English | Telugu

ప‌ఠాన్‌ని అపురూపంగా భావిస్తున్నానంటున్న సిద్ధార్థ్‌

ప‌ఠాన్ సినిమా నా దృష్టిలో అత్యంత అపురూప‌మైన స‌బ్జెక్ట్ అని అన్నారు సిద్ధార్థ్ ఆనంద్‌. షారుఖ్‌ఖాన్‌, దీపిక ప‌దుకోన్‌, జాన్ అబ్ర‌హామ్ న‌టించిన ప‌ఠాన్ సినిమాను య‌ష్ రాజ్ ఫిల్మ్స్ తెర‌కెక్కించారు. అత్య‌ద్భుత‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో, గ్లామ‌ర్ ట‌చ్‌తో, ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో రేసీగా సాగింది ప‌ఠాన్‌. అందుకే ఇప్పుడు హిందీలో నెంబ‌ర్ వ‌న్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఇప్ప‌టిదాకా ఆ స్థానంలో ఉన్న బాహుబ‌లి2ని క్రాస్ చేసింది ప‌ఠాన్‌. సినిమా విడుద‌లైన వారానికే క‌నుమ‌రుగైపోతున్న ఈ రోజుల్లో ఆరో వారం, ఇంత‌టి అరుదైన రికార్డును అందుకుంది ప‌ఠాన్‌. ఓవ‌ర్సీస్‌లో 47.04 మిలియ‌న్ల‌తో రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలో 529.96 కోట్లు క‌లెక్ట్ చేసింది. దీంతో ప‌ఠాన్ ఓవ‌రాల్ క‌లెక్ష‌న్లు 1028 కోట్ల‌కు చేరుకున్నాయి.

సిద్ధార్థ్ మాట్లాడుతూ ``నా జీవితంలో అపురూప‌మైన క్ష‌ణాల‌వి. ప‌ఠాన్ హిందీలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ప‌ఠాన్‌కి వ‌స్తున్న ప్రేమ, ప్ర‌శంస‌లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ద‌ర్శ‌కుడిగా అత్యంత ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌ను మెప్పించాన‌నే ఆలోచ‌న క‌లుగుతుంటేనే చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు. బాయ్‌కాట్ గురించి మాట్లాడుతూ ``హిందీ ప‌రిశ్ర‌మ‌ను దూషించేవాళ్లు ఆ మ‌ధ్య ఎక్కువ‌గా క‌నిపించారు. మ‌మ్మ‌ల్ని ప్ర‌జ‌లు బాయ్‌కాట్ చేస్తామ‌న్నారు. సినిమాలో ఏం ఉండాలో, ఏం ఉండ‌కూడ‌దోన‌ని ప్ర‌తిక్ష‌ణం భ‌య‌ప‌డేలా మాట్లాడారు. కానీ మేం ధైర్యంగా అడుగు ముందుకేశాం. సినిమా బావుంటే ప్రేక్ష‌కులు నెత్తిన‌పెట్టుకుని చూసుకుంటార‌ని మ‌రోసారి ప్రూవ్ అయింది`` అని అన్నారు. యాక్ష‌న్ సినిమాలు తీయ‌డంలో సిద్ధార్థ్‌కి సాటి ఆయ‌నేనని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

``మంచి సినిమా చేయాల‌న్న సంక‌ల్పంతోనే ప‌ఠాన్‌ని మొద‌లుపెట్టాను. మేం మాట్లాడ‌కూడ‌దు, కేవ‌లం మా ప‌ని మాత్ర‌మే మాట్లాడాల‌న్న‌ది నాలో ఎప్ప‌టి నుంచో ఉన్న ఆలోచ‌న‌. దాన్నే ఫాలో అయ్యాను. ఇప్పుడు ఇంత పెద్ద స‌క్సెస్‌ని నాకు అందించారు. హిందీ సినిమా ఇండ‌స్ట్రీకి నేను ప‌ఠాన్‌తో రుణం తీర్చుకున్నాన‌నే భావిస్తున్నాను. హిందీ ఇండ‌స్ట్రీ నాకు చాలా నేర్పింది. చాలా గౌర‌వంగా చూసింది. న‌న్ను చాలా ప్రేమ‌గా ఆద‌రించింది. అందుకే త‌ల్లికి నా వంతుగా చేశాన‌నే తృప్తితో ఉన్నాను`` అని అన్నారు సిద్ధార్థ్‌