కలిసి నటించారు కదా’ అని అడిగితే.. దానికి ‘నేను కాదు.. వాళ్ళే నాతో కలిసి నటించారు’ అని చెప్పుకున్న సాహసి భానుమతి. ఆమె అవకాశాల కోసం ఎప్పుడూ వెంపర్లాడేవారు కాదు. తన దగ్గరకు వచ్చిన సినిమాలే చేసేవారు. అందులోనూ తన మనస్తత్వానికి దగ్గరగా ఉన్నవి మాత్రమే అంగీకరించేవారు. షూటింగ్ సమయంలో కూడా తనని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడితే ఊరుకునేవారు కాదు. ఆరోజుల్లో హీరోయిన్లంటే ఎంతో చులకన భావంతో చూసేవారు డైరెక్టర్లు. అలాంటి ఓ డైరెక్టర్ హీరోయిన్లను రావే, పోవే అంటూ మాట్లాడేవారు. ఆ డైరెక్టర్ ఓ సినిమా లొకేషన్‌లో భానుమతిని ‘ఇటు రావే’ అని పిలిచాడు. దాంతో ఆమెకు ఒళ్ళు మండిపోయి ‘ఏంట్రా పిలిచావ్..’ అని అతని దగ్గరికి వెళ్లారు. అంతే.. ఆ డైరెక్టర్‌కి నోట మాట రాలేదు. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఆయనతోపాటు యూనిట్‌లో ఉన్నవారు కూడా షాక్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆ డైరెక్టర్ హీరోయిన్లెవరినీ అమర్యాదగా చూడలేదు.
ఆరోజుల్లో భానుమతితో చాలా మందికి విభేదాలు ఉండేవి. ఎవరు తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా ఆమె ఉపేక్షించేది కాదు. అందుకే అందరూ ఆమెకు గర్వం అనుకునేవారు. అది ఆత్మాభిమానం వల్ల వచ్చిందే తప్ప గర్వం కాదని ఆమె సన్నిహితులకు, ఆమెను దగ్గరగా చూసిన వారికి తెలుస్తుంది. ఆ కారణంగానే చాలా సినిమాల నుంచి ఆమె తప్పుకున్నారు. ఎఎన్నార్, సావిత్రి నటించిన దేవదాసు చిత్రంలో మొదట భానుమతినే సెలెక్ట్ చేశారు. అయితే ఆ సినిమాను నిర్మించిన డి.ఎల్.నారాయణ తమ భరణి పిక్చర్స్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాడు. తన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్‌గా చేసిన వాడి సినిమాలో నేను నటించాలా అంటూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఆ తర్వాత మిస్సమ్మ చిత్రంలో మొదట భానుమతే హీరోయిన్. నాలుగైదు రీళ్ళు తీసిన తర్వాత నిర్మాత చక్రపాణికి, ఆమెకు చిన్న మాట పట్టింపు వచ్చింది. ఒకరోజు తన ఇంట్లో వ్రతం చేసుకొని షూటింగ్‌కి ఆలస్యంగా వచ్చారు. దాంతో చక్రపాణి ఆమెపై అరిచారు. తను లేట్‌గా వస్తానని మేనేజర్‌తో చెప్పానని, అందులో నా తప్పు ఏమీ లేదని భానుమతి అన్నారు. అయినా సరే క్షమాపణ కోరుతూ ఒక లెటర్ ఇవ్వమని చక్రపాణి అడిగారు. దానికి భానుమతి ‘నాకంత ఖర్మ పట్టలేదు. నా తప్పు లేనప్పుడు నేనెందుకు క్షమాపణ చెప్పాలి. మీ సినిమా నేను చెయ్యడం లేదు’ అంటూ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయనపై కోపంతో చక్రపాణి పేరుతో ఓ హాస్యచిత్రాన్ని నిర్మించారు భానుమతి. దానికి ఆమె భర్త రామకృష్ణ దర్వకత్వం వహించారు.
నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయిత్రిగా, స్టూడియో అధినేతగా పలు శాఖల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన భానుమతిని ఎన్నో పురస్కారాలతో సత్కరించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ పురస్కారాన్ని అందించింది. మూడుసార్లు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. అన్నాదురై.. నడిప్పుకు ఇళక్కనం అనే బిరుదు ఇచ్చి గౌరవించారు. తమిళ అభిమానులు ఆమెను అష్టావధాని అని కీర్తించారు. 1966లో ఆమె రచించిన అత్తగారి కథలు అనే హాస్యకథల సంపుటికి పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. ఇదే సంపుటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు, కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడు ప్రభుత్వం గౌరవించింది. 1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. 1986లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది. 1986లో ఉత్తమ దర్శకురాలిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్నారు భానుమతి. 2001లో కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 2013లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో భానుమతి పేరును కూడా పొందుపరిచారు.
మట్టిలో మాణిక్యం చిత్రం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భానుమతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాతమ్మకల, మంగమ్మగారి మనవడు వంటి సినిమాల్లో ఆమె నటనకు భారీ ప్రశంసలు లభించాయి. 1986 జూన్‌లో తనయుడు భరణి.. తల్లిదండ్రులిద్దరినీ అమెరికా తీసుకెళ్ళారు. అక్కడ భరణి డాక్టరుగా పనిచేస్తున్నారు. అమెరికా వెళ్లిన తర్వాత రామకృష్ణారావుకు గుండెపోటు రావడంతో సెప్టెంబర్ 7న తుదిశ్వాస విడిచారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే భానుమతి పుట్టినరోజు సెప్టెంబర్ 7. అదే రోజు భర్త మరణించడం ఆమెను క్రుంగదీసింది. ఇండియా వచ్చిన తర్వాత కొంతకాలం ఎవరితోనూ మాట్లాడలేదు. తన భర్త దూరమైన బాధను భరిస్తూ కొన్నాళ్లు గడిపారు. ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు 1990లో బామ్మబాట బంగారుబాట చిత్రంలో నటించారు. ఆ తర్వాత పెద్దరికం, చామంతి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 1995 వరకు అడపా దడపా సినిమాలు చేసిన భానుమతి ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. అయితే 1998లో వచ్చిన పెళ్లికానుక చిత్రంలో మాత్రం నటించారు. అదే ఆమె చివరి సినిమా. ఆ తర్వాత సినిమాలకు దూరంగా భర్త రామకృష్ణారావు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శేష జీవితాన్ని గడిపారు. 2005 డిసెంబర్ 24న భానుమతి ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. సినిమా రంగంలో మహిళగా అసాధారణ విజయాలను సొంతం చేసుకున్న భానుమతీ రామకృష్ణ జీవితం యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.