English | Telugu

ఆ విషయంలో గుమ్మడిని మించిన నటుడు మరొకరు లేరు!

(జూలై 9 గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా..)

గుమ్మడి వెంకటేశ్వరరావు.. ఈ పేరు వినగానే సాత్వికమైన నిలువెత్తు మనిషి మన ఊహల్లోకి వస్తాడు. మంచితనం మూర్తీభవించిన వ్యక్తి మనకు కనిపిస్తాడు. దాదాపు 60 సంవత్సరాల కెరీర్‌లో 500కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గుమ్మడి అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన నటుడు. అక్కినేని నాగేశ్వరరావు 70 సంవత్సరాల సినీ కెరీర్‌ను కొనసాగించారు. ఆయన తర్వాతి స్థానం గుమ్మడికే దక్కుతుంది. తను చేసే ప్రతి పాత్ర ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలని తపించే నటుల్లో గుమ్మడి కూడా ఒకరు. జానపదమైనా, పౌరాణికమైనా, సాంఘికమైనా తను చేసే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాన్ని జనరంజకంగా పోషించడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గుమ్మడి తను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం తన వయసుకి మించిన పాత్రలే పోషించారు. అలా చేసిన వారు తెలుగు చిత్ర పరిశ్రమలో మరొక నటుడు లేడంటే అతిశయోక్తి కాదు. వయసు మీరిన పాత్రల్లో జీవించడం గుమ్మడికి ఎలా సాధ్యమైంది? అసలు ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆయన సినీ ప్రస్థానంలో సాధించిన విజయాలేమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.

1927 జూలై 9న గుంటూరు జిల్లా రావికంపాడు గ్రామంలో బసవయ్య, బుచ్చెమ్మ దంపతులకు జన్మించారు గుమ్మడి వెంకటేశ్వరరావు. వీరి నాన్న, బాబాయ్‌ కలిసే ఉండేవారు. ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతల గురించి చిన్నతనంలో ఆయనకు అవగాహన వచ్చింది. వీరి కుటుంబంలో వయసు మీద పడిన వారు ఎక్కువగా ఉండేవారు. అలా వారి మధ్య పెరగడంతో గుమ్మడికి సాత్విక గుణం బాగా అబ్బింది. వారి కుటుంబ వాతావరణం భవిష్యత్తులో ఆ తరహా పాత్రలు చేయడానికి దోహదపడిరది. హైస్కూల్‌లో చదివే రోజుల్లోనే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు గుమ్మడి. కాలేజీలో చేరితే అలాంటి భావాలు మరింత పెరుగుతాయని గ్రహించిన కుటుంబ సభ్యులు 17 ఏళ్ళ వయసులోనే లక్ష్మీ సరస్వతితో వివాహం చేశారు. అయితే చదువు మాత్రం సజావుగా సాగలేదు. ఇంటర్‌ పరీక్ష తప్పారు. దాంతో గుమ్మడిని వ్యవసాయంలోకి దించారు.

ఆ సమయంలోనే గుమ్మడి మనసు నటన వైపు మళ్లింది. అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంది. సినిమాల్లో అయితే బాగా రాణిస్తావని మిత్రులు చెప్పడంతో మద్రాస్‌ చేరుకొని సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నో అవరోధాల తర్వాత అదృష్టదీపుడు అనే చిత్రంలో తొలిసారి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా గుమ్మడికి మంచి పేరు వచ్చింది. ఆ సమయంలోనే ఎన్‌.టి.రామారావుతో పరిచయం ఏర్పడిరది. ఎన్నో సాయంత్రాలు ఇద్దరూ బీచ్‌లో తిరుగుతూ కాలక్షేపం చేసేవారు. అదృష్టదీపుడు తర్వాత గుమ్మడికి మరో అవకాశం రాలేదు. దీంతో తిరిగి ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌తో చెప్పారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. త్వరలోనే తాను సినిమా నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నానని, తమ సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారు. ఎన్‌.ఎ.టి. పేరుతో సంస్థను ప్రారంభించారు. తొలి సినిమాగా పిచ్చిపులయ్య నిర్మించారు. ఈ సినిమాలో గుమ్మడికి మంచి వేషం ఇచ్చారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత ఆ బేనర్‌లో వచ్చిన తోడుదొంగలు, జయసింహ చిత్రాల్లో గుమ్మడి కీలక పాత్రలు పోషించారు. ఈ మూడు సినిమాలతో గుమ్మడి నటుడిగా నిలదొక్కుకోగలిగారు.

తోడుదొంగలు చిత్రంలో వయసు మీరిన పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు గుమ్మడి. ఆ సినిమా చూసిన దర్శకుడు పి.పుల్లయ్య తను రూపొందిస్తున్న అర్థాంగి చిత్రంలో ఎఎన్నార్‌, జగ్గయ్యలకు తండ్రిగా నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో చేసిన పాత్ర ఇంకా పేరు తెచ్చింది. దాంతో వయసు మీరిన పాత్రలు ఉంటే దర్శకనిర్మాతలంతా గుమ్మడినే సంప్రదించేవారు. అలా ఆ పాత్రలు చేయడం తనకు మాత్రమే సాధ్యమని నిరూపించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ నటుడికీ ఆ అవకాశం రాలేదు. తనకంటే వయసులో పెద్దవారికి తండ్రిగా, అన్నయ్యగా, బాబాయ్‌గా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం అవే ఉంటాయి. సాత్విక పాత్రల్లోనే కాదు, తేనె పూసిన కత్తిలాంటి విలన్‌ పాత్రలతో కూడా మెప్పించారు గుమ్మడి.

చిత్ర పరిశ్రమలోని అందరికీ గుమ్మడి అంటే ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఆయన్ని మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ వచ్చారు. తమ సొంత బేనర్‌లో నిర్మించిన సినిమాలతోపాటు ఇతర సినిమాల్లో కూడా మంచి పాత్రలు ఇప్పించారు. గుమ్మడికి నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణదేవరాయలుగా, గుమ్మడి తిమ్మరుసుగా నటించారు. అయినప్పటికీ సినిమా టైటిల్‌ను మహామంత్రి తిమ్మరుసు అని పెట్టడం విశేషం. గుమ్మడి చేసిన ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉండేది. సినిమాల్లో ఆ పాత్రలు కనిపిస్తాయి తప్ప గుమ్మడి కనిపించరు. అంతగా ఆ పాత్రల్లో జీవించి అందర్నీ ఆకట్టుకునేవారు.

2008లో వచ్చిన జగద్గురు శ్రీకాశీనాయని చరిత్ర.. గుమ్మడి నటించిన చివరి చిత్రం. తన జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ ‘చేదు గుర్తులు.. తీపి జ్ఞాపకాలు’ అనే పుస్తకాన్ని రచించారు. సినీ పరిశ్రమకు గుమ్మడి చేసిన సేవలకుగాను 1970లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 1998లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది. మాయా బజార్‌ చిత్రాన్ని రంగుల్లోకి మార్చి ప్రదర్శించినపుడు ప్రజల మధ్య ఆ సినిమాను వీక్షించారు. అదే ఆయన చూసిన చివరి సినిమా. ‘ఇంత గొప్ప సినిమాను రంగుల్లో చూసేందుకే నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి ఉన్నాను’ అన్నారు. గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఆరోగ్యం సహకరించకపోవడంతో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. 2010 జనవరి 26న హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు గుమ్మడి. భౌతికంగా ఆయన లేకపోయినా తను చేసిన సినిమాల ద్వారా ప్రతిరోజూ ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటారు.