Read more!

English | Telugu

'రుద్ర' సిరీస్ రివ్యూ.. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ను ఆడుకున్న రాశీ ఖ‌న్నా!

 

సిరిస్ పేరు: రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌
తారాగ‌ణం: అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, రాశీ ఖ‌న్నా, ఇషా డియోల్‌, అతుల్ కుల‌క‌ర్ణి, అశ్వినీ క‌ల్సేక‌ర్‌, త‌రుణ్ గెహ్లాట్‌, ఆశిష్ విద్యార్థి, మిళింద్ గునాజీ, కె.సి. శంక‌ర్‌
ద‌ర్శ‌క‌త్వం: రాజేశ్ మ‌పుస్కార్‌
నిర్మాత: స‌మీర్ నాయ‌ర్‌
బ్యాన‌ర్: అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ఓటీటీ ప్లాట్‌ఫామ్: డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'లూథ‌ర్' గురించి ఓటీటీ వీక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సైక‌లాజిక‌ల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ సిరీస్ ఆధారంగా వ‌చ్చిన ఇండియ‌న్ సిరీస్ 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌'. ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ చుట్టూ న‌డిచే ఈ సిరీస్‌లో డీసీపీ రుద్ర‌వీర్ సింగ్ అలియాస్ రుద్ర‌గా టైటిల్ రోల్ పోషించిన ఈ సిరీస్‌ను రాజేశ్ మ‌పుస్కార్ డైరెక్ట్ చేశాడు. 'ఫెరారీ కీ స‌వారీ', 'వెంటిలేట‌ర్' లాంటి క్రిటిక‌ల్లీ ఎక్లైమ్డ్ సినిమాల‌తో అత‌ను పేరు తెచ్చుకున్నాడు.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో మార్చి 4న 'రుద్ర' స్ట్రీమింగ్‌లోకి వ‌చ్చింది. ఆరు ఎపిసోడ్ల సీజ‌న్ 1లో రుద్ర చేప‌ట్టే కేసులు ఎంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతాయో, వ్య‌క్తిగ‌త జీవితంలో అత‌ను ఎదుర్కొనే ఘ‌ట‌న‌లు కూడా అంత ఎమోష‌న‌ల్‌గా ఆక‌ట్టుకుంటాయి. ఈ సిరీస్‌లో బాగా ఆశ్చ‌ర్య‌ప‌రిచేదీ, అమితంగా ఆక‌ట్టుకునేదీ రాశీ ఖ‌న్నా. డాక్ట‌ర్ ఆలియా చోక్సీ క్యారెక్ట‌ర్‌లో ఆమె సూప‌ర్బ్‌గా రాణించింది. చెప్పాలంటే అజ‌య్ దేవ్‌గ‌ణ్‌కు పోటీగా న‌టించి ఆక‌ట్టుకుంది. 

ఆలియా త‌ల్లితండ్రులతో పాటు వారి పెంపుడు కుక్క కూడా వారి ఇంట్లోనే దారుణ హ‌త్య‌కు గుర‌వుతారు. ఆమెనే ప్రాథ‌మిక అనుమానితురాలిగా భావిస్తాడు రుద్ర‌. కానీ ఆమెకు వ్య‌తిరేకంగా ఎలాంటి ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ ల‌భించ‌వు. అందువ‌ల్ల ఆమెను వ‌దిలేయాల్సి వ‌స్తుంది. ఆ త‌ర్వాత నుంచీ రుద్ర‌ను ఆడుకోవ‌డం మొద‌లుపెడుతుంది ఆలియా. ఇంకోవైపు రుద్ర వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటాడు. ఎప్పుడూ కేసుల ఇన్వెస్టిగేష‌న్‌తో బిజీగా ఉంటూ త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌ని భావించిన అత‌ని భార్య శైల (ఇషా డియోల్‌) అత‌ని నుంచి విడిపోయి రాజీవ్ అనే బాయ్‌ఫ్రెండ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతుంది. ఆ విష‌యం తెలుసుకున్న ఆలియా చేసే ప‌నులు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.

రుద్ర లేడీ బాస్‌గా అశ్విని క‌ల్సేక‌ర్‌, రుద్ర స‌హోద్యోగులుగా అతుల్ కుల‌క‌ర్ణి, త‌రుణ్ గెహ్లాట్ తమ పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు. శైల బాయ్‌ఫ్రెండ్ రాజీవ్‌పై జ‌రిగిన దాడి కేసులో రుద్ర‌ను విచారించే జాయింట్ క‌మిష‌న‌ర్ ర‌మ‌ణ్ ఆచార్య‌గా ఆశిష్ విద్యార్థి క‌నిపించారు. ఒక హ‌త్య కేసులో జైలు జీవితం గ‌డుపుతూ, కొడుకును ఉన్మాదిగా మార్చి, అనేక‌మంది పోలీసుల‌ను అత‌డి చేత చంపించే క‌ల్నల్ య‌శ్వంత్ నికోస్‌గా మిళింద్ గునాజీ న‌టించాడు.

చెప్పుకోద‌గ్గ విష‌య‌మేమంటే, సిరీస్ మొత్తం మీద న‌ట‌న‌ప‌రంగా మ‌న‌ల్ని బాగా ఆక‌ట్టుకునేది అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, రాజీ ఖ‌న్నాలే. దేవ్‌గ‌ణ్ ఎలాంటి ప‌ర్ఫార్మ‌రో మ‌న‌కు తెలుసు. భిన్న కోణాలుండే ఆ క్యారెక్ట‌ర్‌ను ఎంతో సునాయాసంగా ఆయ‌న‌ చేసుకుపోయాడు. ఇప్ప‌టిదాకా రాశీ ఇచ్చిన బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ మాత్రం 'రుద్ర‌'లో ఆలియా చోక్సీ క్యారెక్ట‌ర్ కోస‌మేన‌ని చెప్పాలి. ఆమె హావ‌భావాలు సూప‌ర్బ్‌. ముఖ్యంగా దేవ్‌గ‌ణ్ ముఖంలో ముఖంపెట్టి మాట్లాడే సీన్ల‌లో రాశీని చూసి తీరాల్సిందే. క‌ల‌ర్డ్ విగ్ ధ‌రించిన‌ప్పుడు మాత్రం ఆమె మేక‌ప్ ఎక్కువైన‌ట్లు అనిపిస్తుంది.

రుద్ర భార్య శైల‌గా ఇషా డియోల్ సెటిల్డ్‌గా న‌టించింది. లోకం దృష్టిలో గొప్ప ఆధ్యాత్మిక‌వేత్త‌, ఇళ్ల‌ల్లో ఒంట‌రిగా ఉన్న ఆడ‌వాళ్ల‌ను కిడ్నాప్‌చేసి, వాళ్ల ర‌క్తాన్ని జుర్రుకునే ర‌క్త‌పిపాసి సిద్ధేశ్వ‌ర్ కుమార్ పాత్ర‌లో కె.సి. శంక‌ర్ రాణించాడు. శైల బాయ్‌ఫ్రెండ్ రాజీవ్‌గా స‌త్య‌దేవ్ మిశ్రా క‌నిపించాడు. సిరీస్ ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆక‌ట్టుకుంటుంది. థ్రిల్ల‌ర్స్‌ను ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు రుద్ర మంచి టైమ్‌పాస్ నిస్తుంది.