English | Telugu
జూలై - సెప్టెంబర్ః షారూక్ `అతిథి` మంత్రం!
Updated : Jun 10, 2022
బాలీవుడ్ టాప్ స్టార్ షారూక్ ఖాన్ వెండితెరపై సందడి చేసి మూడేళ్ళు దాటింది. 2018 క్రిస్మస్ కి జనం ముందు నిలిచిన `జీరో`తో చివరసారిగా సిల్వర్ స్క్రీన్ పై అలరించారు షారూక్. కట్ చేస్తే.. వచ్చే ఏడాది (2023) ముచ్చటగా మూడు చిత్రాల్లో కథానాయకుడిగా పలకరించబోతున్నారు. జనవరిలో `పఠాన్`, జూన్ లో `జవాన్`, డిసెంబర్ లో `డంకీ`తో షారూక్ ఖాన్ ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ చిత్ర త్రయాలపై షారూక్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, 2023 హ్యాట్రిక్ ప్రయత్నాల కంటే ముందే ఈ క్యాలెండర్ ఇయర్ లో మూడు సినిమాల్లో అతిథిగా పలకరించబోతున్నారు మిస్టర్ ఖాన్. విశేషమేమిటంటే.. సదరు మూడు చిత్రాలు కూడా వరుస నెలల్లో జనం ముందుకు రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. జూలై 1న ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన `రాకెట్రీః ద నంబి ఎఫెక్ట్` (మాధవన్, సిమ్రన్) రిలీజ్ కానుండగా.. ఆగస్టు 11న అద్వైత్ చందన్ రూపొందించిన `లాల్ సింగ్ చద్ధా` (ఆమిర్ ఖాన్, కరీనా కపూర్) విడుదల కానుంది. ఇక సెప్టెంబర్ 9న అయన్ ముఖర్జీ డైరెక్టోరియల్ `బ్రహ్మాస్త్ర` (రణ్ బీర్ కపూర్, ఆలియా భట్) వినోదాలు పంచనుంది. మరి.. జూలై నుంచి సెప్టెంబర్ వరకు నెలకో చిత్రంలో గెస్ట్ గా ఎంటర్టైన్ చేయనున్న షారూక్.. ఆయా సినిమాలకు ఏ మేరకు ప్లస్ అవుతారో చూడాలి.