English | Telugu
ఆ యాక్టర్ కనిపిస్తేనే మృణాల్ ఠాకూర్ పెళ్లి!
Updated : Oct 12, 2023
మృణాల్ ఠాకూర్ పేరు చెప్పగానే అందరికీ సీతారామమ్ సినిమాలో రామ్ ప్రేమ కోసం పరితపించిన సీత గుర్తుకొస్తుంది. సిల్వర్ స్క్రీన్ మీద సీత పాత్రలో జీవించేసిన మృణాల్ రియల్ లైఫ్‌లో పెళ్లి చేసుకోదా? సింగిల్‌గానే ఉండిపోతుందా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. మృణాల్ నటించిన లేటెస్ట్ సినిమా ఆంఖ్ మిచోలి. ఈ సినిమా ప్రమోషన్లలో తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడింది మృణాల్ ఠాకూర్. అక్టోబర్ 27న విడుదల కానుంది ఈ మూవీ. ఆంఖ్ మిచోలిలో అభిమన్యు దాసాని, పరేష్ రావల్ కీ రోల్స్ చేశారు. మృణాల్ మాట్లాడుతూ ``ఇప్పటికి నేను సింగిల్‌గానే ఉన్నాను. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని చాలా సార్లు అడుగుతున్నారు. పెళ్లి అనేది తప్పకుండా ఆనందంగానే ఉంటుంది. కాకపోతే నాకు కావాల్సిన వ్యక్తి దొరకాలి. నాకు కావాల్సిన వ్యక్తి పేరేంటో తెలుసా? కియాను రీవ్స్. అతను కనిపిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటా`` అని చెప్పింది. ఇంతకీ కియాను రీవ్స్ ఎవరని ఆరా తీస్తే కెనెడియన్ యాక్టర్, మ్యూజీషియన్ అని అర్థమైంది. ది మేట్రిక్స్ సైన్స్ ఫిక్షన్ సీరీస్‌తో పాపులర్ అయ్యారు రీవ్స్.
అంతే కాదు, మృణాల్ మీద కరీనా కపూర్ ఖాన్ ఇన్‌ఫ్లుయన్స్ చాలా ఉందట. జబ్ వి మెట్ సినిమాను ఎన్నిసార్లు చూశానో గుర్తే లేదంటోంది మృణాల్. ఆమె మాట్లాడుతూ ``గీత్ డైలాగ్స్ అన్నీ నాకు కంఠతా వచ్చు. నాకు నేనే ఫేవరేట్ అనే మాట నుంచి నా లైఫ్‌కి కావాల్సిన ఎన్నెన్నో విషయాలను నేను గీత్ ద్వారా తెలుసుకున్నాను. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఇతరుల్ని ఎంతగా ప్రేమిస్తామో, అంతకన్నా ఎక్కువగా మనల్ని మనం ఇష్టపడాలి. అప్పుడే జీవితాన్ని సంపూర్ణంగా జీవించి వాళ్లం అవుతాం. మన సంతోషం ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడకూడదు. నేను ఈ జీవితంలో ఏం చేసినా నాకోసమే చేసుకుంటాను. నేను తీసుకున్న నిర్ణయాలు సరైనవైతే సూపర్. ఒకవేళ కాకపోయినా నేను ఇంకొకరిని నిందించాల్సిన అవసరం లేదు`` అని చెప్పింది మృణాల్.