English | Telugu
'ద ఫ్యామిలీ మ్యాన్ 2' చూస్తే తమిళులు గర్వపడతారు!
Updated : May 26, 2021
అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో రిలీజవుతున్న 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ చూసి తమిళులు గర్వపడతారని ఆ సిరీస్‌లో హీరోగా నటించిన మనోజ్ బాజ్‌పేయి చెప్పారు. ఆ షోను బ్యాన్ చెయ్యాలని కొన్ని తమిళ సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర సమాచార-ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు పలువురు తమిళ నాయకులు లేఖలు రాశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో శ్రీలంక తమిళులను ఆ షో తప్పుగా, టెర్రరిస్టులుగా చూపించదని ఆరోపిస్తూ, తమిళులు దాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదంపై తొలిసారి స్పందించిన మనోజ్ బాజ్‌పేయ్ మాట్లాడుతూ, ఈ వెబ్ సిరీస్ యూనిట్ మెంబర్స్‌లో పలువురు తమిళులేననీ, తమిళ సంస్కృతి, వారి మనోభావాలను గౌరవించేలా ఈ సిరీస్‌లో వారిని చూపించారనీ తెలిపారు. "డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే, సమంత, ప్రియమణి, రైటర్ సుమన్ ఆ ప్రాంతానికి చెందిన వారే. తమిళ ప్రజల, స్నేహితుల, వీక్షకుల అభిరుచులను పరిరక్షించడానికి వీళ్లకంటే ఉత్తమమైన వాళ్లెవరు? ఎవరైనా వారికంటే బెటర్ అని నేను అనుకోను. తమిళ సంస్కృతి, మనోభావాలపై తమకున్న గౌరవాన్ని చూపించడానికి తమకు సాధ్యమైన ప్రతిదాన్నీ వారు చేశారు." అని ఆయన చెప్పారు.
ఈ సిరీస్‌లో శ్రీలంక తమిళురాలిగా, ఒక టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యురాలిగా సమంత అక్కినేని కనిపించనున్నది. మనోజ్ బాజ్‌పేయి టైటిల్ రోల్ పోషించగా, ఆయన భార్యగా ప్రియమణి నటించింది. జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' విడుదలవుతోంది.