English | Telugu

విష్ణు డైర‌క్ష‌న్‌లో స‌ల్మాన్‌... క్రిస్‌మ‌స్‌కి ప్లాన్ చేసిన క‌ర‌ణ్‌!

కుచ్ కుచ్ హోతా హై సినిమా చూసిన వారికి, స‌ల్మాన్ గెస్ట్ అప్పియ‌రెన్స్ గుర్తుందా? 1998లో రిలీజ్ అయిన సినిమా ఇది. ఈ సినిమాలో షారుఖ్‌, కాజోల్‌, రాణీ ముఖ‌ర్జీ న‌టించారు. ఈ సినిమాకు క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అది జ‌రిగి పాతికేళ్ల‌యింది. పాతికేళ్లుగా వాళ్లిద్ద‌రూ క‌లిసి సినిమా చేయాల‌ని క‌ల‌లు కంటూనే ఉన్నారు. అయితే ఇప్ప‌టికి కూడా మెటీరియ‌లైజ్ కాలేదు. ఇన్నేళ్ల త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి ప‌నిచేసే టైమ్ వ‌చ్చింది. క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌లో ఓ సినిమా చేయ‌డానికి స‌ల్మాన్ ఓకే చెప్పారు. ఈ సినిమాకు విష్ణు వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ``స‌ల్మాన్ ఖాన్‌, క‌ర‌ణ్ జోహార్‌, విష్ణువ‌ర్ధ‌న్ క‌లిసి చేస్తున్న ఈ సినిమా మాసివ్ యాక్ష‌న్ సినిమా. గ‌త ఆరు నెల‌లుగా ఈ సినిమాకు సంబంధించిన డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. స‌ల్మాన్ ఇప్పుడు టైగ‌ర్‌3తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా త‌ర్వాత ఈ సినిమాలోనే న‌టిస్తారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ నుంచి షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఏడెనిమిది నెల‌ల్లో అన్నీ షెడ్యూల్స్ పూర్త‌వుతాయి`` అని డీటైల్స్ లీక్ చేశారు ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌న్నిహితులు.

``ఇది అంద‌రికీ చాలా స్పెష‌ల్ ప్రాజెక్ట్. షేర్షా త‌ర్వాత హిందీలో విష్ణువ‌ర్ధ‌న్ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని త్వ‌ర‌లోనే మొద‌లుపెడ‌తారు. నెవ‌ర్ బిఫోర్ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు`` అని అంటోంది ముంబై మీడియా. ఈ సినిమాను వ‌చ్చే క్రిస్‌మ‌స్‌కి విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఈ సినిమాలో స‌ల్మాన్ స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తారు. త‌న సినిమాల్లో హీరోలు స్టైలిష్‌గా ఉండేలా ప్రెజెంట్ చేస్తారు విష్ణువ‌ర్ద‌న్‌. ఆ మేర‌కే ఆయ‌న ఆల్రెడీ స‌ల్మాన్‌కి కొన్ని సూచ‌న‌లు ఇచ్చార‌ట‌. ఇప్పుడు భాయీజాన్ వాటిని పాటించే ప‌నుల్లో ఉన్నారు. త్వ‌ర‌లోనే స‌ల్లూభాయ్ స‌రికొత్త లుక్ ఆడియ‌న్స్ కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నుంది. మ‌రీ ముఖ్యంగా ఈ సినిమాలో ఆయ‌న ఫిజిక‌ల్ యాక్టివిటీస్, బాడీ లాంగ్వేజ్ స‌రికొత్త‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. దానికి స‌ల్మాన్ ట్రైనింగ్ కూడా తీసుకుంటార‌ని టాక్‌. ఈ దీపావ‌ళికి స‌ల్మాన్ న‌టిస్తున్న టైగ‌ర్‌3 విడుద‌ల కానుంది. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ తెర‌కెక్కిస్తున్న స్పై సినిమా ఇది.