Read more!

English | Telugu

నిన్ను చంపడమే నా జీవిత లక్ష్యం.. సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ బెదిరింపు!

బాలీవుడ్‌లోని ఎంతో మంది తారలకు మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే కొంతమందికి ఎన్నో విషయాల్లో బెదింపులు రావడం, కొంతమందిపై దాడి చేయడం, మరికొందరిని హత్య చేయడం వంటి ఘటనలు బాలీవుడ్‌లో జరిగాయి. కొంతమంది తారలకు మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు కూడా గతంలో వెల్లడైంది. అంతేకాదు అక్కడి హీరోల భవిత్యవం కూడా మాఫియా చేతుల్లోనే ఉంటుందనే విషయం కూడా చాలా సార్లు ప్రస్తావనకు వచ్చింది. బాలీవుడ్‌ హీరో లేదా హీరోయిన్‌ ఏ సినిమా చెయ్యాలి, వారికి ఎంత రెమ్యునరేషన్‌ ఇవ్వాలి అనే విషయాల్లో మాఫియా జోక్యం ఉంటుందని గతంలో విన్నాం. ఇవే కాదు, సినిమా నిర్మాణానికి సంబంధించి ఎన్నో అంశాలపై మాఫియా ఆధిపత్యం ఉంటుందనే వాదన ఉంది. 

ఈమధ్యకాలంలో బాలీవుడ్‌పై మాఫియా ఆగడాలు చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. అయితే ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌కి సంబంధించిన వార్త మీడియాని, సోషల్‌ మీడియాని, దేశంలోని వివిధ వర్గాల వారిని కుదిపేస్తోంది. అదేమిటంటే... గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌కి శత్రువుగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సల్మాన్‌ని చంపేస్తామంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ బృందం బెదిరింపులకు పాల్పడిరది. దీన్ని ముంబై పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కానీ, బిష్ణోయ్‌ నుంచి బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఎంతో సీరియస్‌గా సల్మాన్‌కు బెదింపులు అందాయి. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ వర్గాలు షాక్‌ అయ్యాయి. 

పంజాబీ గాయకులు గిప్పీ గ్రేవాల్‌ కెనడాలోని వాంకోవర్‌లోని వైట్‌రాక్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. శనివారం ఆయన ఇంటి బయట తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయన్న వార్తలు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ఈ నేరపూరిత చర్యకు బాధ్యత వహించాడు. తుపాకీ కాల్పులకు సంబంధించి తన పాత్రను వెల్లడిస్తూ ఫేస్‌బుక్లఓ ఒక మెసేజ్‌ను పోస్ట్‌ చేశాడు. ‘‘మీరు సల్మాన్‌ఖాన్‌ను సోదరుడిగా భావిస్తారు. కానీ, ఇప్పుడు మీ సోదరుడు వచ్చి మిమ్మల్ని రక్షించే సమయం వచ్చింది. ఈ సందేశం కూడా సల్మాన్‌ ఖాన్‌ కోసమే. దావూద్‌ మిమ్మల్ని రక్షిస్తాడనే భ్రమలో ఉండకండి. నిన్ను ఎవరూ రక్షించలేరు. సిద్ధూ మూస్‌ వాలా మరణంపై మీ నాటకీయ స్పందన గుర్తించబడలేదు. అతడు ఎలాంటి వ్యక్తి.. అతడికి ఉన్న నేర సంఘాలు ఎలాంటివో మనందరికీ తెలుసు. విక్కీ మిద్దుఖేడాలో ఉన్నప్పుడు మీరు అతని చుట్టూ తిరిగారు. తర్వాత మీరు సిద్ధూ కోసం మరింతగా రోదించారు. మీరు ఇప్పుడు మా రాడార్‌పైకి వచ్చారు. దీనిని ట్రైలర్‌గా పరిగణించండి. పూర్తి సినిమా త్వరలో విడుదల కానుంది. మీరు కోరుకున్న ఏ దేశానికైనా పారిపోండి. కానీ గుర్తుంచుకోండి, మరణానికి వీసా అవసరం లేదు. ఇది ఆహ్వానం లేకుండా వస్తుంది’’ తన మెసేజ్‌లో పేర్కొన్నాడు బిష్ణోయ్‌. దీంతో గిప్పీ గ్రెవాల్‌, అతడి కుటుంబ భద్రత కోసం ఆందోళనలు లేవనెత్తారు. అయితే ఈ విషయంపై గిప్పీ గ్రేవాల్‌ ఇంకా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ని కూడా చంపేస్తానని బిష్ణోయ్‌ బెదిరించాడు. అతని హత్య చేయడమే తన జీవిత లక్ష్యం అని అన్నాడు. కృష్ణజింకను చంపడం ద్వారా ఖాన్‌ తన వర్గాన్ని అవమానించాడని ఆమధ్య ప్రకటించిన కొద్దిరోజులకే సల్మాన్‌ను ఇలా బెదిరించాడు. అంతేకాదు తమకు చెందిన డైటీ ఆలయాన్ని సందర్శించి, కృష్ణ జింకలపై తన చర్యకు క్షమాపణ చెప్పాలని సల్మాన్‌ని కోరాడు బిష్ణోయ్‌.

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా అద్భుతమైన కెరీర్‌ను కొనసాగించాడు. 9 ఏళ్లపాటు బాలీవుడ్‌లో టాప్‌ కలెక్షన్స్‌ సాధించిన సినిమాలను అందంచిన ఏకైక హీరో సల్మాన్‌. వ్యక్తిగత జీవితానికి వస్తే బీయింగ్‌ హ్యూమన్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ మంచి దాతగా పేరు తెచ్చుకున్నాడు. మరో వైపు అతని జీవితంలో వివాదాలకు కొదవ లేదు. ఐశ్వర్యరాయ్‌తో ప్రేమకథను నడపడం ద్వారా కొన్ని వివాదాలు నెత్తిన వేసుకున్నాడు. అంతేకాదు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిపై కారును ఎక్కించడంతో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. అలాగే అరుదైన జంతువు కృష్ణజింకను వేటాడిన కేసులో కూడా సల్మాన్‌ నిందితుడు. వీటిపై విచారణ జరిపిన కోర్టు అతనికి ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది. ఆ తర్వాత కొన్నిరోజులకు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు.