English | Telugu

బి.సరోజాదేవి అందానికి ఫిదా అయిన ప్రధాన మంత్రి!

1950 నుంచి 1970 వరకు ఎంతో మంది హీరోయిన్లు తమ అందచందాలతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వారిలో కొందరు హీరోయిన్లు మాత్రమే అప్పటి కుర్రకారుకి నిద్రలేకుండా చేశారు. వారిని తమ ఆరాధ్య దేవతలుగా భావించారు. అలాంటి వారిలో బి.సరోజాదేవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తన ముద్దు ముద్దు మాటలు వినేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారు. అందాన్ని ఆస్వాదించడానికి, అభినందించడానికి కారెవరు అనర్హులు అన్నట్టుగా నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా బి.సరోజాదేవి అందానికి ఫిదా అయిపోయారు. 1963లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆమెను చూసి ఒక్కసారిగా షాక్‌కి గురైన నెహ్రూ ‘నువ్వు మెరిసిపోతున్నావు’ అంటూ ఆమెకు కితాబునివ్వడం మామూలు విషయం కాదు. అంతటి అందం, మెరుపు సొంతం చేసుకున్న బి.సరోజాదేవి సినిమా రంగంలోకి ఎలా వచ్చారు, తను చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని ఎలా అలరించారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.

1938 జనవరి 7న బెంగళూరులో బైరప్ప, రుద్రమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు బి.సరోజాదేవి. తండ్రి పోలీస్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఆయనకు కళలంలే చాలా మక్కువ. దాంతో సరోజాదేవికి చిన్నతనంలోనే డాన్స్‌, సంగీతం నేర్పించారు. 13 ఏళ్ళ వయసులో ఒక ఫంక్షన్‌లో పాట పాడుతూ కనిపించిన సరోజాదేవిని చూసిన కన్నడ నటుడు, నిర్మాత హోనప్ప భాగవతార్‌ తను నిర్మిస్తున్న ‘మహాకవి కాళిదాస’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. అయితే సరోజాదేవికి సినిమాలంటే ఆసక్తి లేదు. తను పెద్దయ్యాక టీచర్‌ అవ్వాలనేది ఆమె కోరిక. అయితే తల్లిదండ్రుల బలవంతం మీద ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు.

‘మహాకవి కాళిదాస’ చిత్రం తర్వాత కన్నడలో వరసగా అవకాశాలు రావడం మొదలైంది. దాంతో ఆమెకు కూడా సినిమాలపై ఆసక్తి మొదలైంది. అలా కన్నడలో వరసగా సినిమాలు చేశారు. 1956లో విడుదలైన తిరుమానం చిత్రం సరోజాదేవి నటించిన తొలి తమిళ చిత్రం. పాండురంగ మహత్మ్యం చిత్రం ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో ఆమె హీరోయిన్‌గా బిజీ అయిపోయారు. 1950 దశకంలో అన్ని భాషల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత ఆమెకే దక్కింది. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆమె ముద్దు ముద్దు మాటలు ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. ఆరోజుల్లో కొందరు అమ్మాయిలు సరోజాదేవిని అనుకరిస్తూ మాట్లాడేవారు.

తమిళ్‌లో ఎం.జి.రామచంద్రన్‌, శివాజీగణేశన్‌, జెమినీగణేశన్‌ల సరసన, కన్నడలో రాజ్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌, కళ్యాణ్‌కుమార్‌లతో, హిందీలో దిలీప్‌కుమార్‌, షమ్మీ కపూర్‌, సునీల్‌దత్‌, రాజేంద్రకుమార్‌ వంటి టాప్‌ హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు సరోజాదేవి. ఆరోజుల్లో ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకున్న దక్షిణాది హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమెను ఆంధ్రా క్లియోపాత్రాగా, ఆంధ్రా ఎలిజిబెత్‌ టేలర్‌గా పిలిచేవారు. పదేళ్ళపాటు నాలుగు భాషల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సరోజాదేవి తన కెరీర్‌లో మొత్తం 200 సినిమాల్లో నటించారు. ఆరోజుల్లో ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత కూడా ఆమెకే దక్కింది. తను నటించిన సినిమాల్లో తనకు నచ్చిన సినిమాలు జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం అని చెప్పేవారు సరోజాదేవి. 1970లో వచ్చిన ‘మాయని మమత’ హీరోయిన్‌గా ఆమె నటించిన చివరి చిత్రం. తెలుగులో ఎన్టీఆర్‌ సినిమా ద్వారానే పరిచయమైన సరోజాదేవి చివరి సినిమా ‘సామ్రాట్‌ అశోక’ కూడా ఎన్టీఆర్‌దే కావడం విశేషం.

వ్యక్తిగత విషయాలకు వస్తే... 1967 మార్చి 1న వ్యాపార వేత్త శ్రీహర్షతో బి.సరోజాదేవి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, గౌతమ్‌ రామచంద్ర. 1986లో భర్త శ్రీహర్ష గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత 1997లో పెద్ద కుమార్తె భువనేశ్వరి కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. ఇక సరోజాదేవి అందుకున్న పురస్కారాల విషయానికి వస్తే.. సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను 1969లో పద్మశ్రీతోనూ, 1992లో పద్మభూషణ్‌తోనూ సరోజాదేవిని సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇవికాక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక అవార్డులు ఆమెను వరించాయి. బెంగళూరు యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్‌నిచ్చి గౌరవించింది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బి.సరోజాదేవి 2025 జూలై 14న తుదిశ్వాస విడిచారు.