Read more!

English | Telugu

‘డంకీ’ మూవీ రివ్యూ

 

సినిమా: డంకీ

నటి నటులు :షారుక్ ఖాన్ ,తాప్సి పొన్ను, విక్రమ్ కొచ్చర్, విక్కీకౌశల్, బొమన్ ఇరానీ,సతీష్ షా తదితరులు 
రచన దర్శకత్వం: రాజ్ కుమార్ హిరానీ
ప్రొడ్యూసర్స్ :రాజ్ కుమార్ హిరానీ, గౌరీ ఖాన్, జ్యోతి దేశ్ పాండే,
సినిమాటోగ్రఫీ :సి.కే మురళిధరన్, మనీష్ నందన్ 
విడుదల తేదీ :డిసెంబర్ 21 

సినీ ప్రపంచంలో కాకలు దీరిన ఇద్దరు యోధుల నుంచి వచ్చిన డంకీ సినిమా మీద భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పఠాన్ ,జవాన్ సినిమాల భారీ విజయాలతో షారుఖ్ మంచి జోరు మీద ఉంటే వరుస హిట్ చిత్రాల సృష్టికర్త రాజ్ కుమార్ హిరానీ  సుమారు ఆరు సంవత్సరాల తర్వాత సంజు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డంకీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి డంకీ అందరి అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.

కథ:

90 వ దశకంలో పంజాబ్ రాష్ట్రంలోని లాల్ టు అనే ఒక టౌన్ లో మను (తాప్సి ) ఒక చిన్న హోటల్ లో వంట మాస్టర్ గా పని చేస్తు ఉంటుంది. మనుతో పాటు ఆమె ఫ్రెండ్స్ ( విక్రమ్ కొచ్చర్,అనిల్ గ్రోవర్ ) కూడా చిన్న చిన్న పనులు చేస్తుంటారు.ఈ ముగ్గురు డబ్బు సంపాదించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లాలనే లక్ష్యంతో అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే మను మరో ఫ్రెండ్  సుఖీ  (విక్కీ  కౌశల్) ఇంగ్లాండ్ లో ఉన్న తన ప్రేయసి కోసం ఇంగ్లాండ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. కానీ వీళ్ళకి పెద్దగా చదువు గాని ఆస్తులు గాని ఉండవు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ నుంచి హార్ది సింగ్ ( షారుక్ ఖాన్) లాల్ టు కి వచ్చి మను అండ్ ఫ్రెండ్స్ కి బాగా దగ్గరయ్యి వాళ్ళ కోరికని తెలుసుకుంటాడు. మరి ఇంగ్లాండ్ వెళ్లాలని ఆశే తప్ప ఆర్ధికంగా ఎలాంటి అర్హత లేని ఆ ముగ్గురు ఇంగ్లాండ్ వెళ్లేలా హార్డీ చేశాడా ? అసలు షారుక్ అక్కడకి ఎందుకు వచ్చాడు? అసలు వాళ్ళందరు ఎందుకు ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటున్నారు?  ఒక వేళ అందరు  ఇంగ్లాండ్ వెళితే ఎలా వెళ్లారు ? అక్కడ ఏం జరిగింది అనేదే ఈ చిత్ర కథ.

ఎనాలసిస్ :

