English | Telugu

చోప్రా ఇంట క‌ల్యాణ వైభోగ‌మే!

మిస్ ప‌రిణీతి చోప్రా, త్వ‌ర‌లోనే మిసెస్ రాఘ‌వ్ చ‌ద్దాగా మార‌బోతున్నారు. ఈ ఏడాది మొద‌ట్లో వీరిద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. అంత‌కుముందు కొన్నాళ్ల‌పాటు క‌లిసిక‌ట్టుగా పాప‌రాజీల కంట‌ప‌డేవారు ఈ జంట‌. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత ఓపెన్‌గానే క‌నిపించారు. పెళ్లి డేటును మాత్రం గుట్టుగా ఉంచారు. ఎట్ట‌కేల‌కు వీరి పెళ్లి డీటైల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. రాఘ‌వ్ చ‌ద్దా, ప‌రిణీతి చోప్రా వివాహం ఈ నెల 24న అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఉద‌య్‌పూర్‌లోని పిక్చ‌ర్‌స్క్యూలో ఈ వేడుక‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. సెప్టెంబ‌ర్ 23 నుంచి అస‌లైన పెళ్లి ప‌నుల‌న్నీ మొద‌ల‌వుతాయి. ది లీలా ప్యాల‌స్‌లోనూ, ది తాజ్ లేక్ ప్యాల‌స్‌లోనూ వివాహానికి సంబంధించి అన్నీ వేడుక‌లు జ‌రుగుతాయి. ప‌రిణీతి చోప్రా సెప్టెంబ‌ర్ 23న ఉద‌యం 10 గంట‌ల‌కు చూరా సెరిమ‌ణీలో పాల్గొంటారు. ఆ వెంట‌నే వెల్క‌మ్ లంచ్ ఉంటుంది. సాయంత్రం గ్రాండ్ సెల‌బ్రేష‌న్స్ ఉంటాయి. వ‌ధూవ‌రుల కుటుంబ‌స‌భ్యులంద‌రూ క‌లుసుకునేది అక్క‌డే. 90ల్లో జ‌రిగే పార్టీల‌కు సంబంధించిన థీమ్‌ని ఇక్క‌డ రీక్రియేట్ చేస్తారు.

సెప్టెంబ‌ర్ 24న తాజ్ లేక్ ప్యాల‌స్‌లో మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు సెహ్ర‌బంధీ సెర‌మ‌ణీ జ‌రుగుతుంది. త్రెడ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ థీమ్ తో ఇది సాగుతుంది. రెండు గంట‌ల నుంచి బారాత్ మొద‌ల‌వుతుంది. లీలా ప్యాల‌స్లో పెళ్లి కోసం డివైన్ ప్రామిసెస్ - ఎ ప‌ర్ల్ వైట్ ఇండియ‌న్ వెడ్డింగ్ అనే కాన్సెప్ట్ ప్లాన్ చేశారు. జయ‌మాల మ‌ధ్యాహ్నం 3.30కి ఉంటుంది. విడై సాయంత్రం 7.30కి ఉంటుంది. ఆ రాత్రి పూర్తిగా రిసెప్ష‌న్ ఉంటుంది. 8.30 నుంచి వైభ‌వంగా రిసెప్ష‌న్ జ‌రుగుతుంది. ఈ వివాహ వేడుక‌కు ఇరు కుటుంబీకుల‌తో పాటు ఇండ‌స్ట్రీ నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు, రాజ‌కీయంగానూ ప‌లువురు నాయ‌కులు పాల్గొంటారు. ముంబైలోనూ, డిల్లీలోనూ ఘ‌నంగా రిసెప్ష‌న్ కూడా ఏర్పాటు చేశారు.