English | Telugu

రెండో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌-డైరెక్ట‌ర్ ఫ‌రాన్ అఖ్త‌ర్‌, న‌టి-గాయ‌ని శిబానీ దండేక‌ర్ శ‌నివారం మ‌హారాష్ట్ర‌లోని ఖండాలాలో వివాహం చేసుకున్నారు. స‌న్నిహితులు, స్నేహితుల స‌మ‌క్షంలో సంద‌డిగా జ‌రిగిన ఈ వేడుక‌లో బ్లాక్ సూట్‌లో ఫ‌రాన్‌, రెడ్ డ్ర‌స్‌లో శిబానీ మెరిశారు. పెళ్లి ప్ర‌మాణానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అంత‌కుముందు హృతిక్ రోష‌న్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు, రియా చ‌క్ర‌వ‌ర్తి, డైరెక్ట‌ర్ అశుతోష్ గోవ‌రిక‌ర్ త‌దిత‌ర సెల‌బ్రిటీలు పెళ్లికి అటెండ్ అవుతున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఈరోజు ఉద‌యం పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను శిబానీ త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసి, “let’s do this.” అనే కాప్ష‌న్ జోడించింది.

గురువారం ముంబైలో ఫ‌రాన్‌, శిబానీ జోడీ మెహందీ, సంగీత్ వేడుక‌ల‌ను నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల్లో శిబానీ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ మెహందీ ల‌గా కే ర‌ఖ్‌నా పాట‌కు డాన్స్ చేస్తున్న వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అనూషా దండేక‌ర్‌, రియా చ‌క్ర‌వ‌ర్తి కూడా ఈ వేడుక‌లో క‌నిపించారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా పెళ్లి వేడుక‌ను సింపుల్‌గా నిర్వ‌హిస్తున్న‌ట్లు అదివ‌ర‌కు ఫ‌రాన్ తండ్రి, ఫేమ‌స్ ఫిల్మ్ రైట‌ర్ జావెద్ అఖ్త‌ర్ తెలిపారు.

ముంబైలో 2018లో జ‌రిగిన దీపికా ప‌డుకోనే, ర‌ణ‌వీర్ సింగ్ పెళ్లి రిసెప్ష‌న్‌లో ఫ‌రాన్‌, శిబానీ జంట‌గా కెమెరాల‌కు పోజిచ్చారు. అప్ప‌ట్నుంచీ తాము ల‌వ్‌లో ఉన్న‌ట్లు బ‌హిరంగంగానే న‌డ‌చుకుంటూ వ‌చ్చారు. 2021లో త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫ‌రాన్ పేరును త‌న మెడ‌మీద టాట్టూ వేయించుకొని, దానికి సంబంధించిన ఫొటోను షేర్ చేసింది శిబానీ.

కాగా, 41 ఏళ్ల‌ శిబానీతో 47 ఏళ్ల‌ ఫ‌రాన్‌కు ఇది రెండో పెళ్లి. ఇదివ‌ర‌కు 2000 సంవ‌త్స‌రంలో పూణేకు చెందిన హెయిర్ స్టైలిస్ట్ అధునా భ‌బానీతో ఆయ‌న పెళ్ల‌యింది. 2017లో ఆ ఇద్ద‌రూ విడిపోయారు. అధున‌తో ఫ‌రాన్‌కు శ‌క్య‌, అకిర అనే ఇద్ద‌రు కుమార్తెలున్నారు.

'దిల్ చాహ్‌తా హై' లాంటి సూప‌ర్ హిట్ సినిమాని డైరెక్ట్ చేసిన ఫ‌రాన్‌.. ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌గా మారి 'భాగ్ మిల్ఖా భాగ్' మూవీలో మిల్ఖా సింగ్‌గా న‌టించి అంద‌రి అభిమానాన్నీ పొందాడు. ఆ త‌ర్వాత 'జింద‌గీ నా మిలేగీ దొబారా', 'తూఫాన్' సినిమాల్లో హీరోగా న‌టించాడు.