ఈ మూవీ నూటికి నూరుపాళ్లు రాజ్ కుమార్ హిరానీ సృష్టించిన ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. ఒక మనిషి ఆశకి సంబంధించిన కథ ని రాజ్ కుమార్ హిరానీ చాలా చక్కగా ప్రెజంట్ చేసాడు. ముఖ్యంగా షారుఖ్ పాత్రని అయన నడిపిన తీరు సూపర్ గా ఉంది. తాను ఎంచుకున్న కథ యొక్క లక్ష్యం సినిమా బిగింగ్ లోనే చెప్పినప్పినప్పటికీ ఆ కథ నడవడానికి ఆయన ఎంచుకున్న కథనం ఎంతో మంది కొత్త పాత దర్శకులకి ఒక లెసన్ అని చెప్పవచ్చు. షారుక్ తాప్సిలతో సహా అందరు ఇంగ్లీష్ నేర్చుకొనే సీన్స్ గాని ఇంగ్లాండ్ వెళ్ళడానికి వీసా కోసం ఇండియాలో ఉండే ఇంగ్లాండ్ ఆఫీసర్స్ ని కలిసి ఇంటర్వ్యూ ని ఫేస్ చేసే సీన్స్ గాని సూపర్ గా నవ్వుని తెప్పించాయి. అలాగే కాలక్రమంలో 25  సంవత్సరాలు దాటిపోయినా కూడా  షారుక్ తాప్సి ఒకరికొకరు పెళ్లి చేసుకోకుండా ఉండటం సూపర్ గా ఉంది. టోటల్ గా సినిమా అయితే ఒక మంచి మెసేజ్ తో కూడిన క్లీన్ ఎంటర్ టైనర్. అన్ని  వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది. అలాగే ఒక మనిషికి తన యుక్త వయసులో ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలని అనిపించినా కూడా మనకి  జన్మ నిచ్చిన జన్మభూమి కంటే గొప్పదేది ఉండదని కూడా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ చాలా చక్కగా చెప్పాడు. అలాగే డబ్బు ఉన్నవాళ్లు మాత్రమే ఇతర దేశాలకి వెళ్తున్నారు. కానీ డబ్బు,చదువు లేని వారు డబ్బులు సంపాదించాలనే లక్యంతో  రాంగ్ రూట్ లో ఆయా దేశాలకి వెళ్తు మార్గమద్యంలోనే  ప్రాణాలు వదులుతున్నారనే విషయాన్నీ కూడా చాలా చక్కగా చూపించాడు.


నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఇక నటి నటుల విషయాన్ని వస్తే హార్ది సింగ్  క్యారక్టర్ లో షారుక్ చించి పడేసాడు. ఒక సాదా సీదా పాత్రలో కూడా ఇంత సూపర్ గా నటించవచ్చా అని షారుఖ్ నటన చూసిన ఎవరికైనా  అనిపిస్తుంది. 25  ఏళ్ళ నవయువకుడుగా ,60 ఏళ్ళు దాటిన వ్యక్తిగా ఇలా  అన్ని వేరియేషన్స్ లోను సూపర్ గా నటించి తన నటనలో సత్తా రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు అని మరోసారి నిరూపించాడు. ఇక తాప్సి పన్ను నటనని  చూసిన ఎవరికైనా వామ్మో తనలో ఇంత అధ్బుతమైన నటి ఉన్నదా అని అనిపించనకమానదు. అంతలా తాప్సి మను అనే పాత్రలో జీవించింది. అలాగే చివరిలో అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.ఇక ప్రేయసి కోసం పరితపించే పాత్రలో విక్రమ్ కౌశల్ నటన ని చుసిన ఎవరికైనా తను ఏ సినిమాలో అయినా కనపడితే ఒక్కసారిగా థియేటర్స్ లో ఈలలు ఎదుకు వేస్తారో మరోసారి అందరికి అర్ధం అయ్యేలా చేసాడు. ఇక  స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పే మాస్టర్ గా బొమన్ ఇరానీ నటన ఆ పాత్రనే మన కళ్ళ ముందుకు తీసుకొచ్చింది. ఇక దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ  స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ గా ఉంది. తనని ఎందుకు స్క్రీన్ ప్లే మాస్టర్ అని అంటారో మరో సారి నిరూపించాడు. ఫొటోగ్రఫీ అయితే కథ జరిగే పంజాబ్, లండన్ లో మనం నిజంగానే  ఉన్నామనే అనుభూతిని కలిగించింది.  

  

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:

మంచి ఆకలితో ఉన్నప్పుడు హడావిడిగా ఒక హోటల్ కి వెళ్లి మనకి నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ ఇస్తే ఆ ఫుడ్ అనుకున్న టైంకి రావడమే కాకుండా  సూపర్ టేస్టీ గా ఉంటే ఆ ఫుడ్ తింటు మనం పొందే ఆనందం ఎలా ఉంటుందో  డంకీ సినిమా చూస్తున్నంత సేపు అంతే ఆనందంగా ఉంటుంది. ఇంతకీ డంకీ కి  అర్ధం ఏంటంటే అక్రమంగా వేరే దేశానికీ ప్రయాణం సాగించడం.  

రేటింగ్ 2.75 / 5

-అరుణాచలం