Read more!

English | Telugu

ఆర్య‌న్ ఖాన్‌పై డ్ర‌గ్ కేసును ఉప‌సంహ‌రించుకున్న ఎన్సీబీ.. న‌ష్ట‌ప‌రిహారం ఎవ‌రు చెల్లిస్తారు?

 

క్రూయిజ్ షిప్‌లోని ప్రయాణికులపై దాడి చేసి అరెస్టు చేసిన ఆర్యన్ ఖాన్, మరో ఐదుగురిపై ఉన్న అన్ని ఆరోపణలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉప‌సంహ‌రించుకుంది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థకు అవమానకరమైన విష‌యంగా విశ్లేష‌కులు భావిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి ముంబై పోలీసులు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయ‌డం లేద‌నే అభిప్రాయంతో అనేక కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాంతర దర్యాప్తును ప్రారంభించిన విష‌యం మ‌న‌కు తెలుసు. మ‌హారాష్ట్రలో అప్ప‌టి ఎన్సీబీ హెడ్‌గా ఉన్న స‌మీర్ వాంఖ‌డే త‌న సెల‌బ్రిటీ హంట్‌లో భాగంగా ఆర్య‌న్ ఖాన్‌ను డ్ర‌గ్ కేసులో ఇరికించాడు. 2021 అక్టోబ‌ర్‌లో ముంబై పోర్ట్ నుంచి గోవాకు బ‌య‌లుదేరిన క్రూయిజ్ బోట్‌పై దాడి చేసిన ఎన్సీబీ అధికారులు అందులో ఉన్న షారుక్ ఖాన్ కొడుకు ఆర్య‌న్‌ను అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. అయితే అత‌ని ద‌గ్గ‌ర వారికి డ్ర‌గ్స్ లాంటివేమీ ల‌భించ‌లేదు. అంతే కాదు, అతను నార్కోటిక్ ప‌దార్ధాల‌నేవైనా సేవించాడా అనే విష‌యం తెలుసుకోడానికి ఎలాంటి టెస్టూ నిర్వ‌హించ‌లేదు. ఆర్య‌న్ త‌న స్నేహితుల‌తో జ‌రిపిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా అత‌ను నార్కోటిక్స్ ట్రాఫికింగ్ రింగ్‌లో భాగ‌స్వామి అని అత‌నిపై కేసు పెట్టారు. అత‌నిని రిమాండ్‌కూ త‌ర‌లించారు. త‌ర్వాత అత‌నిపై ఎలాంటి ప్రాథ‌మిక ఆధారాలూ ల‌భించ‌లేద‌ని బెయిల్ మంజూర్ చేసింది ముంబై హైకోర్టు.

కావాల‌నే ఆర్య‌న్ ఖాన్‌ను ఈ కేసులో ఇరికించారంటూ ఎన్సీపీ నాయ‌కుడు న‌వాబ్ మాలిక్ చేసిన ఆరోప‌ణ‌ల‌తో ఈ కేసును ద‌ర్యాప్తు చేయ‌డానికి ఎన్సీబీ బాస్‌లు ఒక స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను నియ‌మించారు. ఏడు నెల‌లు గ‌డిచాయి. ఆర్య‌న్‌, అత‌ని ఐదుగురు స్నేహితుల‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేదు. ఆ టైమ్‌లో మ‌రో 14 మందిని కూడా అరెస్ట్ చేసి, చార్జ్‌షీట్ పెట్టారు. మొత్తం 20 మంది అంత‌ర్జాతీయ కుట్ర‌లో భాగ‌మంటూ అప్పుడు వాంఖ‌డే ఆరోపించారు. ఇప్పుడు ఈ కేసులో వాంఖ‌డేకి శిక్ష త‌ప్ప‌ద‌ని ఎన్సీబీ అధికారులు చెప్తున్నారు. కానీ డ్రగ్స్ తీసుకుంటూ, డ్ర‌గ్ పెడ్ల‌ర్స్‌గా ముద్ర‌ప‌డి జైలులో గ‌డిపిన ఆరుగురు కుర్రాళ్ల‌కు జ‌రిగిన న‌ష్టానికి ఎవ‌రు ప‌రిహారం చెల్లిస్తారు?  వారి కుటుంబాలు అనుభ‌వించిన మాన‌సిక వేద‌న‌ను ఎవ‌రు తీరుస్తారు?

అదివ‌ర‌కు రియా చ‌క్ర‌వ‌ర్తిని వెంటాడి వేధించిన ఓ వ‌ర్గం మీడియా, షారుక్ ఖాన్‌నూ, అత‌డి కొడుకునూ కూడా అలాగే వెంటాడి వేధించింది. వాంఖ‌డే చెప్పిన థీరీని వ‌ల్లె వేస్తూ వారిపై అనేక క‌థ‌నాలు ప్ర‌చురించింది. నిజాయితీ లోపించిన ఈ క‌థ‌నాల కార‌ణంగా అన్యాయంగా కొన్ని కుటుంబాలు మ‌నో వేద‌న‌కు గుర‌వుతున్నాయ‌ని ఆ వ‌ర్గం మీడియా ఏమాత్రం ఆలోచించ‌లేదు.