Read more!

English | Telugu

'బ్రహ్మాస్త్ర' ట్రైలర్..  అంచనాలకు మించి ఉంది!

టాలీవుడ్ కి 'బాహుబలి' ఎలాగో బాలీవుడ్ కి 'బ్రహ్మాస్త్ర' అలా అని హిందీ సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ కపుల్ రణ్‌ బీర్‌ కపూర్‌, ఆలియా భట్ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని సౌత్ లో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటం విశేషం. 'బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ' సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో 'బ్రహ్మస్త్రం పార్ట్-1: శివ' పేరుతో విడుదల కానుంది. విడుదలకు దాదాపు మూడు నెలల ముందుగానే తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

బ్రహ్మస్త్రం ట్రైలర్ ను బుధవారం ఉదయం విడుదల చేశారు. "నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికీ అధిపతైన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతనే.. శివ!" అంటూ చిరంజీవి చెప్పే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. ఇందులో ఆలియాని ప్రేమిస్తూ సాధారణ యువకుడిలా కనిపించే రణ్‌ బీర్‌(శివ).. తాను 'అగ్నాస్త్రం'(నిప్పు) అని తెలుసుకుంటాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా అస్త్రాలుగా కనిపిస్తున్నారు. అమితాబ్ ద్వారానే తాను కూడా ఓ అస్త్రాన్ని అని రణ్‌ బీర్‌ తెలుసుకుంటాడు. పురాతన శక్తులను రక్షించే బాధ్యతను వీళ్ళు తీసుకుంటే.. బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకుని విధ్వంసం సృష్టించాలని మౌని రాయ్ వంటి వారు ప్రయత్నిస్తుంటారు. గ్రాండ్ విజువల్స్ తో మంచికి, చెడుకి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

బ్రహ్మాస్త్ర పార్ట్-1 సెప్టెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.