English | Telugu
మందిరా బేడి భర్త డైరెక్టర్ రాజ్ కౌశల్ గుండెపోటుతో మృతి
Updated : Jun 30, 2021
'సాహో' నటి మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ తీవ్ర గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు కన్నుమూశారు. వృత్తిరీత్యా నిర్మాత-దర్శకుడు అయిన రాజ్ కౌశల్ వయసు 49 సంవత్సరాలు. ఆయన 'ప్యార్ మే కభీ కభీ', 'షాదీ కా లడ్డూ' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన వాణిజ్య ప్రకటనల రూపకర్త కూడా. ఆదివారం మందిర, రాజ్ కౌశల్ ఇచ్చిన గెట్-టుగెదర్ పార్టీకి వారి సన్నిహితులు నేహా ధూపియా, అంగద్ బేడి, సాగారికా ఘట్గే, క్రికెటర్ జహీర్ ఖాన్, ఆశిష్ చౌదరి, అతని భార్య హాజరయ్యారు. రాజ్ మృతి చెందారనే దురదృష్టకర వార్త వినవచ్చిన తరువాత మందిరా బేడి నివాసానికి మొదటగా చేరుకున్న వారిలో ఆశిష్ చౌదరి ఒకరు.
డైరెక్టర్ ఓనిర్ ప్రేమపూర్వకంగా రాజ్ కౌశల్‌ను జ్ఞాపకం చేసుకుని, ట్విట్టర్‌లో "చాలా త్వరగా వెళ్లిపోయారు. ఈ రోజు ఉదయం మనం డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాజ్ కౌశల్‌ను కోల్పోయాం. చాలా విచారంగా ఉంది. నా మొదటి చిత్రం మై బ్రదర్ నిఖిల్ నిర్మాతలలో ఆయన ఒకరు. మా విజన్‌ను నమ్మి, సపోర్ట్ చేసిన కొద్దిమందిలో ఆయన ఒకరు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా." అని రాసుకొచ్చారు.
గత ఏడాది జూలైలో మందిరా, ఆమె భర్త రాజ్ నాలుగేళ్ల తారాను తమ జీవితాల్లోకి ఆహ్వానించారు. ఈ దంపతులకు వీర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. తన కుమార్తెను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పరిచయం చేస్తూ, మందిరా బేడి, "లిటిల్ గాళ్ తార మా వద్దకు వచ్చింది, ఆ పైవాడి ఆశీర్వాదం లాగా. తనకు నాలుగు సంవత్సరాలు. నక్షత్రాల వలె మెరుస్తున్న కళ్ళతో వచ్చింది. వీర్‌కు ఆమె సిస్టర్. స్వచ్ఛమైన ప్రేమతో, కృతజ్ఞతతో, ఆమెకు ఇంటిలోకి స్వాగతం. తారా బేడి కౌశల్ 2020 జూలై 28న మా కుటుంబంలో భాగమైంది.” అని తెలిపారు.