English | Telugu

సెట్‌లో సిగరెట్‌ కాల్చినందుకు జగ్గయ్యను తొలగించి కాంతారావును హీరోగా తీసుకున్న నిర్మాత!

సెట్‌లో సిగరెట్‌ కాల్చినందుకు జగ్గయ్యను తొలగించి కాంతారావును హీరోగా తీసుకున్న నిర్మాత!

(డిసెంబర్ 31 కొంగర జగ్గయ్య జయంతి సందర్భంగా..)

తెలుగు చిత్రసీమలో నటుడు జగ్గయ్యకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. తన గంభీరమైన కంఠంతో రంగస్థలం మీద, వెండితెరపైన తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. కళావాచస్పతిగా పేరు గాంచిన జగ్గయ్యలో ఎన్నో కోణాలు వున్నాయి. నటుడుగా, సాహితీ వేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు. నటనలో జగ్గయ్యది ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన డైలాగులు చెప్పే విధానం ఎంతో వైవిధ్యంగా ఉండేది. ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఇట్టే ఇమిడిపోయే జగ్గయ్య హీరోగానే కాకుండా, ఆరోజుల్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ చిత్రాల్లో కూడా నటించారు. అందరితోనూ స్నేహభావంతో మెలిగే జగ్గయ్య అంటే సహ నటీనటులందరికీ ఇష్టమే. జగ్గయ్యను తమ కుటుంబ సభ్యుడిగానే భావించేవారు మహానటి సావిత్రి. ఆయన్ని ‘బావా’ అని పిలిచేవారు. మంచి స్వభావం ఉన్న జగ్గయ్యకు ఓ సందర్భంలో ఘోరమైన అవమానం జరిగింది. 

1935లో తమిళనాడులోని సేలంలో మోడరన్‌ థియేటర్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. 1982 వరకు తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, సింహళ, ఇంగ్లీష్‌ భాషల్లో 150కి పైగా సినిమాలు నిర్మించిన ఘనత మోడరన్‌ థియేటర్స్‌ది. ఈ సంస్థకు అధిపతి టి.ఆర్‌.సుందరం ముదలియార్‌. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండేవారాయన. ఏ చిన్న తప్పు జరిగినా ఒప్పుకునేవారు కాదు. ఏ ఆరిస్టయినా తప్పు చేస్తే వారిని తీసేసి వేరే వారిని తీసుకునేందుకు కూడా వెనుకాడేవారు కాదు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఫ్లోర్‌లో ఎవరూ సిగరెట్‌ కాల్చకూడదు అనే కండిషన్‌ పెట్టారు. తమ సంస్థ నిర్మించే సినిమాల్లో పనిచేసేవారికి ముందుగానే ఆ కండిషన్స్‌ గురించి చెప్పేవారు. దానికి ఒప్పుకున్న వారినే తీసుకునేవారు. అయితే ఫ్లోర్‌ బయట సిగరెట్‌ కాల్చుకునేందుకు ప్రత్యేకంగా కుర్చీలు వేయించేవారు. ఎవరైనా అక్కడికి వెళ్ళి సిగరెట్‌ కాల్చుకుని రావాలి. ఇలాంటి ఎన్నో కఠినమైన నిబంధనలు ఆ సంస్థలో ఉండేవి.

1961లో జగ్గయ్య హీరోగా ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’ చిత్రాన్ని ప్రారంభించింది మోడరన్‌ థియేటర్స్‌. జగ్గయ్యకు ఆరోజుల్లో సిగరెట్‌ కాల్చే అలవాటు ఉండేది. ఈ సినిమాలోకి తీసుకునే ముందే జగ్గయ్యకు తమ సంస్థ నిబంధనల గురించి చెప్పారు సుందరం. ఈ సంస్థ ఏ సినిమా ప్రారంభించినా ఎలాంటి గ్యాప్‌ లేకుండా షూటింగ్‌ను ఫాస్ట్‌గా పూర్తి చేసేవారు. అలా ఈ సినిమా కూడా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. మరికొన్ని రోజుల్లో జగ్గయ్యకు సంబంధించిన పోర్షన్‌ పూర్తయిపోతుంది. ఇలా ఉండగా.. ఒకరోజు షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జగ్గయ్య సిగరెట్‌ కాల్చాలనుకున్నారు. ఒక్క సిగరెట్‌ కోసం ఫ్లోర్‌ బయటికి వెళ్ళి రావడం టైమ్‌ వేస్ట్‌ అనుకున్న జగ్గయ్య సెట్‌లోనే కూర్చొని సిగరెట్‌ తాగుతున్నారు. అదే సమయంలో సెట్‌లోకి వస్తున్న సుందరం అది చూశారు. వెంటనే తన ఆఫీస్‌ రూమ్‌కి వెళ్ళిపోయి.. ప్రొడక్షన్‌ మేనేజర్‌ను పిలిచారు. జగ్గయ్యకు ఇవ్వవలిసిన పారితోషికాన్ని చెల్లించి ఆయన్ని పంపించెయ్యమని అతనికి చెప్పారు. ఆ సినిమాకి అదే చివరి షెడ్యూల్‌. ఇప్పుడు జగ్గయ్యను తీసేసి వేరే హీరోని పెడితే అతనికి సంబంధించిన సీన్స్‌ అన్నీ రీషూట్‌ చెయ్యాలి. కానీ, ఆ ఖర్చు గురించి సుందరం లెక్క చేయలేదు. మద్రాస్‌లోని తమ ఆఫీస్‌కి ఫోన్‌ చేసి కాంతారావు డేట్స్‌ ఖాళీగా ఉన్నాయేమో కనుక్కోమని చెప్పారు. అతని డేట్స్‌ దొరకడంతో వెంటనే సేలం పంపించారు అక్కడి ఆఫీస్‌ సిబ్బంది. సెట్‌కి వెళ్ళే వరకు జగ్గయ్యను ఆ సినిమా నుంచి తొలగించిన విషయం కాంతారావుకు తెలీదు. ఇదే విషయం గురించి జగ్గయ్యతో మాట్లాడి ఆయన ఓకే అన్న తర్వాత మేకప్‌ వేసుకున్నారు కాంతారావు. అలా ఒక్క సిగరెట్‌ వల్ల ఆ సినిమాను కోల్పోయారు జగ్గయ్య. ఆ ఒక్క సిగరెట్‌ వల్లే నిర్మాత సుందరం రీషూట్‌ కోసం ఎంతో డబ్బును ఖర్చు చెయ్యాల్సి వచ్చింది. తనను ఆ సినిమా నుంచి తొలగించిన విషయం తర్వాత తెలుసుకున్న జగ్గయ్య ఎంతో బాధపడ్డారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఘోరమైన అవమానంగా దీన్ని పరిగణించేవారు.