Read more!

English | Telugu

'ఆదిపురుష్' కోసం రామాయ‌ణంను ఏమాత్రం వ‌క్రీక‌రించ‌లేదు.. స్ప‌ష్టం చేసిన ఓమ్ రౌత్‌

 

శ్రీ‌రామునిగా ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్‌'. 'తానాజీ' ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. భార‌తీయుల‌కు అత్యంత పూజ‌నీయ గ్రంథ‌మైన రామాయ‌ణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సీత‌గా కృతి స‌న‌న్‌, రావ‌ణునిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. అంబ‌రాన్నంటే అంచ‌నాలున్న ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో టి-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవ‌ల అయోధ్య‌లో రిలీజ్ చేసిన టీజ‌ర్‌తో ఈ సినిమాపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. పాత్ర‌ల ఆహార్యాలు ఈ విమ‌ర్శ‌ల‌కు మూలం. శివ‌భ‌క్తుడైన రావ‌ణుడిని, ఆంజ‌నేయుని రూపాన్ని ప్ర‌స్తావిస్తూ ఇద‌స‌లు రామాయ‌ణ గాథ‌తో తీస్తున్న సినిమాయేనా? అని ప్ర‌శ్నిస్తున్నారు. సీతాదేవిని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో చూపించ‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అలాగే గ్రాఫిక్ వ‌ర్క్ మ‌రీ నాసిర‌కంగా ఉందనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. టీజ‌ర్‌ను చూస్తుంటే వీడియో గేమ్ చూసిన‌ట్లుగా ఉంద‌నే కామెంట్లు వ‌చ్చాయి. కాగా రామాయ‌ణాన్ని భిన్న కోణంలో చూపిస్తున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ స్పందించాడు. రామాయ‌ణంను ఆరాధించే వారికీ, రామభ‌క్తుల‌ను 'ఆదిపురుష్' ఏమాత్రం నిరుత్సాహ‌పర్చ‌ద‌ని ఓ న్యూస్ చాన‌ల్‌కు చెప్పాడు. శ్రీ‌రాముడు త‌మ‌కు దేవుడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నీ, అలాంటి పురుషోత్త‌ముడ్ని తాము కించ‌ప‌ర‌చ‌డ‌మ‌నేది క‌ల‌లో కూడా జ‌ర‌గ‌ద‌నీ ఆయ‌న‌న్నాడు. రామాయ‌ణంను బాగా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాతే ఈ సినిమాని తీస్తున్నామ‌నీ, ఒక్క‌టంటే ఒక్క శాతం కూడా ఆ క‌థ‌కు భిన్నంగా చూపించ‌లేద‌నీ తెలిపాడు. రాబోయే త‌రాల‌కు రామాయ‌ణ గాథ‌ను చెప్పాల‌ను స‌దుద్దేశంతోనే 'ఆదిపురుష్‌'ను తీస్తున్నామ‌న్నాడు.

కాగా ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో 'ఆదిపురుష్' టీజ‌ర్‌ను 3డీ ఫార్మ‌ట్‌లో చూపించ‌గా, పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. 2డి, 3డి ఫార్మ‌ట్ల‌తో పాటు ఐమాక్స్ వెర్ష‌న్‌లోనూ ఆ మూవీ రిలీజ్ కానున్న‌ది. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌ను ఈ సినిమా కోసం కేటాయించారు.