English | Telugu

ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్సీబీ టీమ్ ఎలా అరెస్ట్ చేసిందంటే...

షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్ట్ చేసిన కొన్ని గంట‌ల త‌ర్వాత‌, ఆదివారం అర్ధ‌రాత్రి ముంబైలోని షారుక్ ఇంటికి వెళ్లాడు స‌ల్మాన్ ఖాన్‌. షారుక్ ఇల్లు మ‌న్న‌త్ గేట్ లోప‌ల వైట్ ఎస్‌యూవీలో బ్లాక్ సీట్‌లో కూర్చొని వున్న స‌ల్మాన్ ఫొటోలు, విజువ‌ల్స్ ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారాయి.

ఆదివారం ముంబై స‌ముద్ర తీరంలో ఒక క్రూయిజ్ షిప్ మీద దాడిచేసిన ఎన్సీబీ అధికారులు అందులో పార్టీ చేసుకుంటున్న 23 సంవ‌త్స‌రాల ఆర్య‌న్‌తో పాటు మ‌రో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఆర్య‌న్ అరెస్టును అధికారులు క‌న్ఫామ్ చేయ‌డానికి ముందు షారుక్ త‌న లాయ‌ర్ ఆఫీసుకు వెళ్ల‌డం క‌నిపించింది. నిషేధిత ప‌దార్థాల‌ను కొన‌డం, క‌లిగివుండ‌టం, వాడ‌టం అనే అభియోగాల కింద ఆర్య‌న్‌ను అరెస్ట్ చేసిన‌ట్లు ఎన్సీబీ తెలిపింది. రేప‌టి వ‌ర‌కూ అత‌ను ఎన్సీబీ క‌స్ట‌డీలో ఉండ‌నున్నాడు.

ఆర్య‌న్‌ను కేవ‌లం చాట్ మెసేజ్‌ల ఆధారంగా అరెస్ట్ చేశార‌నీ, అందువ‌ల్ల అత‌నికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆర్య‌న్ త‌ర‌పు లాయ‌ర్ స‌తీశ్ మ‌నేషిండే కోర్టును అభ్య‌ర్థించారు. ఆర్య‌న్‌కు క్రూయిజ్‌లో టికెట్ కానీ, క్యాబిన్ కానీ, సీట్ కానీ లేదు. త‌న‌ను ఆహ్వానించినందునే అక్క‌డ‌కు వెళ్లాడు. అత‌నికి క‌నీసం బోర్డింగ్ పాస్ కూడా లేదు. అత‌ని ద‌గ్గ‌ర ఏమీ దొర‌క‌లేదు. కేవ‌లం చాటింగ్‌ను ఆధారం చేసుకొని అత‌డిని అరెస్ట్ చేశారు అని లాయ‌ర్ చెప్పారు.

ఎన్సీబీ టీమ్ శ‌నివారం ఉద‌యం ప్ర‌యాణీకుల మాదిరిగా గోవా వెళ్లే క్రూయిజ్ ఓడ‌లోకి ఎక్కిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అధికారులు చెప్పిన దాని ప్ర‌కారం, షిప్ ముంబై నుంచి బ‌య‌లుదేరాక‌, స‌ముద్రంలో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు పార్టీ ప్రారంభ‌మైంది. ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన దాడులు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కూ కొన‌సాగాయి.