Read more!

English | Telugu

'సుత్లియాన్' సిరీస్ రివ్యూ.. త‌ల్లి క్యారెక్ట‌ర్‌ని అనుమానించి నిఘా పెట్టిన కూతురు!

 

సిరీస్ పేరు: సుత్లియాన్‌
తారాగ‌ణం: ఆయేషా ర‌జా మిశ్రా, వివాన్ షా, శివ్ పండిట్‌, ప్ల‌బితా బోర్త‌కుర్‌, పూజా కందారే, సునీల్ సిన్హా, నిహారిక లైరా ద‌త్‌, దిశా అరోరా, వివేక్ ముష్రాన్‌, నిఖిల్ నాగ్‌పాల్‌, ఇనాయ‌త్ సూద్‌
డైరెక్ట‌ర్: స్మాల్ టౌన్ ఫిలిమ్స్‌
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ5

ప‌లుచ‌న‌వుతున్న కుటుంబ బంధాల‌కు, 'అన్ని బంధాల‌కూ ఆర్థిక సంబంధాలే మూలం' అనే నానుడికి అద్దం ప‌ట్టే క‌థ‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఇటీవ‌ల స్ట్రీమింగ్‌లోకి వ‌చ్చిన సిరీస్ 'సుత్లియాన్‌'. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ చూస్తుంటే, మ‌న ఇంట్లోనో, మ‌న ప‌క్కింటి ఇంట్లోనో ఈ క‌థ జ‌రుగుతున్న‌ట్లు ఫీల‌వుతాం. అనేక స‌న్నివేశాల‌తో క‌నెక్ట్ అవుతాం. ఏదో ఒక క్యారెక్ట‌ర్‌తో ఎక్క‌డో చోట రిలేట్ అవుతాం.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ నేప‌థ్యంలో, సుప్రియా చండేల్ (ఆయేషా ర‌జా మిశ్రా) అనే వితంతువు, ఎదిగిన ఆమె ముగ్గురు పిల్ల‌లు.. రాజ‌న్ (శివ్ పండిట్‌), ర‌మ‌ణి (ప్ల‌బితా బోర్త‌కుర్‌), ర‌మ‌ణ్ (వివాన్ షా) చుట్టూ సుత్లియాన్ క‌థ న‌డుస్తుంది. కొవిడ్ టైమ్‌లో సుప్రియ భ‌ర్త చ‌నిపోతే, వేర్వేరు ప్రాంతాల్లో ఉండే ముగ్గురు పిల్ల‌లు అంత్య‌క్రియ‌ల‌కు రాలేక‌పోతారు. దాంతో ద‌గ్గ‌ర‌లోని ప‌రిచ‌య‌స్తుల సాయంతో త‌నే అంత్య‌క్రియ‌లు ఆమె పూర్తి చేస్తుంద‌ని క‌థా గ‌మ‌నంలో మ‌న‌కు తెలుస్తుంది. ఆ త‌ర్వాత ఒక‌ దీపావ‌ళి పండ‌గ‌కు రాజ‌న్‌, ర‌మ‌ణి, ర‌మ‌ణ్ అమ్మ ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. త‌ల్లి ప్ర‌వ‌ర్త‌న వారికి వింత‌గా తోస్తుంటుంది. 

ఏవో వ్యాపారాల కార‌ణంగా ఆర్థిక‌ ఇబ్బందుల్లో ఉండే రాజ‌న్ త‌న త‌ల్లికీ, తోబుట్టువుల‌కూ తెలీకుండా త‌మ భూమిని అమ్మ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే, గంజాయికి బానిస అయిన ర‌మ‌ణ్‌, ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండ‌టానికి నానా తంటాలు ప‌డుతుంటాడు. ఇక ర‌మ‌ణి అయితే త‌మ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన‌ త్రిలోక్ (సునీల్ సిన్హా) అనే కిరాణా షాపు ఓన‌ర్‌తో త‌ల్లి స‌న్నిహితంగా మెల‌గ‌డం చూసి, ఆమెని అనుమానిస్తుంది. అంత‌టితో ఆగ‌కుంటా త‌నంటే ఇష్ట‌ప‌డే స‌మీర్ (నిఖిల్ నాగ్‌పాల్‌)తో క‌లిసి త‌ల్లిమీదే నిఘా పెడుతుంది. ర‌మ‌ణి ప్రేమ‌ను పొందాల‌ని స‌మీర్ ప్ర‌య‌త్నిస్తుంటే, అత‌నిపై ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా త‌న ప‌నుల కోసం వాడుకుంటూ ఉంటుంది ర‌మ‌ణి.

ఈ ముగ్గురు తోబ‌ట్టువులు కూడా ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ ఉన్న‌ట్లు పైకి క‌నిపిస్తుంటారు కానీ, ఒకరిపై మ‌రొక‌రికి అనుమానాలు ఉంటుంటాయి. త‌ల్లి సుప్రియ మాత్రం భ‌ర్త పోయాక పిల్ల‌ల మీద ఆధార‌ప‌డ‌కుండా సొంత కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని దారాల‌తో డెక‌రేటివ్ ఐట‌మ్స్‌ను త‌యారుచేసే వ్యాపారం ప్రారంభించాల‌ని అనుకుంటుంది. క‌థ న‌డిచేకొద్దీ ఇంట్రెస్టింగ్‌ స‌న్నివేశాల‌తో నెక్ట్స్ ఎపిసోడ్ చూడాల‌నిస్తుంది. 

సుప్రియ‌గా ఆయేషా ర‌జా న‌ట‌న టాప్ క్లాస్‌లో ఉంది. ఆ క్యారెక్ట‌ర్‌లోని భిన్న ఎమోష‌న్స్‌ను ఆమె గొప్ప‌గా ప్ర‌ద‌ర్శించింది. ముంబై మేరీ జాన్‌, దిల్ ధ‌డ‌క్‌నే దో, బేఫిక‌ర్‌, టాయిలెట్‌, సోను కే టిటు కీ స్వీటీ, వీరే డీ వెడ్డింగ్‌, గుంజ‌న్ స‌క్సేనా లాంటి సినిమాలతో పాపుల‌ర్ అయిన ఆమె ఈ సిరీస్‌లోని మెయిల్ రోల్‌ను ఈజీగా చేసుకుపోయింది. 'బ్రీత్‌', 'బాంగే బేగ‌మ్స్' సిరీస్‌తో ఇప్ప‌టికే ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్ల‌బిత బోర్త‌కుర్ త‌ల్లిని అనుమానించే కూతురు ర‌మ‌ణి క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయింది. రమ‌ణ్‌గా వివాన్ షా (న‌సీరుద్దీన్ షా కొడుకు) నేచుర‌ల్‌ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. రాజ‌న్‌గా శివ్ పండిట్ రాణించాడు. మిగ‌తా పాత్ర‌ధారులంతా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు. కొన్ని చోట్ల లాగింగ్ అనిపించ‌డం మిన‌హా సుదీప్ నిగ‌మ్‌, అభిషేక్ చ‌ట‌ర్జీ స్క్రిప్టు స‌మ‌కూర్చిన‌ సుత్లియాన్ బాగానే ఆక‌ట్టుకుంటుంది.