English | Telugu
పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేసేందుకు చిరంజీవి ఏం చేశారో తెలుసా!
Updated : Jun 29, 2024
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు ఎందరికో స్ఫూర్తి. ఈయన సినిమా ప్రయాణం ఎంతో మంది కొత్త హీరోలకు ఆదర్శం. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం స్వయంకృషితోనే అంచెలంచెలుగా ఎదిగి అభిమానుల చేత మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి తమ్ముడు ఇప్పుడు పవర్‌స్టార్‌గా అభిమాన గణాన్ని గణనీయంగా పెంచుకోవడానికి ముఖ్య కారణం మెగాస్టార్ వేసిన గట్టి పునాది. తన సోదరుడ్ని హీరోగా పరిచయం చెయ్యాలన్న ఆలోచన వచ్చిన తర్వాత ఒక పర్‌ఫెక్ట్ లాంచ్ కోసం మెగాస్టార్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. పవన్‌కళ్యాణ్ చేసే మొదటి సినిమా మామూలుగా ఉండకూడదు అనుకున్నారు. అందుకే ఎంతో మంది డైరెక్టర్లను పరిశీలించిన తర్వాత ఆ బాధ్యతను ఇ.వి.వి.సత్యనారాయణకు అప్పగించారు.
బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్, జుహీచావ్లా జంటగా రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ చిత్రాన్ని తెలుగులో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పేరుతో రీమేక్ చెయ్యడం ద్వారా పవన్‌ను హీరోగా లాంచ్ చేసేందుకు నిర్ణయించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. పవన్ ఎంట్రీ మామూలుగా ఉండకూడదనుకున్న చిరంజీవి ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీని కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఫోటోతో ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసి ‘ఈ అబ్బాయి ఎవరు?’ అంటూ అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. మరికొన్ని రోజులకు ‘ఎస్..ఈ అబ్బాయే కళ్యాణ్’ అంటూ రివీల్ చేశారు. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియను ఎంపిక చేశారు. ఇద్దరు ప్రముఖ హీరోల వారసులు ఈ సినిమా ద్వారా పరిచయం కావడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత జరిగిన ఒక భారీ ఈవెంట్‌లో ‘ఇతను నా తమ్ముడు పవన్‌కళ్యాణ్’ అంటూ వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు పరిచయం చేశారు చిరంజీవి. తొలి సినిమాతోనే తనేమిటో ప్రూవ్ చేసుకున్నారు పవన్. ఈ సినిమాలో అతను చేసిన సాహసాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. పవన్ చేతుల మీద నుంచి కార్లు వెళ్ళడం, అతని ఛాతిపై బండరాళ్ళు ఉంచి వాటిని సుత్తితో పగలగొట్టడం వంటి విన్యాసాల గురించి అప్పట్లో విపరీతంగా చర్చించుకున్నారు. పవన్ చేసిన ఈ ఎడ్వంచర్స్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఈ సన్నివేశాలు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న హీరోయిన్ సుప్రియ అది చూసి కన్నీళ్ళు పెట్టుకుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఈ సినిమా ద్వారా పరిచయమైన సుప్రియకు హీరోయిన్‌గా ఇదే మొదటి సినిమా, చివరి సినిమా కూడా ఇదే. చాలా సంవత్సరాల తర్వాత ఆమధ్య వచ్చిన ‘గూఢచారి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు సుప్రియ.
1996 అక్టోబర్ 11న విడుదలైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మంచి విజయాన్ని అందుకుంది. 32 కేంద్రాల్లో 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై హీరోగా పవన్‌కి పర్‌ఫెక్ట్ లాంచ్ అయింది. అయితే ఈ సినిమాకి పవన్‌కళ్యాణ్ అందుకున్న పారితోషికం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. షూటింగ్ జరిగినన్ని రోజులు పవన్‌కు నెలకి రూ.5 వేలు చొప్పున ఇచ్చారు నిర్మాత అల్లు అరవింద్. ఈ సినిమా విడుదలై దాదాపు 30 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పుడు పవర్‌స్టార్‌గా పవన్‌కళ్యాణ్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. పవన్‌తో సినిమా చెయ్యాలంటే నిర్మాత అతనికి ఎంత ముట్టజెప్పాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతో సక్సెస్‌ఫుల్ హీరో అనిపించుకున్న పవన్ ఆ తర్వాత తను చేసే సినిమాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత కొన్ని బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో పవర్‌స్టార్‌గా ఎదిగారు.