English | Telugu
11వ రోజు కూడా 'కశ్మీర్ ఫైల్స్' హవా తగ్గలేదుగా!
Updated : Mar 22, 2022
వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన హిందీ చిత్రం 'ద కశ్మీర్ ఫైల్స్' కలెక్షన్ల ప్రభంజనం యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. జీ స్టూడియోస్‌తో కలిసి, తెలుగు సినిమాల నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ మూవీ రెండో సోమవారం సైతం డబుల్ డిజిట్‌లో కోట్ల రూపాయలను రాబట్టింది. కరోనా అనంతరం కాలంలో సూపర్ హిట్టయిన అక్షయ్ కుమార్ మూవీ 'సూర్యవంశీ' రెండో సోమవారం కలెక్షన్లను మించిన 'ద కశ్మీర్ ఫైల్స్' వసూళ్లను సాధించడం విశేషం. ఈ సినిమాకు సోమవారం 11వ రోజు రూ. 12.40 కోట్ల (నెట్)ను రాబట్టింది.
రెండో వారంలో శుక్రవారం రూ. 19.15 కోట్లు, శనివారం రూ. 24.80 కోట్లు, ఆదివారం రూ. 26.20 కోట్లు, సోమవారం రూ. 12.40 కోట్లను వసూలు చేసిన 'ద కశ్మీర్ ఫైల్స్' ఇప్పటివరకూ బాక్సాఫీస్ దగ్గర దేశవ్యాప్తంగా రూ. 179.85 కోట్లను కొల్లగొట్టింది.
మార్చి 25న రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' విడుదలవుతుండటంతో 'ద కశ్మీర్ ఫైల్స్' ప్రభంజనం ఆ ముందురోజు వరకే పరిమితమవుతుందా, 'ఆర్ఆర్ఆర్'ను కూడా తట్టుకొని ముందుకు దూసుకుపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్షన్ ఏకంగా 3400 స్క్రీన్లలో రిలీజవుతుండటం గమనార్హం.