Read more!

English | Telugu

రికార్డ్ బుక్స్‌ను తిర‌గ‌రాస్తున్న హిందీ 'కేజీఎఫ్ 2'

 

ప్ర‌శాంత్ నీల్ సృష్టించిన సెల్యులాయిడ్ వండ‌ర్ 'కేజీఎఫ్ చాప్ట‌ర్‌ 2' చ‌రిత్ర పుట‌ల్ని తిర‌గ‌రాస్తూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. య‌శ్ హీరోగా న‌టించిన ఈ సినిమా హిందీ వెర్ష‌న్‌ ఆదివారం నాలుగో రోజు రూ. 50.35 కోట్ల (నెట్‌)ను వ‌సూలు చేసింది. దీంతో నాలుగు రోజుల‌కు హిందీ 'కేజీఎఫ్ 2' సాధించిన వ‌సూళ్లు రూ. 193.99 కోట్ల‌కు చేరుకున్నాయి. సోమ‌వారం క‌లెక్ష‌న్ల‌తో అది రూ. 200 కోట్ల క్ల‌బ్బులో చేర‌నున్న‌ది. ఇలా ఐదు రోజుల‌కే రూ. 200 కోట్లు వ‌సూలు చేసిన తొలి హిందీ ఫిల్మ్‌గా 'కేజీఎఫ్ 2' స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించ‌బోతోంది. ఇదివ‌ర‌కు ఈ రికార్డు 'బాహుబ‌లి 2' పేరిట ఉంది. ఆ సినిమా హిందీ వెర్ష‌న్ 6 రోజుల‌కు ఈ ఫీట్‌ను సాధించింది. 

'కేజీఎఫ్ 2' హిందీ వెర్ష‌న్ క‌లెక్ష‌న్ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. మొద‌టిరోజు గురువారం రూ. 53.95 కోట్ల‌తో స‌రికొత్త రికార్డును సృష్టించింది. ఆ త‌ర్వాత శుక్ర‌వారం రూ. 46.79 కోట్లు, శ‌నివారం రూ. 43.90 కోట్ల‌ను వ‌సూలు చేసింది. హిందీ బెల్ట్‌లోనే కాకుండా బిహార్ లాంటి రాష్ట్రంలోనూ ఈ సినిమా క్రేజ్ అసాధార‌ణంగా ఉంది. అక్క‌డ సూర్యోద‌యానికి ముందుగానే ఈ సినిమా షోల‌ను వేస్తూ వ‌స్తున్నారు.

అధీర‌గా సంజ‌య్ ద‌త్‌, ప్ర‌ధాన‌మంత్రి ర‌మికా సేన్‌గా ర‌వీనా టాండ‌న్‌, హీరోయిన్‌గా శ్రీ‌నిధి శెట్టి న‌టించిన ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్‌, భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ ఈ సినిమాను వేరే లెవ‌ల్లో నిలిపింది.