English | Telugu

నటుడిగా స్థిరపడిన కాశీవిశ్వనాథ్‌ డైరెక్ట్‌ చేసిన బ్లాక్‌బస్టర్‌ గురించి మీకు తెలుసా?

సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఎంతోమంది వివిధ శాఖల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చినవారు దర్శకులు అయినవారు, హీరో కావాలని వచ్చి సంగీత దర్శకుడిగా మారినవారు ఉన్నారు. టాలీవుడ్‌ విషయానికి వస్తే కొందరు నటులుగా మారిన తర్వాత రచనను పక్కన పెట్టిన రచయితలు ఉన్నారు. ఇక దర్శకుల విషయానికి వస్తే.. ఎన్నో కళాఖండాలు సృష్టించిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌.. ఒక దశలో తనలోని దర్శకుడ్ని పక్కన పెట్టి నటుడుగా కొనసాగారు. అలాంటి కోవలోకి వస్తారు దర్శకుడు వై.కాశీవిశ్వనాథ్‌. దర్శకుడుగా చేసిన సినిమాలు రెండే అయినా.. దర్శకత్వ శాఖలో అపారమైన అనుభవాన్ని సంపాదించారు. ఇప్పుడు పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపిస్తున్న కాశీ విశ్వనాథ్‌ గురించి, ఆయన చేసిన సినిమాల గురించి చాలా మందికి తెలియదు.

రాజమండ్రి దగ్గరలోని పురుషోత్తపట్నంలో జన్మించారు వై.కాశీవిశ్వనాథ్‌. తన బంధువుకి ఒక సినిమా థియేటర్‌ ఉండేది. అందులో ప్రతి రోజూ సినిమాలు చూడడం ద్వారా సినిమాలంటే ఆసక్తి పెరిగింది. కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘తొలికోడి కూసింది’ సినిమా ఆయన్ని డైరెక్షన్‌ వైపు టర్న్‌ చేసింది. తెలిసినవారి ద్వారా నిర్మాత కానూరి రంజిత్‌కుమార్‌ను కలిశారు కాశీవిశ్వనాథ్‌. ఆ సమయంలో విజయనిర్మల దర్శకత్వంలో ‘లంకెబిందెలు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఆ సినిమాకి అసిస్టెంట్‌గా చేరారు విశ్వనాథ్‌. అతన్ని ఇన్‌స్పైర్‌ చేసిన ‘తొలికోడి కూసింది’ నిర్మాత కూడా రంజిత్‌కుమారే.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసోసియేట్‌గా, కోడైరెక్టర్‌గా 25 సినిమాలకు పనిచేసిన తర్వాత విశ్వనాథ్‌కి డైరెక్షన్‌ చేసే అవకాశం వచ్చింది. ప్రేమించుకుందాం రా, గణేశ్‌, కలిసుందాం రా.. సినిమాలకు అసోసియేట్‌గా చేస్తున్న సమయంలో ఆయనలోని టాలెంట్‌ని గుర్తించిన నిర్మాత సురేష్‌బాబు.. ‘నువ్వులేక నేనులేను’ ద్వారా విశ్వనాథ్‌కు దర్శకుడుగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకి కథ కూడా తనే రాసుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఒక పాట కూడా రాశారు. తరుణ్‌, ఆర్తీ అగర్వాల్‌ జంటగా నటించిన ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడమే కాకుండా, మ్యూజికల్‌గా కూడా పెద్ద విజయం సాధించింది.

ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా వున్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ తొలి సినిమా ‘తొలిచూపులోనే’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఘనత కూడా కాశీవిశ్వనాథ్‌కి దక్కుతుంది. ఉషాకిరణ్‌ మూవీస్‌ బేనర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయినా దర్శకుడిగా కాశీవిశ్వనాథ్‌కి మంచి పేరు వచ్చింది. 2003లో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత మరో 5 సంవత్సరాలపాటు ఆయనకు డైరెక్షన్‌ చేసే అవకాశం రాలేదు. ఆ సమయంలోనే ‘నచ్చావులే’ చిత్రంతో కాశీవిశ్వనాథ్‌ను క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పరిచయం చేశారు డైరెక్టర్‌ రవిబాబు. ఈ సినిమా నటుడిగా విశ్వనాథ్‌కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత రైడ్‌, డార్లింగ్‌, నమో వెంకటేశ, కళవర్‌కింగ్‌.. ఇలా వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తండ్రి, బాబాయ్‌, మావయ్య వంటి క్యారెక్టర్స్‌ ఆయన్ని వరించాయి. దాంతో పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడిపోయారు కాశీవిశ్వనాథ్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోలందరి సినిమాల్లోనూ సహాయ పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు కాశీవిశ్వనాథ్‌.