English | Telugu

అది బైక్ యాక్సిడెంట్‌.. ప‌క్క‌టెముక చిట్లింది.. వెల్ల‌డించిన‌ ప్రియాంక భ‌ర్త‌!

 

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంకా చోప్రా భ‌ర్త, సింగ‌ర్ నిక్ జోనాస్ త‌ను ప‌నిచేస్తున్న 'ద వాయిస్' రియాలిటీ షో సెట్స్‌పై గాయాల‌తో హాస్పిట‌ల్ పాల‌యిన విష‌యం తెలిసిందే. చికిత్స తీసుకొని తిరిగి సోమ‌వారం సెట్స్ మీద‌కు వ‌చ్చాడు నిక్‌. ఈ సంద‌ర్భంగా త‌నకు ఎలా గాయ‌మైందో వెల్ల‌డించాడు. షూటింగ్ సంద‌ర్భంగా బైక్ మీద నుంచి జారి కింద‌ప‌డ్డాన‌ని అత‌ను చెప్పాడు. 

"ఇప్పుడు నేను ఒకే. నా ప‌రిస్థితి మెరుగ‌య్యింది." అని అత‌ను తెలిపాడు. బైక్ యాక్సిడెంట్ కార‌ణంగా త‌న ప‌క్క‌టెముక ఒక‌టి చిట్లింద‌నీ, దాంతో పాటు చ‌ర్మం కొన్ని చోట్ల గీరుకుపోయింద‌నీ, వాపులు వ‌చ్చాయ‌నీ నిక్ వెల్ల‌డించాడు. కాగా ప‌క్క‌టెముక‌లో క్రాక్ వ‌చ్చింది కాబ‌ట్టి త‌న‌ను ఎక్కువ‌గా న‌వ్వించ‌వ‌ద్ద‌ని 'ద వాయిస్' షోలో త‌న‌తో పాటు కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న బ్లేక్ షెల్ట‌న్‌తో స‌ర‌దాగా చెప్పాడు. "నువ్వు సానుభూతి ఓట్ల‌ను పొందాల‌నుకుంటున్నావ్" అని బ్లేక్ జోక్ చేయ‌గా, "అవును. దానికి చాలా పెద్ద ప్లానే ఉంది" అని త‌ను కూడా జోక్ వేశాడు. అలాగే 'ద వాయిస్' సెట్స్‌పై నుంచి ఓ సెల్ఫీ వీడియోను తీసి త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు నిక్‌. 

ప్ర‌స్తుతం నిక్ లాస్ ఏంజెల్స్‌లో ఉండ‌గా, ప్రియాంక లండ‌న్‌లో ఉంది. ప‌లు ప్రాజెక్టుల కార‌ణంగా ఆమె 2020 చివ‌రి నుంచి అక్క‌డే ఉంది. నిక్ 'ద వాయిస్' షోకు ప‌నిచేస్తూ, త‌న 'స్పేస్‌మ్యాన్' ఆల్బ‌మ్‌ను లాంచ్ చేశాడు.

కాగా 28 సంవ‌త్స‌రాల నిక్ టైప్ 1 డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని మూడేళ్ల క్రిత‌మే అత‌ను వెల్ల‌డించాడు. త‌న‌కు ప‌న్నెండేళ్ల వ‌య‌సులోనే ఆ వ్యాధి ఉన్న‌ట్లు గుర్తించార‌ని అత‌ను తెలిపాడు. అయితే వ‌ర్క‌వుట్స్ ద్వారా, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం ద్వారా దాన్ని కంట్రోల్‌లో ఉంచ‌గ‌లుగుతున్నాన‌ని కూడా నిక్ చెప్పాడు.

ఇటీవ‌ల ప్రియాంక‌, నిక్ క‌లిసి ఇండియాలో కొవిడ్‌-19 రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 1 మిలియ‌న్ డాల‌ర్లు (7.32 కోట్ల రూపాయ‌లు) సేక‌రించారు. మొద‌ట అనుకున్న ల‌క్ష్యాన్ని అధిగ‌మించాక‌, త‌మ టార్గెట్ అమౌంట్‌ను 3 మిలియ‌న్ డాల‌ర్ల‌కు వారు పెంచారు.